మహారాష్ట్రలో నవంబర్ 9 తర్వాత ఏం జరగొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నామ్‌దేవ్ అంజన
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓవైపు బీజేపీ, శివసేన మధ్య వాగ్యుద్ధం నడుస్తుంటే, మరోవైపు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్య 288. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్ల బలం అవసరం.
అయితే, బల పరీక్ష సమయంలో అసెంబ్లీకి ఎంత మంది హాజరయ్యారన్న విషయాన్ని బట్టి ఈ మ్యాజిక్ మార్కు మారుతుంది.
ఉదాహరణకు బల పరీక్షకు ఎన్‌సీపీ గైర్హాజరవ్వాలని నిర్ణయించుకుంటే మ్యాజిక్ మార్కు 115కు రావొచ్చు. అలాంటి పరిస్థితిలో బీజేపీ సులభంగా మెజార్టీని చేరుకోవచ్చు.
మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
- బీజేపీ - 105
- శివసేన - 56
- ఎన్‌సీపీ - 54
- కాంగ్రెస్ - 44
- సమాజ్‌వాదీ పార్టీ - 2
- ఎంఎన్‌ఎస్ - 1
- సీపీఎం - 1
- ఇతరులు - 23

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఎన్నికల్లో శివపేన-బీజేపీ కూటమి పూర్తి మెజార్టీ సాధించింది. కానీ, ఈ రోజు వరకూ ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు.
దీంతో, రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
నవంబర్ 9 వరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఏం జరుగుతుంది? ఆపద్ధర్మ ప్రభుత్వం ఎప్పటివరకూ కొనసాగొచ్చు? దానికి ఏ హక్కులు ఉంటాయి? కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏయే అవకాశాలున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు బీబీసీ మరాఠీ ప్రయత్నించింది.
ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత సహజంగానే అసెంబ్లీ రద్దవుతుందని ఆసిమ్ సరోడే అనే న్యాయవాది అంటున్నారు.
''ముందుగా రద్దు చేయకపోయినా, రాజ్యాంగంలో సెక్షన్ 172 (1) ప్రకారం ఐదేళ్ల పదవీకాలం పూర్తవ్వడంతోనే అసెంబ్లీ రద్దైనట్లుగానే పరిగణిస్తారు. అప్పుడు కొత్త అసెంబ్లీ ఏర్పడుతుంది'' అని ఆయన అన్నారు.
2014 ఎన్నికల తర్వాత ఏర్పడిన అసెంబ్లీ ఆ ఏడాది నవంబర్ 10న తొలిసారి సమావేశమయ్యింది. అంటే, వచ్చే నవంబర్ 9తో అది రద్దు కావాలి.
అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలి. లేదా గవర్నర్ కూడా అలాంటి పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా లేదు.
''ఒక వేళ గవర్నర్ ఆహ్వానించాలనుకుంటే ప్రస్తుతం అత్యధిక సీట్లు కలిగిన బీజేపీనే ఆహ్వానిస్తారు. బీజేపీ కూడా అందుకు అంగీకరిస్తే, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇస్తారు. ఒకవేళ బీజేపీ కాదంటే, స్థానాల పరంగా దాని తర్వాత ఉన్న పార్టీని గవర్నర్ ఆహ్వానిస్తారు. అసలు ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోతే, ఆ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తారు. సెక్షన్ 256 ప్రకారం రాష్ట్రంలో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు'' అని రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ ఉల్లాస్ బాపట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Ani
గవర్నర్ ఏం చేయాలి?
ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో గవర్నర్, అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీలది ప్రధాన పాత్ర అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ కార్యదర్శి అనంత్ కాల్సే అన్నారు.
''ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాలేదు కాబట్టి, అత్యధిక సీట్లున్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు లేఖ రాయాలి. లేకపోతే గవర్నర్ వారిని ఆహ్వానించాలి. వారికి ఆ అవకాశం ఇవ్వడం గవర్నర్ రాజ్యాంగ విధి. ఆ దిశగా ఆయన చర్యలు తీసుకోవాల్సిందే'' అని చెప్పారు.
నవంబర్ 9లోగా కొత్త ప్రభుత్వం రాకపోతే?
అసెంబ్లీ పదవీకాలాన్ని దాని తొలి సమావేశం తేదీ నుంచి లెక్కిస్తారు. దీని ప్రకారం నవంబర్ 9తో అసెంబ్లీ రద్దవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు కాబట్టి, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ తర్వాత ఏం జరగొచ్చన్న అంశం కీలకంగా మారింది.
