హీరో వెంకటేశ్, దిల్ రాజు, మంత్రి మల్లారెడ్డి కలిసి ప్రారంభించిన పాఠశాలకు అనుమతుల్లేవ్ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, MPMallaReddy/facebook
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించిన పాఠశాలకు అనుమతులు లేకపోవడం చర్చనీయాంశమైందని ఆంధ్రజ్యోతి రాసింది.
ఆ కథనం ప్రకారం, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం పురపాలక సంఘం పరిధిలోని నారపల్లిలో రవీస్ ఇంటర్నేషనల్ పాఠశాలను హీరో వెంకటేశ్, నిర్మాత దిల్ రాజుతో కలిసి మంత్రి మల్లారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్య అందించడానికి కార్పొరేట్ విద్యాసంస్థలు పాటుపడాలన్నారు. హీరో వెంకటేశ్ మాట్లాడుతూ పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే... పాఠశాలకు అనుమతి లేదంటూ విద్యాశాఖాధికారులు నోటీసులు అంటించారు. రవీన్ ఇంటర్నేషనల్ పాఠశాలకు, మండల కేంద్రంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌కు అనుమతుల్లేవని ఎంఈవో బద్దం నర్సింహారెడ్డి తెలిపారు.
నిర్వాహకులకు పలు మార్లు నోటీసులిచ్చినా అనుమతి తీసుకోలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యాలు బదిలీ చేశాయని వివరించారు. మరోసారి నోటీసు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు.

ఆ వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది
'ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంత ఘోరంగా జరుగుతాయా? చంద్రగిరిలో పోలింగ్ వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఎన్నికల్లో కొందరు సిబ్బంది కుమ్మక్కైతే ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోవాలా?' అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారని సాక్షి రాసింది.
శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ద్వివేది మాట్లాడారు. తొలుత చంద్రగిరిలో ఎన్నికలు సవ్యంగా జరిగినట్లు నివేదికలు వచ్చాయని, కానీ రీ-పోలింగ్ కోరుతూ అందిన ఫిర్యాదులపై వీడియోలను పరిశీలిస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా? అనిపించేలా దారుణమైన పరిస్థితులు కనిపించాయని వెల్లడించారు.
అన్ని ఫుటేజ్‌లు పరిశీలించిన తర్వాతే రీ-పోలింగ్‌కు సూచిస్తూ ఈసీకి సిఫార్సు చేశామని చెప్పారు. చంద్రగిరిలో ఏం జరిగిందన్న విషయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు.
చంద్రగిరిలో ఈసీ రీ- పోలింగ్‌కు ఆదేశించడంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను న్యాయస్థానానికే సమర్పిస్తామన్నారు.
ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలను దాచిపెట్టాలనో లేక ఎవరినో కాపాడాలనో తాము చూడటం లేదని చెప్పారు. రీ పోలింగ్‌పై ఆరోపణలు చేస్తున్నవారు ఒకసారి ఈ వీడియో ఫుటేజ్‌లు చూసి మాట్లాడాలన్నారు.
చంద్రగిరిలో ఎన్నికల సమయంలో తప్పు జరగడం వల్లే ఈసీ స్పందించిందని, ఫిర్యాదు ఆలస్యంగా అందడం వల్లే ఒకేసారి రీ-పోలింగ్ నిర్వహించలేక పోయామని వివరించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
టీడీపీ రీ-పోలింగ్ కోరుతున్న 18 చోట్ల కూడా వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ద్వివేది తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టేది లేదని, చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఏపీవోలపై కఠిన చర్యలుంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అనధికారిక వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు.
చిత్తూరు జిల్లాలోని మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా కలెక్టర్ రీ పోలింగ్‌కు సిఫార్సు చేసినట్లు ద్వివేది తెలిపారు. వీడియో ఫుటేజ్ పరిశీలించిన తర్వాత 310, 323 కేంద్రాలలో రీ పోలింగ్‌కి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై సీఈసీ అనుమతి కోరుతూ నివేదిక పంపినట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
5 సార్లు గీత దాటితే రూ.7000 జరిమానా
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలను కఠినతరం చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.
