2021లో భారత్ వృద్ధి రేటు చైనాను దాటేయనుందా.. ఐఎంఎఫ్ అంచనా లెక్కేంటి

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమలేశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా మందగించిన భారత ఆర్థిక వ్యవస్థకు శుభవార్త.

2020లో రుణాత్మక వృద్ధిరేటు నమోదు చేసిన భారత్ 2021లో మాత్రం 11.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది.

శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే నివేదికలోనూ 2021-22లో భారత్ వృద్ధి రేటు 11 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు.

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో రెండంకెల వృద్ధి రేటు నమోదు కావొచ్చన్న అంచనా ఒక్క భారత్‌పైనే ఉంది.

ఐఎంఎఫ్ మంగళవారం వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో ఈ అంచనాలను వెల్లడించింది.

ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2021లో చైనా 8.1 శాతం వృద్ధి రేటుతో భారత్ తర్వాతి స్థానంలో నిలుస్తుంది. స్పెయిన్ 5.9 శాతం, ఫ్రాన్స్ 5.5 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయి.

ఐఎంఎఫ్ 2020కి సంబంధించి సవరించి ప్రకటించిన గణాంకాల ప్రకారం భారత్ వృద్ధిరేటు 8 శాతం మేర పడిపోయింది. పెద్ద దేశాల్లో ఒక చైనా మాత్రమే 2.3 శాతంతో ధనాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది.

ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2022లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతం, చైనా వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండే అవకాశాలున్నాయి.

ఐఎంఎఫ్

ఫొటో సోర్స్, Getty Images

తాజా అంచనాలపై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మెరుస్తున్న తార: 2021లో భారత్ వృద్ధి రేటు 11.5 శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఐఎంఎఫ్ అంచనా మంచి సంకేతమైనప్పటికీ, ఇంకా ఆర్థికవ్యవస్థ కోలుకునే పరిస్థితి రాలేదని నిపుణులు అంటున్నారు.

భారత కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

లాక్‌డౌన్ తొలగింపు ప్రభావం

ఐఎంఎఫ్ అంచనాలు పరిస్థితి మెరుగుపడిందని సూచిస్తున్నాయని, అయితే వృద్ధి రేటు ఎక్కువగా కనిపించడానికి గణితపరమైన అంశాలే కారణమని సీనియర్ వాణిజ్య పాత్రికేయురాలు పూజా మెహ్రా అభిప్రాయపడ్డారు.

‘‘ఒక ఏడాది వృద్ధి రేటు రుణాత్మకంగా ఉంటే, ఆ మరుసటి ఏడాది కొంచెం వృద్ధి ఉన్నా భారీ తేడా వచ్చినట్లు గణాంకాలు చూపిస్తాయి. లాక్‌డౌన్ సమయంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. అవి మళ్లీ మొదలయ్యాయి. పరిశ్రమలు నడవడం మొదలైంది. ఉత్పత్తి ఆరంభమైంది. కొనుగోళ్లు జరుగుతున్నాయి. జనాలకు పని దొరికింది. దీంతో ఆర్థికవ్యవస్థలో మళ్లీ చలనం వచ్చింది. ఇదివరకు జరిగిన నష్టం నుంచి బయటపడటం మొదలైంది’’ అని ఆమె అన్నారు.

‘‘ఆర్థికవ్యవస్థ ఎంతవరకూ కోలుకుందన్నది జీడీపీ ఆధారంగా సరిగ్గా లెక్కించవచ్చు. లాక్‌డౌన్‌కు ముందు జీడీపీ ఎలా ఉంది? ఇప్పుడు ఎంత మేర ఉంది? అన్నవి చూడాలి’’ అని అన్నారు.

2020 జీడీపీ గణాంకాలు ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉందని, అందులో అసంఘటిత రంగానిది పెద్ద పాత్ర అని పూజా అభిప్రాయపడ్డారు.

‘‘ఈ గణాంకాలన్నీ రావడానికి చాలా సమయం పడుతుంది. అసంఘటిత రంగం, అందులో పనిచేసేవారిపై కరోనావైరస్ సంక్షోభం ప్రభావం ఎలా ఉంటుందన్నది తెలిస్తేనే జీడీపీని సరిగ్గా అంచనా వేయగలం’’ అని ఆమె అన్నారు.

