మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

సుప్రియా సూలే
ఫొటో క్యాప్షన్, సుప్రియా సూలే

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడి అసెంబ్లీ కాలవ్యవధి నవంబర్ 9తో ముగుస్తోంది.

హరియాణా అసెంబ్లీ కాలవ్యవధి నవంబర్ 2తో ముగియనుంది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు అక్టోబర్ 24న జరగనుంది.

ఓటేసిన మహిళ

మహారాష్ట్రలో 95,473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

హరియాణాలో 19,425 పోలింగ్ కేంద్రాల్లో 1.82 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్‌లను ఉపయోగించాలని ఈసీ నిర్ణయించింది.

ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం కొనసాగుతోంది. హరియాణాలో బీజేపీ పూర్తిస్థాయి ప్రభుత్వం ఉండగా, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఉంది.

మోదీ - ఎన్నికల ప్రచారం

ఫొటో సోర్స్, AFP

మహారాష్ట్ర సమీకరణాలెలా ఉన్నాయి?

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేనల మధ్య సీట్ల పంపిణీలో గత ఎన్నికల మాదిరే కొన్ని విభేదాలు తలెత్తాయి.

ప్రస్తుతం బీజేపీ 150 సీట్లు, శివసేన 124 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మిగిలిన 14 సీట్లను ఇతర మిత్రపక్షాలకు కేటాయించారు.

ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీల ముందు సైతం ఎన్నో సవాళ్లున్నాయి. ప్రముఖ నేతలు పార్టీని వీడటం వీటికి పెద్ద సమస్యగా మారింది.

ఇటీవలే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు రాధాకృష్ణ వీఖే పాటిల్, హర్ష్‌వర్థన్ పాటిల్, నితేష్ రాణె, ఎన్సీపీ నుంచి గణేశ్ నాయక్, ధనంజయ్ మహాదిక్, ఉదయన్‌రాజె భోంస్లే వంటివారు బీజేపీలో చేరారు.

రాధాకృష్ణ వీఖే పాటిల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాధాకృష్ణ వీఖే పాటిల్

నాగ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బరిలో నిలిచారు ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. కాంగ్రెస్ నుంచి యువ నేత ఆశిష్ దేశ్‌ముఖ్ పోటీలో ఉన్నారు. ఆశిష్ రెండేళ్ల క్రితం వరకూ బీజేపీలో ఉన్నారు.

ముంబయిలోని వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే బరిలో నిలిచారు. ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి ఆదిత్యనే. 1966లో శివసేన పార్టీని ఏర్పాటు చేసినప్పటి ఠాక్రే కుటుంబం నుంచి ఎవరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ఎన్నికలు

ఫొటో సోర్స్, EPA

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పుణెలోని కోత్రూడ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎంఎన్‌ఎస్ నుంచి కిశోర్ షిండే ఆయనపై పోటీకి దిగుతున్నారు.

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ కర్జాత్ జాంఖేడ్ నుంచి బరిలో దిగారు. 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన రామ్ షిండే బీజేపీ నుంచి ఆయనపై పోటీచేస్తున్నారు.

బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే ఆమె సోదరుడు, ఎన్సీపీ అభ్యర్థి ధనంజయ్ ముండేపై పోటీచేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ కరాడ్ దక్షిణం నుంచి పోటీలో ఉన్నారు.

మనోహర్ లాల్ ఖట్టర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మనోహర్ లాల్ ఖట్టర్

హరియాణాలో పరిస్థితి ఏంటి?

హరియాణాలో బహుముఖ పోరు నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీ ఇక్కడ బరిలో ఉన్నాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున హరియాణాలో మొదటి ముఖ్యమంత్రి ఈయనే. ఆయనపై కాంగ్రెస్ తరపున త్రిలోచన్ సింగ్ బరిలో నిలిచారు.

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పోటీ చేస్తున్న గర్హిసంపాల కిలోయ్ స్థానంలో బీజేపీ తరపున సతీశ్ నాందాల్ పోటీలో ఉన్నారు.

నార్నౌడ్ నుంచి బీజేపీలో శక్తిమంతమైన నేతగా భావిస్తున్న కెప్టెన్ అభిమన్యు బరిలో ఉన్నారు.

భూపిందర్ సింగ్ హుడా
ఫొటో క్యాప్షన్, భూపిందర్ సింగ్ హుడా

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత బబితా ఫొగట్ బీజేపీ తరపున చార్కీ దాద్రి స్థానంలో నిలిచారు.

ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ బరోడా నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

ఎన్నికలు

ఫొటో సోర్స్, EPA

మరో 51 స్థానాల్లో ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్ సభ స్థానాలకు కూడా అక్టోబర్ 21న ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

వీటిలో తెలంగాణలోని హుజూర్ నగర్ కూడా ఒకటి. ఉత్తర్ ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్‌లో 5, కేరళలో 5, అస్సాంలో 4, పంజాబ్‌లో 4, సిక్కింలో 3, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్‌, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒడిశాలలో రెండేసి స్థానాలు, ఛత్తీస్‌ఘడ్, పుదుచ్ఛేరి, మేఘాలయల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

బిహార్‌లోని సమస్తిపూర్, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ సీట్లలో కూడా ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)