కఠువా అత్యాచారం కేసు: ముగ్గురికి జీవిత ఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్లు జైలుశిక్ష

కఠువా అత్యాచారం కేసులో పఠాన్‌కోట్ కోర్టు ఆరుగురిని దోషులుగా తేల్చింది. వీరిలో ముగ్గురు.. దీపక్ ఖజూరియా, సాంఝీ రామ్, పర్వేష్ కుమార్‌లకు జీవిత ఖైదు విధించింది.
ఈ ముగ్గురికీ రణ్‌వీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) సెక్షన్లు 375డీ, 302, 201, 363, 120బీ, 343, 376, 511ల కింద శిక్షలు ఖరారు చేసింది. అలాగే, ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించిందని బీబీసీ ప్రతినిధి గుర్‌ప్రీత్ చావ్లా తెలిపారు.
మరో ముగ్గురు నిందితులు తిలక్ రాజ్, ఆనంద్ దత్తా, సురిందర్ వర్మలకు ఆర్పీసీ సెక్షన్ 201 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50 వేలు చొప్పున జరిమానా విధించింది.
అంతకు ముందు.. ఆనంద్ దత్తా, దీపక్ ఖజూరియా, సాంఝీ రామ్, తిలక్ రాజ్, సురిందర్ వర్మ(స్పెషల్ పోలీస్ ఆఫీసర్), పర్వేష్‌లను న్యాయస్థానం దోషులుగా తేల్చింది.

ఫొటో సోర్స్, Getty Images
నిందితుల్లో ఒకరైన సాంఝీ రామ్ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా తేల్చింది. కేసులో ప్రధాన నిందితుడు సాంఝీరామ్ గతంలో రెవెన్యూ అధికారిగా పనిచేశారు. సాంఝీరామ్ కుమారుడు విశాల్‌ను న్యాయస్థానం.. నిర్దోషిగా తేల్చడం పట్ల అతడి తల్లి, నిందితుడు సాంఝీరామ్ భార్య దర్శనా దేవి హర్షం వ్యక్తం చేశారు.
అత్యాచారం, హత్య ఘటనకు సాంఝీరామ్ సూత్రధారి అని, అతడికి ఉరిశిక్ష వేయాలని అత్యాచార బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు.
‘‘నాకు కాస్త ఉపశమనంగా ఉంది. కానీ సూత్రధారి సాంఝీరామ్, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దీపక్ ఖరూరియా ఇద్దరికీ ఉరిశిక్ష ఖరారైనపుడే అసలైన న్యాయం జరిగినట్లు భావిస్తాను. ఈ కేసులో వీరే ప్రధాన నిందితులు. కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు వీరు ప్రయత్నించారు’’ అని బాధితురాలి తల్లి బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Mohit kandhari
అసలు ఏం జరిగింది?
గత ఏడాది జనవరి 10న జమ్మూలోని కఠువా జిల్లాలో బకర్వాల్ సమాజానికి చెందిన ఒక బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం ఎనిమిదేళ్ల ఆ బాలికను దేవాలయంలో బంధించి,వారం పాటు సామూహిక అత్యాచారం చేశారు. గొంతు నులిమి హత్య చేయడానికి కొన్ని నిమిషాల ముందు వరకూ కూడా పాపపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు.
బాలికను చంపడానికి 4రోజుల ముందు నుంచీ ఆమెకు మత్తు మందు ఇచ్చారు.
తర్వాత శవాన్ని అడవిలో పడేశారు. ఈ కేసు గురించి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యక్తమైంది.
విచారణ ఏజెన్సీలు ఈ కేసు వెనక మాస్టర్ మైండ్ సాంఝీ రామ్, అతని కొడుకు విశాల్ కుమార్ సహా 9 మంది నిందితులను అరెస్టు చేశారు.
వీరిలో ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ఎస్పీఓ, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు.
2018 మే నెలలో సుప్రీంకోర్టు కఠువా గ్యాంగ్‌రేప్, హత్య కేసును పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు బదిలీ చేసింది.
‘‘నిందితుల్లో సాంఝీరామ్, పర్వేశ్ కుమార్, దీపక్ ఖజూరియాలను ఐపీసీ 376D, 302, 201, 363, 120 B, 343, 376 B సెక్షన్ల కింద, తిలక్ రాజ్, ఆనంద్ దత్తా, సురిందర్ వర్మలను ఐపీసీ 201 కింద న్యాయస్థానం నిందితులుగా పరిగణించింది’’ అని, బాధితుల తరపు లాయర్ ముబీన్ ఫరూకీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అత్యాచారం, హత్య తర్వాత...
- జనవరి 23, 2018న జమ్మూకశ్మీర్ ప్రభుత్వం, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించింది.
- ఫిబ్రవరి 10, 2018న క్రైం బ్రాంచ్ పోలీసులు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దీపక్ ఖజూరియాను అరెస్ట్ చేశారు.
- ఫిబ్రవరి 10, 2018న క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
- చార్జ్‌షీట్ దాఖలు చేసిన సమయంలో చాలామంది కఠువా లాయర్లు న్యాయస్థానం బయట ఆందోళనకు దిగారు. చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
- బాధిత బాలికను అపహరించి, ఆమెకు మత్తు మందు ఇచ్చారని, ఆ తర్వాత తనపై రోజులపాటు సామూహిక అత్యాచారం చేశారని, క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
- మార్చి 4న ఇద్దరు బీజేపీ మంత్రులు చౌధరీలాల్ సింగ్, చంద్రప్రకాశ్ గంగా.. ‘హిందూ ఏక్తా మాంచ్’ ర్యాలీలో మాట్లాడుతూ, కఠువా కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
- ఏప్రిల్ 5న కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సాంఝీరామ్ కోర్టులో లొంగిపోయాడు.
- ఏప్రిల్ 13న చౌధరీలాల్ సింగ్, చంద్రప్రకాశ్ గంగా ఇద్దర్నీ రాజీనామా చేయాలని బీజేపీ ఆదేశించింది.
- కేసు విచారణను జమ్ముకశ్మీర్‌లో చేపట్టరాదని, ఇతర రాష్ట్రంలో విచారణ జరగాలని బాధిత కుటుంబీకులు చేసిన డిమాండ్ గురించి స్పందించాలని సుప్రీం కోర్టు జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
బాధితురాలి కుటుంబ నేపథ్యం ఏమిటి?
బాధితురాలి కుటుంబం ముస్లింలలో గుజ్జర్ సముదాయానికి చెందిన కుటుంబం. హిందువుల ప్రాబల్యం అధికంగా ఉండే జమ్మూ నగరానికి తూర్పున సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రసానా గ్రామంలో నివాసముంటున్నారు.
గుజ్జర్ సమాజానికి మరో పేరే బకర్వాల్ అని కూడా చెప్పొచ్చు. వీరిది బకర్వాల్ సామాజికవర్గం అని కూడా పిలుస్తారు.
ఈ బకర్వాల్ సముదాయానికి చెందిన వారిలో చాలా మంది గొర్రెల కాపరులు. అయితే.. తమను బకర్వాల్ అని కాకుండా గుజ్జర్లనే పిలవాలని కోరే నాయకులు చాలా మంది ఉన్నారు.
వారిలో కొందరు కాస్త చదువుకున్న వారున్నారు. తమ కమ్యూనిటీలో మిగతా వాళ్లు కూడా చదువుకుని, ప్రపంచం గురించి తెలుసుకునేలా చేయటానికి వారు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
కానీ.. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా.. ఈ జనం ఇంకా స్థిరనివాసం లేకుండా పర్వతాలు, మైదానాల్లో పశువులతో పాటు సంచరిస్తూ తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు.
గుజ్జర్లు, బకర్వాల్‌లు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో ఉన్నారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో కూడా వీరు పెద్ద సంఖ్యల్లోనే ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్‌లో గుజ్జర్లు, బకర్వాల్‌లు సుమారు 12 లక్షల మంది ఉన్నారు. అది ఇక్కడి జనాభాలో 11 శాతం.

