మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులను ఒప్పించేందుకు, మధ్యే మార్గంగా ఒక పరిష్కారం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటివరకు ఆరు దఫాలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
మొదటగా కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత మంత్రుల స్థాయిలో జరిగాయి. మంగళవారం అయితే, నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కానీ రైతులను ఒప్పించడంలో మాత్రం ముందడుగు పడలేదు.
ఈ విషయంలో గత శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రులతో సమావేశమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
చర్చలకు తాము సుముఖంగానే ఉన్నామనే సంకేతాలను ప్రభుత్వం మొదట్నుంచీ ఇస్తోంది. చట్టాలను సవరించేందుకు సిద్ధమని కొన్ని రైతు సంఘాలకు లిఖిత పూర్వకంగా కూడా తెలియజేసింది. అయితే, రైతులు ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు.
అదే సమయంలో, ఈ చట్టాలను వెనక్కి తీసుకొనేది లేదని ప్రభుత్వం కూడా స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నో ప్రశ్నలు...
ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ చట్టాలను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు? దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక ఆర్థిక అంశాలు ఉన్నాయా? బ్రిటన్, కెనడాల నుంచి రైతు సంఘాలకు మద్దతు వస్తున్న నేపథ్యంలో.. ఈ అంశంలో అంతర్జాతీయ కోణం కూడా ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఈ ప్రశ్నలపై మాట్లాడేందుకు వ్యవసాయ నిపుణులు, సీనియర్ జర్నలిస్టులను బీబీసీ సంప్రదించింది.
‘‘బీజేపీ నేడు మునుపెన్నడూ లేనంత శక్తిమంతమైన పార్టీగా అవతరించింది. వ్యవసాయ రంగాన్ని సంస్కరించేందుకు ఈ చట్టాలు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ చట్టాలను తీసుకు వచ్చేందుకు ఇదివరకటి యూపీఏ హయాంలోనూ ప్రయత్నాలు జరిగాయి. శరద్ పవార్ లేఖలు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. అయితే, అప్పట్లో దృఢ సంకల్పం కరవైంది. కానీ, నేటి బీజేపీ పరిస్థితి అలాకాదు. కేంద్రంలో వారికి 300కుపైనే ఎంపీల బలముంది. ఇప్పుడు గానీ ఈ చట్టాలను అమలు చేయకపోతే.. ఎప్పటికీ అమలు చేయడం కుదరదేమో’’అని బీజేపీ వ్యవహరాలను ఏళ్ల నుంచి పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్టు నిష్తులా హెబ్బార్ అన్నారు.
ఇదివరకు భూసేకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇలానే తీసుకొచ్చింది. నిరసనలు, వివాదాల నడుమ దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని ‘‘సూటు బూటు సర్కార్’’గా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. వీటి వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వచ్చింది. దీంతో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తాజా బిల్లులను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పైగా ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడమంటే.. తమ విశ్వసనీయతపై దెబ్బ పడినట్లుగా ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. భూ సేకరణ బిల్లుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కూడా మద్దతు ఇవ్వలేదు. అయితే, ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన రైతు సంఘాలైన స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్.. వ్యవసాయ బిల్లులకు మద్దతు పలుకుతున్నాయి. రెండు, మూడు సవరణలు చేస్తే.. వీటిని అమలు చేయొచ్చని చెబుతున్నాయి.
‘‘ప్రస్తుతం విపక్షాలుగా ఉన్న కొన్ని పార్టీలు అప్పట్లో ఈ చట్టాలకు మద్దతు పలికాయి. ప్రస్తుతం రాజకీయ ఉద్దేశాలతోనే ఈ పార్టీలు చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి’’అని హెబ్బార్ అన్నారు.
రెండు రోజుల క్రితం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. అప్పట్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ ఈ చట్టాలకు ఎలా మద్దతు పలికాయో వివరించారు.
2019 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోతోపాటు లోక్‌సభలో ఏపీఎంసీ చట్టాన్ని రద్దుచేస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై అప్పట్లో బీజేపీకి ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్ లేఖ కూడా రాశారు.
మరోవైపు దిల్లీలోని ఆప్ ప్రభుత్వం కూడా మూడింటిలో ఒక చట్టానికి మద్దతు పలికింది. అయితే, ఇప్పుడు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టేందుకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు.
అందుకే, కేవలం రాజకీయ లక్ష్యాలతోనే పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ స్థాయిలో...
