కరోనావైరస్ లాక్ డౌన్: ఎవరెన్ని చెప్పినా ఆగని వలసలు

జడ్చర్ల దగ్గర నడుస్తున్న కార్మికులు
ఫొటో క్యాప్షన్, జడ్చర్ల దగ్గర నడుస్తున్న కార్మికులు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు, హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఇతర నగరాల కార్మికులు సొంతూరు వెళ్లడానికి తాపత్రయపడుతున్నారు. మీరిక్కడే ఉండండని ముఖ్యమంత్రి చెప్పినా ఆగేలా లేరు. లాక్ డౌన్ ప్రకటించిన మొదట్లోలాగానే ఇప్పుడు కూడా నడిచైనా సరే వెళ్లిపోతూనే ఉన్నారు.

వలస కార్మికుల గురించి బీబీసీ క్షేత్ర స్థాయి పరిశీలనలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. యజమానుల నుంచి సాయం లేక కొందరు, భయంతో కొందరు, ఈ లాక్ డౌన్ ఎన్నాళ్లుంటుందో తెలియక మరికొందరు, లాక్ డౌన్ సమయంలో నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయన్న కారణంతో ఇంకొందరు వలస వెళ్లిపోవడం కనిపించింది. నగరంలో వీలైనంత మంది నడిచే వెళ్తున్నారు. వాళ్లు పదుల కిలోమీటర్లు నడవడానికి కూడా వెనుకాడ లేదు.

కొల్లాపూర్ పట్నంలో టైల్స్ పనిచేసే రామ్ లఖణ్ తనతో పాటు మరో 8 మందిని రాజస్థాన్‌లోని దౌలాపూర్ నుంచి తెలంగాణలోని కొల్లాపూర్‌కి పనికి తీసుకువచ్చారు. వారు ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత వాళ్లు రాజస్థాన్ వెళ్లడానికి సన్నద్ధమయ్యారు. వెళ్లే దారి కనిపించకపోవడంతో నడక మొదలు పెట్టారు. దాదాపు 90 కిలోమీటర్లు కొల్లాపూర్ నుంచి జడ్చర్ల వరకూ నడిచి అక్కడ మంచినీటి కోసం ఆగారు.

వలస కార్మికులు

''మా కాంట్రాక్టర్ లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఫోన్ ఎత్తడం లేదు. ఉన్న డబ్బులతో ఇప్పటి వరకూ నెట్టుకొచ్చాం. దానికితోడు ఈ పిల్లలు (తన తోటి యువ కార్మికులు) భయపడుతున్నారు. వాళ్ల ఇళ్లల్లో వాళ్లు కంగారు పడుతున్నారు. అందుకే వెళ్లిపోదామని నిర్ణయం తీసుకున్నాం. రాజస్థాన్ వెళ్లే లారీ ఏదో ఒకటి దొరక్కపోతుందా అని ఎదురుచూస్తూ ఇంత దూరం నడిచి వచ్చేశాం'' అన్నారు రామ్ లఖణ్.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

వాళ్లు జడ్చర్లలో చాలా సేపు లారీ కోసం చూశారు. ఏదీ కనబడలేదు. దీంతో అక్కడి నుంచి హైదరాబాద్ వరకూ నడిచి వచ్చారు. హైదరాబాద్‌లో ఏదో ఒకటి దొరక్కపోతుందా అని ఆలోచిస్తున్నామని వాళ్లన్నారు.

ఎలాగోలా 170 కి.మీ. నడిచి హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలో వారిని పోలీసులు గుర్తించి, ఒక షెల్టర్‌కి తరలించారు.

వలస కార్మికులు

అదే దారిలో మరో బృందం కూడా రాజస్థాన్ వెళ్తూ కనిపించింది. కానీ వీరు తెలంగాణ నుంచి కాదు. తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి రాజస్థాన్ వెళ్తూ దారిలో విశ్రాంతి కోసం జడ్చర్ల శివార్లలో ఆగారు.

వారి బృందం ఒక పెద్ద కారులోను, అందులో నిండిపోగా, ఒక టూ వీలర్ మీదా ప్రయాణమయ్యారు. ఆగుతూ ఆగుతూ కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ శివార్ల వరకూ వచ్చేశారు. ఇక్కడ నుంచి రాజస్థాన్ వరకూ బండి మీద వెళ్లడానికి సిద్ధపడ్డారు. వారు కూడా కోయంబత్తూర్‌లో టైల్స్ వేసేవాళ్లే.

బెంగళూరు వెళ్లెందుకు శంషాబాద్ పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ వద్ద కూర్చున్న కార్మికులు
ఫొటో క్యాప్షన్, బెంగళూరు వెళ్లెందుకు శంషాబాద్ పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ వద్ద కూర్చున్న కార్మికులు

''ఇది ఎన్నాళ్లుంటుందో తెలీదు. అందుకే మా ఊరు వెళ్లిపోతున్నాం'' అని చెప్పారు వాళ్ల నాయకుడు ఓం వీర్. కానీ తమిళనాడు నుంచి రాజస్థాన్ వెళ్లేందుకు అయ్యే ఖర్చుతో తమిళనాడులోనే ఉండొచ్చు కదా? అని ప్రశ్నించినప్పుడు వారు తమ సమస్యలు వివరించారు.

