యోగి ఆదిత్యానాథ్: ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టుల మీద ఇన్ని కేసులు ఎందుకు?

యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సమీరాత్మజ్‌ మిశ్రా
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్‌, లఖ్‌నవూ

హాథ్‌రస్‌ వార్తలను కవర్‌ చేయడానికి వచ్చిన కేరళ జర్నలిస్టుపై కేసు పెట్టి అరెస్టు చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ పాత్రికేయ వర్గాల్లో ఇప్పుడొక చర్చ జరుగుతోంది. యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం జర్నలిస్టుల మీద ఎందుకు కోపంగా ఉంది?

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఏడాది కాలంలో 15 మంది జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయి. అందులో 8 మంది జర్నలిస్టులపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలను బీబీసీ సంపాదించింది.

ప్రభుత్వాన్ని విమర్శించే పాత్రికేయులపై కేసులు పెడుతున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. కేసులు పెట్టటంతో పాటు వారిని అరెస్టు కూడా చేస్తున్నారు. ఈ అరెస్టయిన జర్నలిస్టులందరికీ బెయిల్‌ వచ్చినా, విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది.

అక్టోబర్‌ 16వ తేదీన ‘జనసందేశ్‌ టైమ్స్’ పత్రికలో పని చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు బహదూర్‌ సింగ్‌, ధనుంజయ్‌ సింగ్‌లపై అధికార రహస్యాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. వారిద్దరూ చట్ట విరుద్ధంగా రహస్య పత్రాలను సేకరించారని, వాటి ఆధారంగా కథనాలు ప్రచురించారని అందులో ఆరోపించారు.

"జర్నలిస్టులు తమ బాధ్యతలను గుర్తించి నడుచుకోవాలి" అని ఒకప్పుడు జర్నలిస్టు, ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు శలాభ్‌ మణి త్రిపాఠి వ్యాఖ్యానించారు.

తన మీడియా సలహాదారు శలాభ్ మణి త్రిపాఠితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, FB / SHALABHMANITRIPATHI

ఫొటో క్యాప్షన్, తన మీడియా సలహాదారు శలాభ్ మణి త్రిపాఠితో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

ఇటీవలి కాలంలో యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఒక్కసారి పరిశీలిద్దాం

1. 16 సెప్టెంబర్ 2020 - రవీంద్ర సక్సేనా, సీతాపూర్‌

క్వారంటైన్‌ సెంటర్‌లో వేధింపుల మీద కథనం రాసినందుకు అధికారుల పనికి అడ్డుతగిలారని, విపత్తు నిర్వహణను చర్యలకు ఇబ్బంది కలిగించారని ఆరోపిస్తూ ఎస్సీ/ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

2.19 జూన్ 2020- సుప్రియా శర్మ, వారణాసి

ప్రధాని దత్తత తీసుకున్న డోమరి గ్రామంలో ప్రజల ఆకలి కేకలపై వార్త రాసినందుకు ఎస్సీ/ఎస్టీ చట్టం-1989, పరువు నష్టంపై ఐపీసీ సెక్షన్ 501, అంటువ్యాధి నిరోధక నిబంధనలు పాటించలేదని ఐపీసీ సెక్షన్ 269 కింద కేసు నమోదు చేశారు.

3. 31 ఆగస్టు, 2019 - పంకజ్ జైస్వాల్, మీర్జాపూర్‌

ప్రభుత్వ పాఠశాలలో అవకతవకలు ఉన్నాయని, మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడంలేదని రాసిన కథనాలపై కేసు పెట్టారు. తర్వాత గొడవ జరగడంతో ఎఫ్‌ఐఆర్‌ నుంచి పంకజ్ జైస్వాల్‌ పేరు తొలగించారు.

4. సెప్టెంబర్, 2019- సంతోష్‌ జైస్వాల్‌, అజమ్‌గఢ్‌

ఒక పాఠశాలలో విద్యార్థులతో గదులు శుభ్రం చేయిస్తుండగా దానిని ఫోటోలు, వీడియోలు తీసినందుకు సంతోష్‌ జైస్వాల్ సహా ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు దిగారని వారిపై ఆరోపణలు చేశారు.