ఈ అంశంలో అంతర్జాతీయ కోణం కూడా ఉంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు సంబంధించిన రైతులు కోరుతున్న డిమాండ్లు భారత వ్యవసాయ రంగానికి ఎలాంటి మేలూ చేయవని చాలామంది వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చర్చల్లో భారత్ తటపటాయించడానికి ఎంఎస్‌పీ వ్యవస్థ కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
‘‘అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. వ్యవసాయ జీడీపీలో కేవలం పది శాతం వరకు మాత్రమే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి. ఈ విషయానికి కట్టుబడి ఉంటామని అన్ని దేశాలు డబ్ల్యూటీవోకి మాట ఇచ్చాయి. అయితే, సబ్సిడీలు ఎక్కువగా ఇస్తున్న దేశాల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని మిగతా దేశాలు వాదిస్తున్నాయి’’అని సౌత్ ఆసియా ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ జోషి చెప్పారు.
భారత ప్రభుత్వం ఎంఎస్‌పీ వ్యవస్థలోకి తీసుకొస్తున్న పంటలను సబ్సిడీ పంటలుగా అంతర్జాతీయ మార్కెట్లు పరిగణిస్తున్నాయి. అందుకే మన గోదుమ ధరలు మిగతా దేశాల కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మన పంటలు విక్రయాలకు నోచుకోకపోవడానికి ఇదే కారణం.
అంతర్జాతీయ మార్కెట్‌లో భారత వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉంటున్నాయని కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ) తన నివేదికలో తెలిపింది.

ఫొటో సోర్స్, NARINDER NANU/AFP VIA GETTY IMAGES
కేవలం ఆ రెండు రాష్ట్రాలకే
మరోవైపు ప్రస్తుతం నిరసనల్లో కేవలం పంజాబ్, హరియాణా రైతులే ఎక్కువ మంది ఉన్నారు.
తాజా చట్టాలతో కేవలం పంజాబ్, హరియాణా రైతులే ఎక్కువ ప్రభావితం అవుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ రెండు రాష్ట్రాల్లో పటిష్ఠమైన మండీల వ్యవస్థ అందుబాటులో ఉంది. మరోవైపు ఎంఎస్‌పీ పరిధిలోకి వచ్చే పంటలను కూడా ఎక్కువగా పండించేది ఈ రాష్ట్రాలే.
ఈ రెండు రాష్ట్రాలకు వెలుపల తాజా చట్టాలకు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడంలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది రైతులు తమ పంటలను మండీలకు బయటే విక్రయిస్తున్నారు.
కేవలం ఆరు శాతం మంది రైతులు మాత్రమే ఎంఎస్‌పీ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు 2015లో శాంతా కుమార్ కమిటీ తెలిపింది. అంటే 94 శాతం మంది రైతులకు ఎంఎస్‌పీతో ఎలాంటి లబ్ధీ చేకూరడం లేదు.
వ్యవసాయ గణన 2015-16 ప్రకారం.. భారత్‌లో 86 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే. అంటే వీరంతా రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిలో సాగుచేసేవారే.
అందుకే, ఇంత పెద్ద సంఖ్యలో దిల్లీకి రైతులు తరలివస్తారని ప్రభుత్వం ఊహించలేదు. మంగళవారం జరిగిన భారత్ బంద్‌కు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోనూ మిశ్రమ స్పందన వచ్చింది.

‘‘రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి’’
‘‘వ్యవసాయ చట్టాలపై కొందరు రైతులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ చట్టాలతో వారి ఆదాయం రెట్టింపు అవుతుందని నేను భావిస్తున్నాను’’అని వారణాసిలో పర్యటించే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోవడానికి మరో కారణం కూడా ఉంది.
‘‘ఈ విషయంపై చాలా మంది బీజేపీ నాయకులతో నేను మాట్లాడాను. ఈ సంస్కరణలను చరిత్రాత్మక సంస్కరణలుగా వారు భావిస్తున్నారు. ఇప్పుడు సందేహాలు వ్యక్తంచేస్తున్న రైతులే తమకు ధన్యావాదాలు చెబుతారని వారంటున్నారు. ఇదివరకు సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాంటి నిరసనలు వ్యక్తం అయ్యాయని చెప్పారు. దీనిపై సుదీర్ఘ పోరాటం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారన్నారు’’అని అవుట్‌లుక్ మ్యాగ్‌జైన్ పొలిటికల్ ఎడిటర్ విజ్ అరోరా చెప్పారు.
‘‘2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు వ్యవసాయ చట్టాలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది’’అని విజ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