వలస కార్మికులు

''బయట ఏమీ దొరకడం లేదు. ఏమైనా దొరికినా చాలా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. వందది రెండొందలు చేసేశారు. ఇరవై రూపాయల సరుకు నలభై రూపాయలకు అమ్ముతున్నారు. వీళ్లు స్థానికులు కాదు, బయటి వారు అని తెలిసేసరికి ఇంకా ఎక్కువ వసూలు చేస్తున్నారు. పోనీ సర్దుకుని ఉందామన్నా ఎంత కాలం ఉండాలో తెలియదు. అందుకే వెళ్లిపోతున్నాం'' అన్నారు వారు.

ఓవైపు సరిహద్దులు మూసేయమని కేంద్రం చెబుతుంటే, వారు ఏ ఇబ్బందీ లేకుండా, తమిళనాడు- ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ సరిహద్దులు దాటి ఇక్కడి వరకూ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వైపు వెళ్లే హైవేపై ఇలాంటి ఎన్నో దృశ్యాలు కనిపించాయి. పోలీసులకు భయపడో, ఎండ తక్కువ ఉంటుందనో ఎక్కువ మంది రాత్రుళ్లు నడుస్తూ కనిపించారు. ముఖ్యంగా చదువు మధ్యలో మానేసి ఉత్తర భారతం నుంచి ఇక్కడకు వచ్చి ఏదో ఒక పనిచేసుకుంటున్న వారు ఎందరో కనిపించారు. వారంతా గుంపులు గుంపులుగా నడుస్తూ వెళ్తున్నారు. కొందరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు, కొందరు అటు నుంచి హైదరాబాద్ వైపూ నడుస్తున్నారు.

వలస కార్మికులు

ఆరాంఘర్ దగ్గర రెండ్రోజులుగా ఇద్దరు కుర్రాళ్లు బెంగళూరు వెళ్లాలని ప్రయత్నిస్తూ, వెళ్లలేక అక్కడే ఉన్నారు. వారు హైదరాబాద్‌లో పేరున్న ఒక ఇరానీ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత వారి యజమాని వారికి డబ్బు కానీ, ఆహారం కానీ ఇవ్వలేదని చెప్పారు.

దీంతో వారు బెంగళూరు వెళ్లడానికి శంషాబాద్ ముందు వచ్చే ఆరాంఘర్ దగ్గర, పీవీ నరసింహా రావు ఫ్లైఓవర్ ముగిసే చోట ఆగారు. వారక్కడే రెండు రోజులు గడిపారు. బెంగుళూరు వెళ్లే లారీల్లో అయినా వెళ్లాలనేది వీరి తాపత్రయం. కానీ ఆ లారీలకు ఇవ్వడానికి సరిపడా డబ్బు కూడా వారి దగ్గరలేదు. దీంతో స్వచ్ఛంద సేవా సంస్థ వారు పెట్టింది తింటూ అక్కడే గడిపారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ప్రభుత్వం ఇలాంటి వారికోసం ఏర్పాటు చేసిందన్న విషయం వారికి తెలియదు. ఆ సమాచారం ఇచ్చినప్పుడు ఒకరు ఆసక్తి చూపినా, మరొకరు మాత్రం బెంగళూరు వెళ్లడానికే ఇష్టపడ్డారు. అక్కడ నుంచి నడక మొదలుపెట్టారు.

మహబూబ్ నగర్ వంటి జిల్లాలకు వెళ్లడానికి కూడా కొందరు ప్రయత్నం చేస్తూ కనిపించారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి తాను హైదరాబాద్‌లో పనికోసం వచ్చాననీ, ఇప్పుడు తన భార్య డెలివరీ టైం అనీ, తాను ఇప్పుడు మహబూబ్ నగర్ వెళ్లడం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ఇక ఎక్కువ మంది డీసీఎంలలో, లారీ క్యాబిన్లలో ఎక్కి వెళ్తూ కనిపించారు. ఇక ప్రైవేటు వాహనాలు కూడా అనధికారికంగా చాలా మందిని ఎక్కించుకుని వెళ్తున్నాయి. మామూలు రోజుల్లోలాగే తూఫాన్, ఇన్నోవా వంటి వాహనాలు ప్రయాణికులను ఎక్కించుకుని, ఎక్కువ డబ్బు తీసుకుని వారిని సొంత ఊళ్లకు తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఇంత మంది ఉండడంతో స్వచ్ఛంద సేవ చేసే వారు వచ్చి ఆహారం పంచుతున్నారు.

మొదట్లో చాలా ఎక్కువ మంది వెళ్లారు. ఇప్పటికీ అక్కడ రోజూ 200 మంది వరకూ నడచి వెళ్లడం కనిపిస్తోందని అక్కడ ఆహారం పంచే స్వచ్ఛంద సంస్థల వారు చెబుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)