కశ్మీర్: హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ మిలిటెంట్ రియాజ్ నైకూ ఎన్‌కౌంటర్‌లో హతం

భారత సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రియాజ్ మస్‌రూర్
    • హోదా, శ్రీనగర్ నుంచి బీబీసీ ప్రతినిధి

కశ్మీర్‌లో భద్రతాదళాలు, హిజ్బుల్ మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ టాప్ మిలిటెంట్ రియాజ్ నైకూ, ఆయన సహచరుడు హతమయ్యారు.

రియాజ్ కాకుండా మరణించిన ఆ మరో మిలిటెంట్ ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు.

అవంతీపుర స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసులు కలిసి రియాజ్‌ను పోరా గ్రామంలో ముట్టడించాయి.

ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారని, మూడు ఆపరేషన్లు కొనసాగుతున్నాయని సమాచారం ఉంది.

ఉత్తర కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాలో ఇటీవల జరిగిన రెండు మిలిటెంట్ దాడుల్లో ఓ కల్నల్, ఓ మేజర్ సహా ఎనిమిది మంది భద్రతదళాల సిబ్బంది మరణించిన నేపథ్యంలో తాజా ఘటన జరిగింది.

రియాజ్ నైకూ వయసు 40 ఏళ్లు. స్థానిక హిజ్బుల్ ముజాహిదీన్‌లో ఇప్పటివరకూ ప్రాణాలతో మిగిలిన నాయకుడు రియాజ్ మాత్రమే. 2016లో బుర్హన్ వానీ భద్రతదళాల కాల్పుల్లో హతమైన తర్వాత హిజ్బుల్ బాధ్యతలు రియాజ్ చేతుల్లోకి వెళ్లాయి.

రియాజ్‌ను పట్టించినవారికి రూ.12 లక్షల నజరానా ఇస్తామని ఇదివరకు పోలీసులు ప్రకటించారు.

హిజ్బుల్‌ను మళ్లీ సంఘటితం చేస్తున్నారని, భద్రతాదళాలపై దాడులకు పాల్పడుతున్నారని రియాజ్‌పై పోలీసులు అరోపణలు చేస్తున్నారు.

కశ్మీర్‌లో ఈ ఏడాది మార్చి తర్వాత మిలిటెంట్ దాడుల గణనీయంగా పెరిగాయి.

చలి ఎక్కువగా ఉన్న సమయంలో మిలిటెంట్లపై ఆపరేషన్లు నిలిచిపోయాయని పోలీసు వర్గాలు చెప్పాయి.

బుర్హన్ వానీ
ఫొటో క్యాప్షన్, బుర్హన్ వానీ

‘‘జనవరి నుంచి ఇప్పటివరకు 76 మంది మిలిటెంట్లు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. కానీ, 20 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సీనియర్ అధికారులు కూడా వారిలో ఉన్నారు’’ అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పోలీసు చెప్పారు.

పోలీసు వర్గాలు చెబుతున్నదాని ప్రకారం రంజాన్ మాసం తొలి పది రోజుల్లో 14 మంది మిలిటెంట్లు, వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఎనిమిది మంది జవాన్లు, ఓ దివ్యాంగ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు.

భారత్‌లో లాక్‌డౌన్ మొదలైన తర్వాత నియంత్రణ రేఖ వద్ద భారత్, పాకిస్థాన్ సైన్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు కశ్మీర్‌లో మిలిటెంట్లకు వ్యతిరేకంగా కార్యకలాపాలను కూడా భారత సైన్యం పెంచింది.

ఈ ఏడాది మరణించిన 76 మంది మిలిటెంట్లలో 34 మంది లాక్‌డౌన్ సమయంలోనే చనిపోయినట్లు సమాచారం.

ఇక మిలిటెంట్లు హతమైనప్పుడు స్థానికుల నుంచి వస్తున్న నిరసనలకు అడ్డుకట్టే వేసేందుకు భద్రతాదళాలు కొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయానికి వచ్చాయి.

కొత్త విధానం ప్రకారం ఇక చనిపోయిన మిలిటెంట్ల గుర్తింపు వివరాలను బయటకు వెల్లడించరు. వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)