సాహో ప్రభాస్: 'నేనైతే అభిమానులను కొట్టలేను' - ప్రెస్‌ రివ్యూ

ప్రభాస్

ఫొటో సోర్స్, facebook/ActorPrabhas

''సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే.. నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదు కదా'' అని సినీ నటుడు ప్రభాస్ అన్నారు. 'సాహో' చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఆయన 'సాక్షి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.

పాలిటిక్స్‌ వేరు పొలిటికల్‌ ఫిల్మ్‌ వేరు. కథ బావుంటే చేయొచ్చు. యాక్షన్‌ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను. బయట చేస్తున్నానా? అని ప్రశ్నించారు.

సినీ నటుడు చిరంజీవిని ముంబయిలో కలవడంపై స్పందిస్తూ, ''మేం ఒకే హోటల్‌లో ఉన్నాం. గౌరవంగా వెళ్లి కలిశాను. మా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక ఆయన ఫోన్‌ చేశారు. ఆయన తన సొంత సినిమాలా మాట్లాడారు. చిరంజీవిగారు మాట్లాడిన విధానం నాకు భలే సంతోషంగా అనిపించింది. సినిమాను అంతలా ప్రేమించకపోతే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండలేరు'' అని పేర్కొన్నారు.

ఫ్యాన్స్‌ను కలుసుకోవడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని చెప్పారు.

''నేనైతే అభిమానులను కొట్టలేను. తొయ్యలేను. నాకు రక్షణగా ఉన్నవారు అలా చేయడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది. ఒక్క ఫ్యాన్‌ వస్తే చాలు అనుకున్నప్పుడు... ఇంత మంది ఫ్యాన్స్‌ ఉండటం అంటే హ్యాపీనే కదా. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ. కనిపించినప్పుడు అభిమానం చూపిస్తారు. అది నాకు ఇష్టమే'' అని పేర్కొన్నారు.

150 కోట్లతో 'సాహో' చేయాలనుకున్నామని కానీ, బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిందని చెప్పారు.

''ఒకవేళ 'సాహో' వర్కౌట్‌ అయినా నెక్ట్స్‌ ప్యాన్‌ ఇండియా సినిమానే చేస్తానని పెట్టుకోలేదు. తెలుగు సినిమానే చేస్తాను. వేరే భాషలో గెస్ట్‌ పాత్ర చేయొచ్చు. అంతే తప్ప ఇకనుంచి చేసే ప్రతి సినిమా అన్ని భాషలనీ దృష్టిలో పెట్టుకుని చేయాలని రూల్‌ అయితే పెట్టుకోలేదు'' అని వెల్లడించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ఫొటో సోర్స్, Revanth reddy/fb

‘నీళ్ల సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ దోపిడీ’

''నీళ్ల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతోంది. ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలి. మేం ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న అవినీతికే వ్యతిరేకులం'' అని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకదానికొకటి ఏ, బీ టీములుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సను విమర్శిస్తున్నట్లు నటిస్తున్న బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. దమ్ముంటే ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్‌ చేశారు.

ప్రాజెక్టుల బాటలో భాగంగా, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 'ప్రాణహిత ప్రాణఘోష' పేరిట టీపీసీసీ బృందం సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ప్రాణహిత ఒడ్డున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు.

''కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీని ఎత్తిపోసే వంకతో రూ.20 వేల కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై ఎలా ఇస్తారు? దీని వెనక మతలబు ఏమిటి? రూ.5 లక్షలకు మించిన పనులకు టెండర్‌ పిలవాలన్న నిబంధన తెలియదా!? రూ.80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదు!?'' అని నిలదీశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితేనే తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పునరుద్ఘాటించారు.

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీఆర్‌ అంబేడ్కర్‌ సుజల స్రవంతి పేరిట రూ.38 వేల కోట్ల అంచనాతో 16 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ఇక్కడ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.

రూ.10 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేశారని, 70 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వలు తవ్వారని, వాటి ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలించి అక్కడ చిన్న లిఫ్టు ఏర్పాటు చేస్తే సరిపోయేదని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు పాతరేసి.. రీడిజైనింగ్‌ పేరిట రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం చేపట్టడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, NAra chandrababu naidu/fb

అమరావతి అభివృద్ధి ఆగొద్దు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారినా రాజధాని శాశ్వతంగా ఉండాలని.. పాలనలో ఎవరున్నా అమరావతి అభివృద్ధిని కొనసాగించాల్సిందేనని ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారని ఈనాడు తెలిపింది.

రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాలన్నారు. రాజధాని ప్రాంతంలోని నీరుకొండ, బోరుపాలెం, వెలగపూడి, మందడం, క్రిష్ణాయపాలెం తదితర గ్రామాల రైతులు సోమవారం గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబును కలిశారు.

రాజధాని తరలించేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'భూములు అమ్ముకుందామంటే ధరల్లేవు. ప్రభుత్వం కౌలు ఇవ్వట్లేదు. పిల్లల ఫీజులకు, వైద్యం ఖర్చులకు కూడా డబ్బుల్లేకుండా పోయాయి. మీ ఇల్లు ముంచాలని మా ఇళ్లు ముంచారు.

కరకట్ట దాటి నీళ్లు రావడం 70 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు' అన్నారు. చంద్రబాబు రైతులతో మాట్లాడుతూ 'మీరు నాపై నమ్మకంతో 33,500 ఎకరాల భూములిచ్చారు. నేను కూడా 200 ఎకరాల్లో రాజధాని కట్టొచ్చు. భావితరాల కోసం ఆలోచించి అమరావతి నిర్మాణానికి ప్రణాళిక రూపొందించా. మీ భూములను అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచాం.

నాలుగు నెలల ముందే పనులు పూర్తయితే సమస్యలు ఉండేవి కావు. కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అని ముద్ర వేసి చంపినట్లే.. వరదలకు అమరావతి మునిగిపోతుందని ప్రచారం చేసి రాజధానిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి పిచ్చిపట్టింది' అని మండిపడ్డారని ఈనాడు పేర్కొంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు

ఫొటో సోర్స్, kcr/fb

‘వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ ఉండాలి’

ఆర్థిక మాంద్యం ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

గత మార్చిలో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం తెలిపారు. బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో అధికారులతో కసరత్తుచేశారు.

రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు ఇతర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడింది. ఆదాయాలు బాగా తగ్గిపోయా యి. అన్ని రాష్ట్రాల్లోనూ ఆదాయం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆదాయం- అవసరాలను బేరీజు వేసుకొని బడ్జెట్ రూపకల్పన జరుగాలి.

వాస్తవ దృక్పథంతో బడ్జెట్‌ను తయారుచేయాలి. ప్రజా సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తూనే, ఇతర రంగాలకు అవసరమైనమేర కేటాయింపులు ఉండేలా చూడాలి అని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టంచేశారు.

బడ్జెట్ రూపకల్పనపై మంగళవారం కూడా కసరత్తు జరుగుతుందని సీఎం అన్నారు. బడ్జెట్‌కు తుదిరూపం వచ్చిన తరువాత మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం, అసెంబ్లీని సమావేశపరిచి, బడ్జెట్ ప్రతిపాదించడం జరుగుతుందని సీఎం తెలిపారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)