అయితే, లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయని కూడా నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో రోజువారీ కరోనావైరస్ కేసుల సంఖ్య 20 వేల కన్నా తక్కువగానే ఉంది. ఇది క్రమంగా పడిపోతూ వస్తోంది. కరోనా వ్యాక్సీనేషన్ కూడా మొదలైంది. దీంతో జనాల్లో కరోనా భయం తగ్గిపోయింది. జనజీవనం సాధారణంగా మారిపోతోంది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

‘‘2020 ఏప్రిల్‌లో వేసిన అంచనాలు లాక్‌డౌన్ మీద ఆధారపడి వేసినవే. అప్పుడు రుణాత్మక వృద్ధి పరిస్థితులే ఉన్నాయి. కానీ, అవి మానవ నిర్మిత పరిస్థితులు. పరిశ్రమలు స్వయంగా కార్యకలాపాలు ఆపేశాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్లీ మొదలుపెడుతున్నాయి. దీంతో వృద్ధి కూడా పుంజుకుంది’’ అని కేర్ రేటింగ్ ఏజెన్సీ చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ అన్నారు.

‘‘ఉదాహరణకు మనం పదో లెవల్‌లో ఉన్నాం అనుకుంటే, ఒక్కసారిగా ఆంక్షలు రావడంతో రెండో లెవల్‌కు పడిపోయాం. ఆంక్షలు తొలగడంతో ఐదో లెవల్‌కు చేరుకున్నట్లు కనిపిస్తున్నాం. కానీ, మనం ఇంకా పదో లెవల్‌కి చేరుకోవాల్సి ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ సంక్షోభానికి ముందులా పూర్తిగా పరిస్థితులు నెలకొన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మొదలవుతుందని పూజా మెహ్రా అన్నారు.

చైనా కరెన్సీ

ఫొటో సోర్స్, Reuters

చైనా వృద్ధి రేటు ఎందుకు తగ్గింది?

కరోనావైరస్ సంక్షోభ సమయంలోనూ చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతున్నట్లు వివిధ అంచనాలు చూపించాయి.

మిగతా దేశాలతో పోల్చితే చైనా కరోనావైరస్‌పై త్వరగా నియంత్రణ సాధించింది. వుహాన్‌లో 2020 ఏప్రిల్‌లోనే లాక్‌డౌన్ తొలగింపు మొదలైంది.

అయినా, 2021లో చైనా వృద్ధి రేటు 8.1 శాతంగానే ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.

‘‘2020 ఆరంభంలో చైనాకు కరోనావైరస్ కారణంగా భారీగా ఆర్థిక నష్టం జరిగింది. అక్కడ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసి, మహమ్మారిపై త్వరగానే నియంత్రణ సాధించారు. దీంతో మొదటి త్రైమాసికంలో మాత్రమే రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. చైనా ఆర్ఠిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది కాబట్టి, 2021లో గణాంకాల్లో భారీ తేడా రాలేదు. అందుకే వృద్ధి రేటు తక్కువగా కనిపిస్తోంది’’ అని మదన్ సబ్నవీస్ చెప్పారు.

కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

2022లో 6.8 శాతమే ఎందుకు?

2021లో భారత్ 11.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసిన ఐఎంఎఫ్, 2022లో మాత్రం 6.8 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదు కావొచ్చని చెప్పింది.

అంటే వృద్ధి రేటు నాలుగు శాతం మేర తగ్గిపోనుంది. దీని వెనుకున్న కారణాన్ని పూజా మెహ్రా వివరించారు.

‘‘11 శాతం వృద్ధి రేటు దాటాలంటే, ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగపడాలి. అందుకే తక్కువగా అంచనా వేశారు. ఐఎంఎఫ్ అంచనాలు ఏడాదిలో మూడు, నాలుగు సార్లు మారిపోతుంటాయి. వ్యాక్సీన్ రాకతో కార్యకలాపాలు మొదలైన మాట వాస్తవమే. కానీ, లాక్‌డౌన్, సంక్షోభం ప్ర భావం ఇంకా తేలాల్సి ఉంది’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)