ప్రశాంత్ భూషణ్ కేసు: తీర్పుపై పునఃపరిశీలించాలని సీజేఐని కోరుతూ 122 మంది న్యాయ విద్యార్థుల బహిరంగ లేఖ

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ భూషణ్

కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇతర న్యాయమూర్తులకు 122 మంది న్యాయ విద్యార్థులు లేఖ రాశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర మాజీ ప్రధాన న్యాయమూర్తులపై ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసులో తుది తీర్పును రేపు ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో లాయర్ ప్రశాంత్ భూషణ్ దోషి కాదంటూ అనేకమంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

దేశవ్యాప్తంగా 122 మంది న్యాయ విద్యార్థులు చీఫ్ జస్టిస్ బాబ్డేకు, ఇతర న్యాయమూర్తులకు భావోద్వేగపూరితమైన లేఖ రాశారు.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

"న్యాయవ్యవస్థ, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు బదులు చెప్పాలి. తన పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వాలి. అంతేగానీ న్యాయవ్యవస్థపై విశ్వాసంతో, ప్రేమతో, అందరికీ న్యాయం జరగాలనే సదుద్దేశంతో అదే వ్యవస్థకు చెందిన వ్యక్తి ప్రశ్నలు సంధించినప్పుడు దాన్ని కోర్టు ధిక్కరణగా తీర్పునివ్వరాదు" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

"పాదర్శకత, జవాబుదారీతనం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, అవినీతిలాంటి అనేక అంశాలపై ఎన్నో ఏళ్లుగా లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టులో పోరాడుతుండడం మేం చూశాం. దేశ నిర్మాణం, దేశ ప్రజల సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో ఆయన కృషిని న్యాయవాద బృందం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది."

ఆయన చేసిన రెండు ట్వీట్లు కూడా నోరు లేని, అట్టడుగు వర్గాల వేదనను ప్రతిబింబిస్తున్నాయని, అవి కోర్టు గౌరవాన్ని భంగపరిచేవిగా లేవని ఆ లేఖలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకీ ఏమిటీ కేసు

"గులాబీలు కాకుండా ముళ్లు గెలిచే చోట మౌనంగా ఉండడం అసాధ్యం. అలాంటి సందర్భాలలో న్యాయం కోసం పోరాటం చేయడం ఎంత అవసరమో నాకు అర్థమైంది" అని మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీకే అయ్యర్ వ్యాఖ్యలను ఆ లేఖలో ఉదహరించారు.

ప్రజాస్వామ్యంలో ఒక న్యాయమూర్తిని నిష్పాక్షికంగా విమర్శించడం నేరం కాదు సరి కదా ఒక అవసరమైన హక్కుగా గుర్తించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు.

రేపు సోమవారం ఈ కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు విధించబోయే శిక్ష వివరాలను జస్టిస్ అరుణ్ మిశ్రా నాయకత్వంలో ధర్మాసనం ప్రకటించనుంది.

ఈ కేసు విషయంలో ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు కోరితే శిక్ష తగ్గిస్తామని చెబుతూ తప్పు చేసినప్పుడు క్షమాపణలు కోరడంలో ఎలాంటి తప్పూ లేదు అని గతంలో జస్టిస్ అరుణ మిశ్రా తెలిపారు.

ఈ కేసు విచారణలో ప్రశాంత్ భూషణ్ తరుపు న్యాయవాది రాజీవ ధావన్ తన వాదన వినిపిస్తూ..సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని, కానీ గత నలుగురు ప్రధాన న్యాయమూర్తుల విధానంపై అతనికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.

ఈ అంశంపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ...ఉన్నత న్యాయస్థానంలో జరుగుతున్న అవినీతి గురించి అనేకమంది మాజీ, ప్రస్తుత సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తులు పలుమార్లు ప్రస్తావించారని, లాయర్ ప్రశాంత్ భూషణ్ తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తే గనక అతన్ని హెచ్చరించి వదిలేయమని తెలిపారు.

అయితే, "నా వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పూ లేదని, నా అభిప్రాయాలను వ్యక్తపరచడం నా హక్కు అనీ, కోర్టు ఎలాంటి శిక్ష విధించినా అంగీకరిస్తానని" ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

ఈ కేసులో తుది తీర్పును రేపు ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)