ఏపీ క్యాబినెట్ సమావేశానికి భారీ భద్రత; అమరావతి నుంచి తరలిపోయేది సచివాలయం ఒక్కటేగా.. అంటున్న మంత్రి బొత్స

ఫొటో సోర్స్, Facebook/APCMO
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం వేడి రాజేస్తున్న తరుణంలో ఏపీ క్యాబినెట్ భేటీపై అందరి దృష్టి పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగబోతున్న సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిన జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
రైతుల ఆందోళనలు, సీఆర్డీఏ వ్యవహారాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.
మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అంచనాతో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన ప్రారంభించారు. పది రోజులుగా నిరసనలు సాగిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సహా పలు ప్రతిపక్షపార్టీలు రైతులకు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. "అమరావతి నుంచి కేవలం సచివాలయం ఒక్కటేగా పోతోంది" అంటూ మునిసిపల్ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజధాని ప్రాంతంలో భారీ భద్రత
సీఎం, మంత్రులు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులను మోహరించారు. మందడం గ్రామంలో దుకాణాలు తెరిచేందుకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం పాలు, మందులు దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతినిచ్చారు.
రైతులు ధర్నాలు చేస్తున్న ప్రదేశాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
సచివాలయానికి వెళ్లే మార్గం వద్ద టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, అగ్నిమాపక దళాలను మోహరించారు. క్యాబినెట్ భేటీ దృష్ట్యా ధర్నాలకు అనుమతి లేదని, రైతులు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తుళ్లూరు డీఎస్పీ హెచ్చరించారు. తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రతి గ్రామంలోనూ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, FACEBOOK/APCMO
జగన్ ప్రకటన, కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం
ఏపీ క్యాబినెట్ భేటీలో రాజధాని ప్రధానాంశంగా ఉంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు పేరుని సీఎం ప్రతిపాదించారు. అమరావతిలో మాత్రం లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగిస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం మాటలకు కొనసాగింపుగా రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నియమించిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. మూడు రాజధానులు, నాలుగు రీజియన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి అవసరమైన చర్యలను నివేదిస్తూ సీఎంకి తమ అభిప్రాయాలను కమిటీ వెల్లడించింది.
ఈ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించి తుది అభిప్రాయం వెల్లడిస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఏర్పాటైన సమావేశంలో ప్రభుత్వం ఏం చెప్పబోతోందన్నది చర్చనీయాంశం అవుతోంది.

సీఎం వ్యాఖ్యలు, కమిటీ రిపోర్ట్‌పై తీవ్రమవుతున్న నిరసనలు
సీఎం వ్యాఖ్యలపై అమరావతి కేంద్రంగా మొదలైన నిరసనలు ఉధృతమవుతున్నాయి. కమిటీ రిపోర్ట్ రాగానే ఇవి మరింతగా రాజుకున్నాయి. పలు గ్రామాల్లో రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. వారికి విపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.
టీడీపీ అధ్యక్షుడు, విపక్ష నేత చంద్రబాబు, బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్, కొణిదెల నాగేంద్రబాబు వంటి నేతలు రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆయా గ్రామాల్లో పర్యటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకుని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొదలైన ఆందోళనలు
తొలుత అమరావతి రైతులు నిరసనలు ప్రారంభించగా, ప్రస్తుతం అమరావతి పరిరక్షణ వేదిక పేరుతో రాష్ట్రమంతా ఆందోళనలు సాగిస్తున్నారు.
విజయవాడలో న్యాయవాదులు, విద్యార్థులు, ఇతర సంఘాలు జేఏసీ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లా కేంద్రాల్లో కూడా టీడీపీ నేతలు ఆందోళనబాట పట్టారు. న్యాయవాదులు కూడా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకునే వరకూ నిరసన కొనసాగిస్తామని జేఏసీ కన్వీనర్ శివారెడ్డి బీబీసీకి తెలిపారు.
"రాజధాని అంశాన్ని రాజకీయకోణంలో చూడడం తగదు. ఆంధ్రప్రదేశ్ వంటి కొత్త రాష్ట్రానికి రాజధాని కోసం త్యాగాలు చేయడానికి ముందుకొచ్చిన వారితో ప్రభుత్వం ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. అమరావతికి మద్ధతుగా అసెంబ్లీలో జగన్ మాట్లాడారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మనసు మార్చుకోవడం తగదు. అమరావతి అభివృద్ధికి అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితి రాష్ట్ర భవిష్యత్‌కు మంచిది కాదు" అని అభిప్రాయపడ్డారు.

క్యాబినెట్ భేటీతో పోలీసులు అప్రమత్తం
క్యాబినెట్ సమావేశం చుట్టూ పెద్ద స్థాయిలో చర్చ సాగుతున్న సమయంలో నిరసనల తాకిడి తగలకుండా చూసేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మందడం సహా పలు గ్రామాల ప్రజలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. నిరసనలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను రాజధాని గ్రామాల్లో మోహరించారు. ఎటువంటి అలజడి జరగకుండా చూసేందుకు కసరత్తులు చేస్తున్నారు.

రాజధాని ప్రాంత నేతలతో వైసీపీ కీలక సమావేశం
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు వైసీపీ నేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా "మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు" అంటూ ఇప్పటికే పోలీసులకు కొందరు ఆందోళనకారులు ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా తమ ఆందోళనకు సహకరించాలంటూ కొందరు రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటికి వినతిపత్రం కూడా అతికించారు.
ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ సమావేశం నిర్వహించింది. పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ 13 జిల్లాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

సమావేశానికి సంబంధించిన అంశాలపై మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే కె.పార్థసారధి బీబీసీతో మాట్లాడుతూ... "ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకున్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క నగరాన్ని అభివృద్ధి చేసే బదులు అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగడం కూడా చాలా అవసరం. అమరావతి ప్రాంతంలో పలు పరిశ్రమలు, ఎడ్యుకేషన్ హబ్ లాంటివి వస్తాయి. రాజధాని రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది" అని తెలిపారు.

అమరావతి నుంచి సచివాలయం ఒక్కటే తరలిపోతోంది..
రాజధాని అభివృద్ధిని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యన్నారాయణ విమర్శించారు.
"రాజధాని కోసం చేసిన అప్పులను కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది. కేవలం రూ.5,485 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులో రూ.1500 కోట్లు కేంద్రం ఇచ్చింది. చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు?
వాస్తవాలకు దగ్గరగా మా ప్రభుత్వం ఉంటుంది. గ్రాఫిక్స్ పాలనకు మేము దూరం. చంద్రబాబుకి అమరావతిపై కమిట్‌మెంట్ లేదు. రాజధాని రైతులకు ఏం చేయబోతున్నది క్యాబినెట్‌లో ఖరారు చేస్తాం. అనవసర ఆందోళనతో ఉపయోగం లేదు. అయినా అమరావతి నుంచి సచివాలయం ఒక్కటే కదా పోతోంది" అని మీడియాతో బొత్స వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.
- ఏపీకి రాజధాని విశాఖపట్నమా, అమరావతా.. ఒకటికి మించి రాజధానులున్న రాష్ట్రాల్లో వ్యవస్థలు ఎలా ఉన్నాయి
- విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధానిగా మారేందుకు సన్నద్ధంగా ఉందా
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- తెలంగాణ, ఏపీ కార్మికుల 'గల్ఫ్' బాటకు కారణాలేంటి.. అక్కడ వారి కష్టాలేంటి
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
- నిర్భయ కేసు: మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ నలుగురు దోషులకు చట్టపరంగా ఉన్న చివరి అవకాశాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









