కరోనావైరస్ రోగుల కోసం లక్ష రూపాయలకే ఎమర్జెన్సీ వెంటిలేటర్ తయారు చేసిన హైదరాబాద్ ఐఐటీ అనుబంధ సంస్థ :ప్రెస్ రివ్యూ

ఎమర్జెన్సీ వెంటిలేటర్

ఫొటో సోర్స్, Aerobiosys Innovations

ఫొటో క్యాప్షన్, ఎమర్జెన్సీ వెంటిలేటర్

ఐఐటీ హైదరాబాద్‌ అనుబంధ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ)కి చెందిన ఏరోబయోసిస్‌ ఇన్నోవేషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ.. కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను అతి తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం, ‘జీవన్‌లైట్‌’గా పిలిచే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్‌ చెబుతోంది. ఇది ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడవచ్చు.

రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి, వైద్యుడికి యాప్‌ ద్వారా సమాచారం అందజేసే ఫీచర్‌తో పాటు, ఆక్సిజన్‌ సిలిండర్‌ను కూడా జత చేసి జీవన్‌లైట్‌ను రూపొందించారు. ఈ పరికరానికి వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ఉండటంతో రిమోట్‌ మానిటరింగ్‌ విధానంలో రోగులను తాకకుండానే వాడే వీలుంది.

ఇందులో ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీని సెల్‌ఫోన్‌ తరహాలో రీచార్జి చేసుకోవచ్చు. ఒకసారి చార్జ్‌ చేస్తే 5 గంటల పాటు ఏకబిగిన పనిచేస్తుందని చేసిన ఏరోబయోసిస్‌ చెబుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, డీఆర్‌డీవో, ఐసీఎంఆర్‌ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగా దీనిని తయారుచేసినట్లు వెల్లడించింది.

హృద్రోగులు, టైప్‌–2 మధుమేహం ఉన్న వారు కరోనా వైరస్‌ బారిన పడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి అత్యవసర సమయాల్లో ఈ జీవన్‌ లైట్‌ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా సోకిన వారికే కాకుండా ఇతర సందర్భాల్లో చిన్న పిల్లలు, వృద్ధులకు తలెత్తే శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ను వాడొచ్చు.

ఈ వెంటిలేటర్ లక్ష రూపాయలకే అందుబాటులోకి వస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ మూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఏరోబయోసిస్‌కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ రేణు జాన్‌ కోరారు.

కరోనావైరస్

స్మార్ట్‌ఫోన్‌లో కరోనావైరస్ పరీక్ష - హైదరాబాద్ స్టార్టప్ కసరత్తు

కరోనావైరస్‌ (కొవిడ్‌-19) లక్షణాల్లో ప్రధానంగా ఉండే ‘దగ్గు’ను స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేసి, వ్యాధి సోకిందో లేదో ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ డాక్టుర్నల్‌ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం, క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు డాక్టుర్నల్‌ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణకూ వినియోగించే దిశగా ప్రయత్నించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌).. యాప్ నిర్వాహకులకు సూచించింది.

దీంతో.. దగ్గును రికార్డు చేసి, ఇతర లక్షణాలను యాప్‌లో నమోదు చేసి వ్యాధిని గుర్తించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సంస్థ తయారుచేసింది. నెల రోజుల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు జరుగుతోంది.

ఇప్పటివరకు కొవిడ్‌-19ను గుర్తించేందుకు రక్తం, కఫం (కళ్లె) నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఎలాంటి పరీక్షలు అందుబాటులో లేవు.

క్షయ వ్యాధిని గుర్తించేందుకు డాక్టుర్నల్‌ సంస్థను రాహుల్‌ పత్రి, అర్పితాసింగ్‌, వైష్ణవిరెడ్డి, బాలకృష్ణ బగాడి, శేఖర్‌ఝా కలిసి 2016లో ప్రారంభించారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ వేదికగా ఈ అంకుర సంస్థ పనిచేస్తోంది.

