తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని - జానారెడ్డి :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, JanaReddy/FB
ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించిందని సాక్షి పత్రిక వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ చేరుకుని పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్లు పేర్కొంది.
కొత్త అధ్యక్షుడి ఎంపికపై కోర్ కమిటీలోని 19 మంది సభ్యుల నుంచి పార్టీ అభిప్రాయాలు సేకరించిన ఇంచార్జి మాణిక్యం మరి కొంతమంది పార్టీ నేతల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుని పార్టీ అధ్యక్షురాలికి నివేదిస్తానని వెల్లడించారు.
జానారెడ్డి పార్టీ మారతారన్న అంశం కాంగ్రెస్ నేతల సమావేశంలో చర్చకు రాగా తాను పార్టీ మారేది లేదని జానారెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి కథనం తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని కూడా జానారెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి వెల్లడించింది.
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నదానిపై పార్టీదే తుది నిర్ణయమని ఈ సందర్భంగా జానారెడ్డి స్పష్టం చేసినట్లు సాక్షి కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే తల్లి ముక్తా బోబ్డే నాగ్‌పూర్ తన ఆస్తుల సంరక్షకుడు తనను మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారని ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది.
నాగ్‌పూర్‌లో తన ఆస్తికి సంరక్షకుడిగా ఉన్న తపస్ ఘోష్ గత పదేళ్లుగా వసూలు చేసిన అద్దె రూ. 2.5 కోట్లను తనకు చెల్లించడం లేదని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు తెలిపారని ఈనాడు పేర్కొంది.
స్థానిక ఆకాశవాణి కేంద్రం సమీపంలో బోబ్డే కుటుంబానికి ఒక పంక్షన్ హాల్ ఉందని, దీనికి గత పదేళ్లుగా తపస్ ఘోష్ సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలిపారు.
తమకు అందిన ఫిర్యాదు మేరకు తపస్‌ఘోష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోందని పోలీసులు వెల్లడించినట్లు ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్-అమెరికానాన్ స్టాప్ విమానం
హైదరాబాద్ నుంచి నేరుగా షికాగోకు ఒక కొత్త విమాన సర్వీసును ఎయిర్ ఇండియా ప్రారంభించబోతున్నట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది. జనవరి 15 నుంచి ఈ విమాన సర్వీసు అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ బుధవారం ప్రకటించినట్లు వెల్లడించింది.
ఈ సర్వీసులో భాగంగా 238మంది ప్రయాణికులు కూర్చోవడానికి వీలుండే బోయింగ్ 777-200 విమానాన్ని వినియోగించబోతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపినట్లు ఈ కథనం వెల్లడించింది.
ఈ విమానంలో 8 ఫస్ట్ క్లాస్ సీట్లు, 35 బిజినెస్ క్లాస్,195 ఎకానమీ క్లాస్ సీట్లుంటాయి. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నూతన సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Sonu Sood/Facebook
అప్పుల్లో సోనూసూద్ - ఆస్తులు తనఖా పెట్టి రూ.10కోట్ల రుణం
లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలకు ప్రయాణ సౌకర్యాలు, చిత్తూరు రైతుకు ట్రాక్టర్ అందించడంలాంటి సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు పొందిన నటుడు సోనూ సూద్ అప్పుల్లో ఉన్నాడని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.
ఆస్తులు తనఖా పెట్టి అప్పు చేశారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది. ముంబయిలోని జుహూలో తన పేరు మీదా, తన భార్య పేరు మీదా ఉన్న 8 ఆస్తులను ఆయన తనఖా పెట్టి సోనూసూద్ రూ.10 కోట్ల రుణం తీసుకున్నారని తెలిపింది. గత నెల 24 ఆయన ఈ రుణ అగ్రిమెంట్ మీద సంతకం చేశారని వెల్లడించింది.
లాక్‌డౌన్ సమయంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, దక్షిణాసియాలో నెంబర్ వన్ సెలబ్రిటీగా మారిపోయారని ఈ కథనం పేర్కొంది.
లండన్‌కు చెందిన ‘ఈస్టర్న్ ఐ’ అనే వారపత్రిక బుధవారం ప్రకటించిన 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలో సోనూసూద్ అగ్రస్థానంలో నిలిచారని కూడా ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