5. సెప్టెంబర్ 2020- అశీష్‌ తోమర్‌, మరో నలుగురు జర్నలిస్టులు, బిజ్నౌర్‌

బెదిరింపుల భయంతో వాల్మీకి కులానికి చెందిన ఓ కుటుంబం పారిపోవడానికి కారణమయ్యారంటూ ఐదుగురు జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఐపీసీ- 153 ఎ, 268, 505 సెక్షన్ల కింద ఆశిష్‌ తోమర్, షకీల్ అహ్మద్, లఖన్‌సింగ్, అమీర్‌ ఖాన్, మొయిన్ అహ్మద్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసులో అనేక లోపాలున్నాయని కోర్టు ఈ ఎఫ్‌ఐఆర్‌ను తిరస్కరించింది.

6. సెప్టెంబర్ 3, 2020- అసద్‌ అలీ, లఖ్‌నవూ

మొహర్రం సమయంలో ప్రశాంతతను చెదరగొట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఏసీఎం కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 6న ఉంది. అక్టోబర్‌ 2న లఖ్‌నవూలో ప్రదర్శనను కవర్ చేస్తున్నప్పుడు అసద్‌పై దాడి జరిగింది. ఆయన కేసు పెట్టడానికి ప్రయత్నించినా పోలీసులు తీసుకోలేదు.

వార్తలపై అభ్యంతరాలంటు ఫిర్యాదు చేయాలి తప్ప బెదిరించడం సరికాదని జర్నలిస్టు సంఘాలు అంటున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వార్తలపై అభ్యంతరాలంటు ఫిర్యాదు చేయాలి తప్ప బెదిరించడం సరికాదని జర్నలిస్టు సంఘాలు అంటున్నాయి

న్యూస్‌ వెబ్‌సైట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌పై కేసు

ఈ ఏడాది జూన్‌లో లాక్‌డౌన్‌ సమయంలో ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుప్రియా శర్మ, ఎడిటర్ ఇన్‌-చీఫ్‌లపై వారణాసి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ప్రజల స్థితిని అంచనా వేయడానికి వారణాసి సమీపంలోని డోమరి అనే గ్రామాన్ని సుప్రియాశర్మ సందర్శించారు. ఈ గ్రామాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దత్తత తీసుకున్నారు. ఇక్కడి పరిస్థితులపై సుప్రియా శర్మ ఒక కథనాన్ని ప్రచురించారు.

గ్రామానికి చెందిన మాలాదేవి అనే మహిళ తాను ఇళ్లలో పని చేసుకుని జీవిస్తానని, లాక్‌డౌన్‌ కారణంగా తన పరిస్థితి దారుణంగా మారిందని వెల్లడించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. తనకు తిండి కూడా లేదని, రేషన్‌ కార్డు లేనందువల్ల రేషన్ కూడా అందుబాటులోకి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు రాశారు.

అయితే ఈ వార్త ప్రచురితమైన తర్వాత తాను ఈ విషయాలను విలేకరికి చెప్పలేదని, తన పేదరికాన్ని విలేకరి ఎగతాళి చేశారని మాలాదేవి ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు వారణాసిలోని రామ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్‌ 13న సుప్రియా శర్మపై దిల్లీలో కేసు నమోదైంది.

సుప్రియా శర్మపై ఐపీసీలోని ఎస్టీ/ఎస్టీ యాక్ట్‌ -1989 చట్టంతో పాటు, పరువు నష్టం కలిగించినందుకు సెక్షన్‌ 501 కింద, అంటువ్యాధి వ్యాపించడానికి కారణమయ్యేలా నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు సెక్షన్ 269 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు నమోదైనా తాను రాసిన వార్తకు కట్టుబడి ఉన్నట్లు సుప్రియా శర్మ పేర్కొన్నారు. వెబ్‌సైట్ ఎడిటర్‌ మీద కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. దీనిని రద్దు చేయాలని సుప్రియా శర్మ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేయగా, కోర్టు దానిని తిరస్కరించింది. అయితే కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

యూపీ సీఎంపై అసత్య వార్త ప్రచురించారని సిద్ధార్ధ్ వరదరాజన్ పై పెట్టిన కేసు సంచలనంగా మారింది

ఫొటో సోర్స్, Siddharth Varadarajan/FB

ఫొటో క్యాప్షన్, యూపీ సీఎంపై అసత్య వార్త ప్రచురించారని సిద్ధార్ధ్ వరదరాజన్ పై పెట్టిన కేసు సంచలనంగా మారింది

‘ది వైర్’ ఎడిటర్‌పై ఎఫ్‌ఐఆర్‌

అంతకు ముందు అయోధ్యలో సీనియర్ జర్నలిస్ట్‌, ఇంగ్లిష్‌ వెబ్‌సైట్‌ ‘దివైర్‌’ సంపాదకుడు సిద్ధార్ధ్ వరదరాజన్‌పై కూడా రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఒక మత కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలపడం ప్రజలకు సమాచారం ఇవ్వడమే తప్ప మరొకటికాదని, ఇది వదంతులు వ్యాపింపజేశారన్న సెక్షన్‌ కిందకు రాదని ‘ది వైర్‌’ తెలిపింది.