దగ్గుకు సంబంధించి 7,000 శాంపిల్స్‌ను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో విశ్లేషించారు. వీటి ఆధారంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. సాఫ్ట్‌వేర్‌ రెండు రకాల్లో (వేరియంట్స్‌) అందుబాటులో ఉంది. మైక్రోఫోన్‌ సాయంతో పనిచేయడంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పనిచేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది రోగి దగ్గు శబ్దాన్ని గుర్తించి.. క్షయనా? కాదా? చెబుతుంది.

దీనికి సంబంధించి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ద్వారా థర్డ్‌పార్టీ క్లినికల్‌ పరిశీలన చేయించారు. 92 శాతం కచ్చితత్వంతో వ్యాధి గుర్తింపు జరుగుతోందని తేలింది. టీబీ అప్లికేషన్‌ ప్రజలకు నేరుగా అందుబాటులో లేదు. కేవలం పీహెచ్‌సీలు, ఆసుపత్రులు, టీబీ కేంద్రాలలో వైద్యులు పరిశీలించేందుకు అందుబాటులో ఉంచారు.

‘‘ఇప్పటివరకు 25 స్క్రీనింగ్‌ క్యాంపులు నిర్వహించాం. టీబీతో పాటు సీవోపీడీ, ఆస్తమా, పీడియాట్రిక్‌, శ్వాసకోశ వ్యాధులను గుర్తించే వీలుంది. సులువైన పద్ధతిలో వ్యాధిని గుర్తించే పద్ధతి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే డాక్టుర్నల్‌ స్థాపించాం’’ అని సంస్థ సీఈవో అర్పితాసింగ్‌ వివరించారు.

విమానయానం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమానయానం

ఈ నెల 30 వరకూ విమానాల బుకింగ్‌లు తీసుకోబోమన్న ఎయిర్ ఇండియా

లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులను ఈ నెల 15 నుంచి పునరుద్ధరించనున్నారని, విమానయాన సంస్థలు బుకింగ్‌లు కూడా ప్రారంభించాయని.. అయితే.. దేశీయ, విదేశీ మార్గాల్లోనూ ఈ నెల 30 వరకు బుకింగ్‌లను తీసుకోబోమని ఎయిర్‌ఇండియా ప్రకటించిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం, ఈ నెల 14వ తేదీన లాక్‌డౌన్‌ పూర్తికానున్న నేపథ్యంలో.. ఆ రోజు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని ఎయిర్‌లైన్‌ అధికార ప్రతినిధి తెలిపారు. గత నెల 24 నుంచి నిలిచిపోయిన విమాన సర్వీసులను యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయానమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి రెండు రోజుల కిందట ప్రకటించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

14 తరువాత రైళ్లకు రిజర్వేషన్‌... 20వ వరకు రిగ్రెట్‌

కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ తరువాత పొడిగించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం చూచాయగా వెల్లడించడంతో ప్రయాణాలకు అనేకమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో చెప్పింది.

రైల్వే అధికారులు ప్రభుత్వ ఆదేశం మేరు ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే టిక్కెట్లను ఇవ్వకుండా బ్లాక్‌ చేశారు. ఆ తరువాత ఎవరైనా బుక్‌ చేసుకునే వీలుంది. దాంతో ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉండిపోయిన వారు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.

రైలు ప్రయాణికురాలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, కొన్ని రైళ్లలో ఏప్రిల్‌ 15 నుంచి 20వ తేదీ వరకు టిక్కెట్లు బుక్‌ అయిపోయాయని, టిక్కెట్‌కు యత్నిస్తే రిగ్రెట్‌ అని తిరస్కరిస్తోందని తెలుస్తోంది.

ఇక ప్రజా రవాణా సంస్థ బస్సులకు ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం వున్నప్పటికీ ఎవరూ దానిని పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. బస్సులు రోడ్లపైకి వస్తే.. ఏదో ఒకటి పట్టుకొని గమ్యం చేరుకోవచ్చుననే ధీమాతో వున్నట్టు ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి.

ఇప్పుడు టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్న వారంతా లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయినవారేనని, ఇతరులు ఎవరూ ఈ సమయంలో ప్రయాణానికి సిద్ధంగా లేరని, ఏప్రిల్‌ 14 తరువాత ఒక వారం రోజులు తప్ప ఆ తరువాత కొన్నిరోజులు పెద్దగా రద్దీ వుండదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)