సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: దోషి ఎవరో టీవీ చానల్స్, సోషల్ మీడియా గుంపులే నిర్ణయిస్తాయా? : బ్లాగ్

ఫొటో సోర్స్, RheaChakravarty/FB
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో నిందితురాలిగా ఉన్న నటి రియా చక్రవర్తి ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై దాడి విపరీతంగా పెరిగింది. కొందరు ఆమె ‘చావాలంటూ’ శాపనార్థాలు కూడా పెట్టారు.
సభ్య సమాజంలో సాధారణంగా ఎవరూ ఇంకొకరు చావాలని అనరు. ఒకవేళ అలా అన్నారంటే వారిలో అవతలి వ్యక్తి పట్ల ఎంతో కోపం, విద్వేషం గూడుకట్టుకుని ఉండుంటుంది. అసలు ఏ కారణమూ లేకుండా, ఎవరైనా మరొకరు చావాలని ఎందుకు కోరుకుంటారు.
సోషల్ మీడియా లాంటి బహిరంగ వేదికల్లో ఓ వ్యక్తి చావాలంటూ, ఆత్మహత్య చేసుకోవాలంటూ కొందరు మాట్లాడుతున్నారంటే, అలా చేసేందుకు వారికి బలమైన కారణం ఉండి ఉండాలి.
కానీ, రియా చావాలంటూ కొందరు మాట్లడటానికి కారణాన్ని చూస్తే భయం కలగకమానదు. సభ్య సమాజపు పునాదులనే కదిలించే విషయం అది. నేరం రుజువు కాకుండానే కేవలం అనుమానంతో తీర్పు ఇచ్చేస్తున్నాయి కొన్ని భారతీయ టీవీ చానళ్లు.
టీవీ చానళ్లు ఒకదానితో మరొకటి పోటీపడుతూ చూపిస్తున్న ఈ అత్యుత్సాహం జనాల ఆలోచించే శక్తిని దెబ్బతీస్తోంది.
సమాజం ఓ రాబందుల గుంపులా తయారవుతోంది. ఇక్కడ తప్పు ఎవరిదో మీడియా, జనాలు నిర్ణయించేస్తారు. విచారణ సంస్థలు ఆ తర్వాత కొసరు పనిని చేస్తాయి.
సుశాంత్ సింగ్ మరణం కేసు ‘మీడియా నేర విచారణ’కు సంబంధించి చరిత్రలో ఓ భయానక ఉదాహరణగా మిగిలిపోతుంది.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం ఎవరినైనా ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించడం శిక్షించాల్సిన నేరం అవుతుంది. కానీ, సోషల్ మీడియాలో చట్టం, భావోద్వేగాలకు నిర్వచనాలు మారిపోతాయనుకుంటా. ఇక్కడ ఎవరూ సంయమనం పాటించరు. జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందన్న భయమే ఉండదు. కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఆఫ్ అయినట్లుగా, వారిలో బాధ్యత కూడా ఆఫ్ అయిపోతుంది.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత రియా ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో... తనపై మోపుతున్న ‘నిరాధార ఆరోపణలు’, తన గురించి పుట్టిస్తున్న ‘కట్టు కథల’తో తాను, తన కుటుంబం తీవ్ర ఒత్తిడి అనుభవిస్తున్నామని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని కూడా ఆమె వాపోయారు.
‘‘రోజురోజుకీ ఈ ‘వేధింపులు’ పెరుగుతున్నాయి. దీనికి బదులు మమ్మల్ని అందరినీ ఓ లైన్‌లో నిలబెట్టి కాల్చి చంపొచ్చుగా’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA
ఆత్మహత్య నవ్వులాటా?
రియా చక్రవర్తి నేరం చేశారా? చేయలేదా? ఆమెపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందా, లేదా అనేది విచారణలో తేలుతుంది. దాన్ని బట్టే, కోర్టు కూడా దోషులకు శిక్ష నిర్ణయిస్తుంది.
ఓవైపు విచారణ జరుగుతుండగానే, మరోవైపు టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా సాగిస్తున్న ‘దర్యాప్తులతో’ తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని రియా అన్నారు.
ఆమె అంత ఒత్తిడిలో అన్న మాటలు కూడా కొందరికి నవ్వులాటగా మారాయి. ‘నిన్ను ఎవరు ఆపుతున్నారు?’, ‘మేం కూడా దాని గురించి వేచిచూస్తున్నాం?’, ‘ఆత్మహత్య లేఖ రాయడం మరిచిపోకు’ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏమనాలి?
ఇంటర్వ్యూలో రియా హావభావాల గురించి కూడా విశ్లేషణలు మొదలయ్యాయి.
‘ఆమె ఎంతో క్యాజువల్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎదుర్కొంటున్న ఆనవాళ్లే కనిపించడం లేదు’, ‘ఆమెలో కొంచెం కూడా బాధ లేదు’, ‘ఆమె నవ్వు ఆపుకునేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కొందరు కామెంట్లు చేశారు.