నవంబర్ 9లోగా ప్రభుత్వం ఎవరూ ఏర్పాటు చేయకపోతే అసెంబ్లీ సుప్త చేతనావస్థలో ఉంటుందని అనంత్ కాల్సే అన్నారు.
ఒకట్రెండు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించవచ్చని, అప్పుడు అధికారం చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతిల చేతుల్లో ఉంటుందని ఉల్లాస్ బాపట్ చెప్పారు.
రాష్ట్రపతి పాలన విధిస్తే ఏమవుతుంది?
ఏ పార్టీ కూడా బలాన్ని నిరూపించుకోకపోతే, రాజ్యాంగంలోని 18వ అధ్యాయంలోని ప్రకారం అత్యవసర పరిస్థితి తలెత్తుతుంది. దీన్ని రాష్ట్రపతి పాలన అని కూడా పిలుస్తారు.
రాజ్యాంగంలో మాత్రం ఈ పదాలు వాడలేదు. 'రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం'గానే పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదని గానీ, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం లేదని గానీ గవర్నర్ నివేదిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
ఇదే జరిగితే రాష్ట్ర పాలనాధికారం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాలను పార్లమెంటు చూసుకుంటుంది. రాష్ట్రపతి పాలన విధింపు నిర్ణయం రెండు నెలలలోగా పార్లమెంటు ఆమోదం పొందాల్సిందే.

ఫొటో సోర్స్, PIB
ఏడాది వరకూ రాష్ట్రపతి పాలన విధించవచ్చు. న్యాయవ్యవస్థపై దీని ప్రభావమేమీ ఉండదు.
ఏడాదికి మించి కొనసాగించాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతి పొందినా, మూడేళ్లకు మించి రాష్ట్రపతి పాలనను కొనసాగించే వీలులేదు.
''రాష్ట్రపతి పాలన విధిస్తే కేంద్రం ప్రతినిధిగా గవర్నర్ పాలన సాగిస్తారు. అసెంబ్లీ సుప్త చేతానవస్థలోకి వెళ్తుంది. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడకపోతే అసెంబ్లీ రద్దవుతుంది. గవర్నర్‌కు సలహాదారులుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులను నియమిస్తారు'' అని అశోక్ చౌసాల్కర్ అనే ప్రొఫెసర్ చెప్పారు.
రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే, ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే, ప్రభుత్వం మెజార్టీ కోల్పోతే, కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను అమలు చేసేందుకు నిరాకరిస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కూడా బల నిరూపణకు పార్టీలను గవర్నర్ ఆహ్వానించవచ్చు.
ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే..
ప్రస్తుతం మహారాష్ట్రకు దేవేంద్ర ఫడ్నవీస్ 'ఆపద్ధర్మ ముఖ్యమంత్రి'గా ఉన్నారు.
నిజానికి 'ఆపద్ధర్మ ప్రభుత్వం' అనే అంశం రాజ్యాంగంలో లేదని, అనధికారికంగానే ఈ పదాన్ని వాడతామని అనంత్ కాల్సే అన్నారు.
''ఆపద్ధర్మ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వీలులేదు. రోజూవారీ ప్రభుత్వ కార్యాకాలాపాలను మాత్రమే చూసుకోవాలి'' అని వివరించారు.
ఆపద్ధర్మ ప్రభుత్వం నవంబర్ 9 వరకే కొనసాగుతుందని, ఆ తర్వాత అన్ని అధికారాలూ గవర్నర్ చేతుల్లోకి వెళ్తాయని ఉల్లాస్ బాపట్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?
- మహారాష్ట్రలో ‘పెద్దన్న’ ఎవరు? శివసేన కోరికను బీజేపీ అంగీకరిస్తుందా?
- యోగా శిక్షకులు తమ ఆసనాలతో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారా?
- ఈ మొక్కలు కార్చిచ్చుతో మళ్లీ పుడతాయి.. అంగారకుడిపై పెరుగుతాయి... 32000 సంవత్సరాలు బతుకుతాయి
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక యాత్ర 'ఆజాదీ మార్చ్'లో మహిళలు ఎందుకు లేరు
- అబ్దుల్లాపూర్‌మెట్: ‘భూ వివాదంతోనే తహశీల్దారు విజయ రెడ్డిని సజీవ దహనం చేసిన సురేశ్’
- ఆకలితో ఉన్న 500 మేకలు రొనాల్డ్ రీగన్ లైబ్రరీని కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్ నుంచి ఇలా కాపాడాయి..
- ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ: సీఎస్‌ను బదిలీ చేసే అధికారం సీఎంకు ఉంటుందా?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








