కరోనా లాక్‌డౌన్: తెలంగాణ రాష్ట్రంలోని 3 లక్షల మంది వలస కార్మికులకు అన్నం పెట్టేదెవరు?

హైదరాబాద్‌లోని కార్మికుడు వెంకట్
ఫొటో క్యాప్షన్, వలస కూలీలే కాదు, ఆటో డ్రైవర్లు, ఇళ్లల్లో పనులు చేసే వారు కూడా లాక్ డౌన్ ఇబ్బందులు అనుభవిస్తున్నారు
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ తెలుగు

"మా దగ్గర సరుకులు అయిపోతున్నాయి. మాకు తరువాత భోజనం ఎక్కడ దొరుకుతుందో తెలీదు. ఇది నెలాఖరు. ఇంటికి పంపేంత డబ్బు కూడా లేదు మా దగ్గర. ఇప్పుడు మేం చేయగలిగిందంతా ఇంట్లో వాళ్లతో మాట్లాడి ఆశ కల్పించడమే'' హైదరాబాద్‌లో కూలీగా పనిచేసే రామచంద్ర యాదవ్ చెప్పిన మాటలివి.

రామచంద్ర యాదవ్ ఝార్ఖండ్‌లోని గిరిడి జిల్లా నుంచి వచ్చారు. ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఇక్కడకు వచ్చారు. చాలా కాలం పాటూ చిన్నా చితకా పనులు చేసి, భవన నిర్మాణ కూలీగా చేసి, మొత్తానికి జ్యూస్ అమ్ముకోవడానికి ఒక తోపుడు బండి కొనగలిగారు. తనతో పాటు ఝార్ఖండ్‌కు చెందిన 20 మంది కలిసి హైదరాబాద్‌లోని ట్రూప్ బజారులో మూడు గదులు ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటామని బీబీసీతో రామచంద్ర చెప్పారు.

"మేమంతా ఇక్కడకు బతుకుదెరువు కోసం వచ్చాం. కొంత మంది తోపుడు బండ్లపై జ్యూస్ అమ్ముతాం. కొందరు సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఇంకొందరు భవన నిర్మాణ కూలీలుగా చేస్తున్నారు. మాకు, ఊళ్లో ఉన్న మా కుటుంబాలకు మా సంపాదనే ఆధారం. మేం ఏడాదికి ఒక్కసారే ఊరు వెళ్తాం. మాలో చాలా మంది రోజుకు 500 నుంచి 600 రూపాయలు సంపాదిస్తారు" అని ఆయన చెప్పారు.

రామచంద్ర లాంటి ఎందరో వలస కూలీలు తమ బతుకు బావుంటుందన్న ఆశతో హైదరాబాద్ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి వచ్చిన లాల్ బహదూర్‌కి లాక్‌డౌన్ అంటే జీతం వస్తుందో రాదో తెలియని పరిస్థితి.

"ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాను. ఒక కాంట్రాక్టరు దగ్గర పెయింటర్‌గా పనిచేస్తున్నాను" అని ఆయన చెప్పారు. ముషీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర ఆయన ఉంటున్నారు.

"నేనిక్కడ పనిచేయబట్టి నెల అయ్యింది. నాతో పాటూ రూంలో ఇంకొకరు ఉంటారు. కానీ ఇప్పుడు మా దగ్గర సరుకులు అయిపోతున్నాయి. మరోవైపు జీతం వస్తుందో రాదో తెలియని పరిస్థితి" అని ఆయన చెప్పారు.

Sorry, your browser cannot display this map