సుశాంత్ కుంగుబాటుకు గురయ్యారా, లేదా అన్నది ఆయన బయటకు ఫిట్‌గా, సంతోషంగా కనిపించిన తీరును బట్టి నిర్ణయించడం ఎలాంటిదో.... రియా కళ్లలో నీళ్లను బట్టి ఆమెలో బాధను లెక్కించడం కూడా అలాంటిదే.
దుస్తులు, ముఖంలో హావభావాలు ద్వారా రియా అబద్ధాలు చెబుతోందని నిర్ణయానికి వచ్చేయొచ్చా? ఆమె చావాలని కోరుకోగలమా? ఇలాంటి విద్వేషం అసలు ఎక్కడి నుంచి వస్తోంది? దీన్ని ఎవరు పెంచుతున్నారు?
సుశాంత్ సింగ్ కుంగుబాటు సమస్యతో బాధపడ్డ విషయం బయటకురాగానే ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేసినవారు, హిందీ చిత్రపరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) రాజ్యమేలుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినవారు కూడా ఇప్పుడు రక్త దాహంతో ఉన్న మూకలా మారారు.
సుశాంత్, తాను ప్రేమించుకున్నామని రియా చెప్పారు. కానీ, చాలా టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియాలో పెద్ద సమూహం ఆమెను ‘బయటి మహిళ’గా చిత్రిస్తున్నారు.
సుశాంత్ కుటుంబంతో సంబంధాలు దెబ్బతినడం, ఆయన బలహీనతలను బయటకు చెప్పడం వల్ల రియా జనాలకు ‘విలన్’లా కనిపిస్తున్నారు. సుశాంత్‌తో రియా ‘లివ్ ఇన్’ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు ఆమె కుటుంబం అంగీకరించడంపైనా కొందరు అభ్యంతరం చెబుతున్నారు.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA
మరో వాదనను సహించరా?
ఒక ప్రముఖ కళాకారుడు అనుమానాస్పద పరిస్థితిలో మరణించినప్పుడు, ఆ విషయంలో మీడియో సందేహాలు వ్యక్తం చేయడం, ఆ వ్యవహారంతో సంబంధమున్న అన్ని పక్షాలను బయటకు తేవడం అవసరం.
కానీ, రియా చక్రవర్తిని ఇంటర్వ్యూ చేసిన ఛానెళ్లను ‘అమ్ముడుపోయినవి’, ‘అబద్ధపు ఛానెళ్లు’, ‘యాంటీ నేషనల్’ మీడియా అని కొందరు నిందిస్తున్నారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను రియా ‘బోయ్‌ఫ్రెండ్’ అని పిలుస్తున్నారు.
రియాను కఠినమైన ప్రశ్నలు అడగలేదని, ఆమె వాదనను వినిపించేందుకు వేదికను ఇచ్చారని ఆరోపించారు.
రెండు నెలలుగా సుశాంత్ సింగ్ జీవితంతో సంబంధమున్నవారికి, లేనివారికి రకరకాలు ఆరోపణలు చేసే వేదికగా మీడియా నిలిచింది.
కానీ, ఆ ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి వాటికి సమాధానాలు ఇవ్వడం, అవి వారి ఆలోచనలకు తగ్గట్లు లేకపోవడం కొందరికి రుచించడం లేదు. గందరగోళం సృష్టించడం ద్వారా ఆమె గొంతు మూయించాలనుకుంటున్నారు.
రియా ఇంటర్వ్యూలో చాలావరకూ ప్రశాంతంగానే కనిపించారు. కొన్ని సార్లు కంటతడి పెట్టుకున్నారు. కానీ, ఆమె ఇంటర్వ్యూ ఆపలేదు. తనపై చేసిన ఆరోపణలను ఆమె పూర్తిగా విన్నారు. సూటిగా వాటికి జవాబు ఇచ్చారు.
రియా హావభావాలపై నాకు కలిగిన వ్యక్తిగత అభిప్రాయం ఇదే అయి ఉండొచ్చు. అలాగే, ఆమె చూపించిన సంయమనం కొందరికి అబద్ధాలు చెబుతున్నట్లుగా కనిపించవచ్చు.
కానీ, రియా ఉద్వేగంగా చెప్పిన ఓ విషయాన్ని ఆమె గురించి రాస్తున్నవారు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు అందరూ అర్థం చేసుకోవాలి.
‘‘రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? కనీసం పారదర్శక విచారణైనా నాకు ఉండదా?’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: స్కూళ్లను కోళ్ల పరిశ్రమల్లా మార్చేస్తున్నారు
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- ఫైనల్ పరీక్షలు రాయకుండా విద్యార్థుల్ని ప్రమోట్ చేయొద్దు - సుప్రీం కోర్టు తీర్పు
- రెండో ప్రపంచ యుద్ధం జపాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేసింది?
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- పదేళ్లలోపు పిల్లలు నేరాలు చేస్తే జైల్లో పెట్టాలా? వద్దా?
- దిల్లీ అల్లర్లపై ఆమ్నెస్టీ నివేదిక: పోలీసులు చేసిన తప్పులకు శిక్షలు ఉండవా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