ప్రభుత్వ చర్యపై దేశవ్యాప్తంగా మేధావులు, జర్నలిస్టులు తీవ్రవ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఈ కేసులో సిద్ధార్థ్ వరదరాజన్ హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు.

పలువురు జర్నలిస్టులపై కేసులు

వీటికి ముందు కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురించినందుకు యూపీలోని పలువురు స్థానిక జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో యూపీలోని ఫతేపూర్‌ జిల్లాకు చెందిన జర్నలిస్ట్‌ అజయ్‌ భడోరియాపై స్థానిక అధికారులు కేసు పెట్టారు.

లాక్‌డౌన్‌ సమయంలో కమ్యూనిటీ కిచెన్ నుండి ఆహారాన్ని పొందడంలో ఒక అంధ జంటకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయో వివరిస్తూ అజయ్‌ భడోరియా ఒక వార్త రాయగా, ఆయనపై కేసు నమోదైంది. దీనిపై జిల్లాకు చెందిన జర్నలిస్టులు నిరసన తెలియజేశారు.

మీర్జాపూర్‌లో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు జరిగాయని నివేదించిన ఒక జర్నలిస్టుపై గత ఏడాది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపించాయి.

ఒక ప్రింట్‌ మీడియా జర్నలిస్ట్ వీడియో ఎలా తీస్తారు అన్నది జిల్లా కలెక్టర్‌ అభ్యంతరం. చివరకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

పవన్ జైశ్వాల్

ఫొటో సోర్స్, PAWAN JAISWAL

వార్తలు రాస్తే కేసులు పెడతారా?

2019 ఆగస్టు 31న మీర్జాపూర్‌లో జర్నలిస్టు పంకజ్ జైస్వాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రభుత్వ పాఠశాలలో అక్రమాలు ప్రబలంగా ఉండటం, పిల్లలకు మధ్యాహ్నం భోజనంలో ఉప్పు రొట్టెలు ఇవ్వడం గురించి పంకజ్‌ జైస్వాల్‌ వార్తలను ప్రచురించారు.

అయితే అధికారులు సంఘటనపై విచారణ జరపకపోగా పంకజ్‌ జైస్వాల్‌ మీదే కేసు పెట్టారు. దీనిపై వివాదం చెలరేగడంతో జైస్వాల్‌ పేరును ఎఫ్ఐఆర్‌ నుంచి తొలగించారు. తర్వత ఆయనకు క్లీన్‌చిచ్‌ ఇచ్చారు.

మీర్జాపూర్ గొడవ సద్దుమణగక ముందే నకిలీ వార్తలు రాశారంటూ బిజ్నౌర్‌లో ఐదుగురు జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అదే సమయంలో అజమ్‌గఢ్‌లో అధికారులను బెదిరించారంటూ ఒక జర్నలిస్ట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.

బిజ్నౌర్‌లో వాల్మీకి కులానికి చెందిన ఒక కుటుంబాన్ని వీధి కుళాయి దగ్గర నీరు పట్టుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఒక వార్తను ప్రచురించారు. అయితే ఈ వార్త ద్వారా రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించారని అధికారులు ఐదుగురు జర్నలిస్టులపై ఆరోపణలు చేశారు.

దీనికి కారకులంటూ ఆశిష్‌ తోమర్‌, షకీల్‌ అహ్మద్‌, లఖాన్‌సింగ్‌, అమీర్‌ఖాన్‌, మొయిన్‌ అహ్మద్‌ అనే ఐదుగురు జర్నలిస్టులపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ ఎఫ్‌ఐఆర్‌ను తిరస్కరించింది.

2019 సెప్టెంబర్‌ 10న అజమ్‌గఢ్‌లో చిన్న పిల్లలతో స్కూల్‌ను శుభ్రం చేయిస్తున్నారంటూ ఒక వార్త రాయడంతో సంతోష్‌ జైస్వాల్‌ సహా ఆరుగురు జర్నలిస్టులపై కేసులు పెట్టారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఇందులో ఆరోపించారు.