ఫొటో సోర్స్, KANDHARI / BBC
వారిలో 9.80 లక్షల మంది గుజ్జర్లు, 2.17 లక్షల మంది బకర్వాల్‌లు. బకర్వాల్‌లు గొర్రెలు, మేకలు, గుర్రాలు, కుక్కలను పెంచుతారు. తమ పశువులను అమ్మటం ద్వారా వచ్చే ఆదాయమే వారి జీవన భృతి.
అయితే.. జమ్మూకశ్మీర్‌లో మాంసం డిమాండ్‌ను రాజస్థాన్ నుంచి తెచ్చే పశువుల ద్వారా తీరుస్తున్నారు. ప్రత్యేకించి ఈద్ తదితర పండుగలు, సంప్రదాయ క్రతువుల సమయాల్లో గుజ్జర్లు, బకర్వాల్‌ల పశువులకు గిరాకీ లభిస్తుంది.
అయితే.. బకర్వాల్ సమాజ ప్రజలు ఇప్పటికీ వస్తుమార్పిడి పద్ధతిలోనే తమకు అవసరమైన వస్తువులు కొంటుంటారని, వీరికి బ్యాంకుల్లో అకౌంట్లు లేవు, వారికి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకమూ లేదు అని, వీరి జీవితాలపై పరిశోధన చేస్తున్న జావెద్ తెలిపారు.
దేశ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న గుజ్జర్, బకర్వాల్ కమ్యూనిటీ ప్రజలు.. దేశ రక్షణకు ఎల్లప్పుడూ తోడ్పడుతూనే ఉన్నారు.
''చరిత్ర ఇందుకు సాక్ష్యం. సరిహద్దు ప్రాంతాల్లో సైన్యానికి ఎప్పుడు కొంత సాయం అవసరమైనా.. గుజ్జర్, బకర్వాల్ కుటుంబాలు ముందుకు వచ్చి సాయపడ్డాయి. సుదూర ప్రాంతాల్లోని సైనిక శిబిరాలకు సదుపాయాలను చేరవేయటంలో కీలక పాత్ర పోషించాయి'' అని జావెద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
- కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం
- ఒక్క వారంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం, సజీవ దహనం
- సోషల్: "ఇది చిన్న సంఘటనే, ఎందుకంటే ఇందులో బీజేపీ నేతల ప్రమేయం ఉంది కదా!"
- కఠువా అత్యాచారం: ‘దేశంలో అసలు మానవత్వం ఉందా?’
- గ్రౌండ్ రిపోర్ట్: కఠువా రేప్ తర్వాత.. హిందూ - ముస్లింల మధ్య పెరిగిన అగాధం
- 'కఠువా' కేసు: ఎవరీ బకర్వాల్ ప్రజలు? ఎక్కడి వారు?
- పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్షే!
- ‘‘అత్యాచారం వ్యధ నుంచి నేనెలా కోలుకున్నానంటే...’’
- గాడిద లాగే టాబ్లెట్ కంప్యూటర్‌తో ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- వరల్డ్ కప్ 2019: ఆస్ట్రేలియాపై భారత్ విజయానికి 5 కారణాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