జర్నలిస్టులపై ఆరోపణలు రావడం, కేసులు పెట్టడం వరకు ఓకే. కానీ అరెస్టులు చేయాల్సిన అవసరం ఉందా? దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగదా? అన్న వాదన వినిపిస్తోంది.

“అధికారులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారంటే అక్కడ ఏదో సీరియస్‌ వ్యవహారమే ఉంటుంది. సదరు జర్నలిస్టు నిజాయితీపరుడైతే దాన్ని కోర్టులో నిరూపించుకోవచ్చు" అని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు శలాభ్‌మణి త్రిపాఠి అన్నారు.

మీడియాపై కేసులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాస్వామ్య విలువలకు భంగం

“జర్నలిస్టులు ఎన్నో కష్టాలు, ఒత్తిళ్లు ఎదుర్కొని వార్తలు రాస్తుంటారు. కానీ తనపై విమర్శలను ప్రభుత్వం వినలేకపోతోంది. ఇది ప్రమాదకరం. ప్రభుత్వానికి బలం ఉండొచ్చు. కానీ జర్నలిస్టులను భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం’’ అని ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ జాతీయ అధ్యక్షుడు కె.కె. విక్రమ్ రావు అన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 55 మంది జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయని, కొందరు అరెస్టు కూడా అయ్యారని దిల్లీ కేంద్రంగా పని చేస్తున్న రైట్‌ అండ్‌ రిస్క్‌ ఎనాలిసిస్‌ గ్రూప్‌ వెల్లడించింది.

వీరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 11 మంది, జమ్మూ-కశ్మీర్‌లో ఆరుగురు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన జర్నలిస్టులు ఐదుగురు ఉన్నారని పేర్కొంది.

వార్తలపై అభ్యంతరాలుంటే ఏం చేయాలి?

“ఒక వార్త మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉండవచ్చు. వీటిపై ఫిర్యాదు చేయడానికి అనేక ఫోరమ్‌లు ఉన్నాయి. ఎడిటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు, ప్రెస్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాకు, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లొచ్చు. కానీ జర్నలిస్టును నేరస్తుడిగా మార్చి, కేసులు, అరెస్టులు అంటూ ప్రతీకార ధోరణిలో భయపెట్టడం మంచిది కాదు’’ అన్నారు లఖ్‌నవూకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ యోగేశ్‌ మిశ్రా.

అయితే ముఖ్యమంత్రి మీడియా సలహాదారు శలాభ్‌ మణి త్రిపాఠి మాత్రం “ఎలాంటి కారణం లేకుండా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయరు కదా’’ అని అన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో ఉన్న నిబంధనలను అడ్డంపెట్టుకుని క్వారంటైన్‌ సెంటర్లలో జరుగుతున్న అవకతవకలపై వార్తలను ప్రచురించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. రవీంద్రసక్సేనా అనే జర్నలిస్టుపై కేసు ఈ కోవలోకే వస్తుంది.

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు లాక్‌డౌన్‌ నిబంధనలకు సంబంధించిన వివిధ సెక్షన్ల కింద పలువురు జర్నలిస్టులపై కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ఈ తరహా బెదిరింపులు ఎక్కువ కావడంతో లఖ్‌నవూలోని పలు జర్నలిస్టు సంఘాలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాయి. ఇలాంటి వాటిని ఆపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ప్రశాంత్ కనోజియా

ఫొటో సోర్స్, PRASHANT KANOJIA FAMILY

ప్రశాంత్ కనోజియా వివాదం

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ హజ్రత్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనోజియాను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 11 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలన్న కింది కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

ఆగస్టు 18న ప్రశాంత్‌ కనోజియా మరో వివాదాస్పద ట్వీట్‌ చేయడంతో హజ్రత్‌గంజ్ పోలీసులు ఆయనపై మళ్లీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కనోజియా కుటుంబం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించినా, ఇంకా ఆయనకు బెయిల్ రాలేదు.

అయోధ్య మందిరంలోకి శూద్రులు, ఓబీసీలను రానివ్వవద్దంటూ హిందూ సేన నేత చేసిన ప్రకటనకు సంబంధించిన సోషల్ మీడియా స్క్రీన్‌షాట్‌ను కనోజియా ట్విటర్‌లో పెట్టారు. దీంతో ఆయన ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆయనపై కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)