ఇప్పటివరకూ ఒకరోజు ట్రాఫిక్ ఉల్లంఘనకు ఒకే చలానా వచ్చేది. అదే రోజు మరో ఉల్లంఘన జరిగినా చలానా పంపేవారు కాదు.
ఇకనుంచి అలా ఉండదు. హైదరాబాద్‌లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వారిని లేజర్ గన్‌లతో గుర్తించి వారు ఎన్ని ప్రాంతాల్లో వేగంగా వెళ్లారో... అన్ని చోట్లనుంచీ ఈ-చలానాలు పంపుతున్నారు. ద్విచక్రవాహనాలు మొదలుకొని అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది.
కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించిన పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
శిరస్త్రాణాల విషయంలో మాత్రం వరుస చలానాల నుంచి మినహాయింపునిచ్చారు.
ప్రస్తుతం ఒక్కో కేసుకు రూ.1,400 జరిమానా విధిస్తున్నారు. అంటే, రోజులో 5సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.7000 కట్టాల్సిందే.
జరిమానాలు చెల్లించని పక్షంలో వాహనాలు స్వాధీనం చేసుకోనున్నారు.
అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గంటకు 30 కిలోమీటర్లు, ఔటర్ రింగు రోడ్డుపై గంటకు 100 కి.మీ. వేగంతోనే వెళ్లాలి. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే జరిమానాలు విధిస్తున్నారు.
నాలుగు వరుసల రహదారి ఉన్న ప్రాంతాల్లో వేగపరిమితులు గంటకు 40 కి.మీ. - 60 కి.మీ. మధ్య ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP
శ్రీశైలం విద్యుత్ బంద్
శ్రీశైలం జలాశయంలో నీరు అడుగంటడంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూగబోయాయంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన విద్యుత్‌లో 45శాతం సరఫరా చేసే శ్రీశైలం విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం వారం క్రితం, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని 10 రోజల క్రితం ఆపేశారు.
కుడిగట్టు కేంద్రంలో మొత్తం 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అందిస్తారు. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు కేంద్రంలో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అటూ ఇటూ కలిపి 13 యూనిట్లు ఉన్నాయి.
ఏటా మే నెల చివరిలో జలాశయం అడుగంటుతుంది. అయితే, మూడేళ్లుగా సరైన వర్షాలు లేక ఏప్రిల్ నెలలోనే డ్యామ్ అడుగంటుతోంది.
డెడ్‌స్టోరేజీ (800 అడుగులు)కి చేరుకోగానే కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆపేసి వార్షిక మెయింటెనెన్స్ పనులు చేపడతారు. ప్రస్తుతం ఆ పనులే సాగుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఆరేళ్ల తర్వాత తల్లీబిడ్డలను కలిపిన ఆధార్
ఇంట్లో నుంచి పారిపోయిన ఆరేళ్ల తర్వాత తెలంగాణ సీఐడీ పోలీసులు ఆధార్ వివరాల ఆధారంగా బాలుడి జాడకనిపెట్టి తల్లిదండ్రుల వద్దకు చేర్చారని నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది.
అదనపు డీజీ(సీఐడీ) గోవింద్‌సింగ్ వివరాల ప్రకారం... జహీరాబాద్‌లోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కల్లెం మానయ్య, ఎల్లమ్మ దంపతుల కుమారుడు విజయ్ అలియాస్ జాన్సన్ 2013లో ఇంట్లోంచి పారిపోయాడు.
అప్పటికే ఒకసారి పారిపోయి క్యాటరింగ్ పనులు చేసుకుంటూ ఏడాది తర్వాత తిరిగి ఇంటికి రావడంతో... తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూసి, రాకపోవడంతో 2015 జూలై 13న తల్లి కల్లెం ఎల్లమ్మ జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎంత గాలించినా విజయ్ ఆచూకీ లభించకపోవడంతో 2017 నవంబర్ 17న కేసును సీఐడీకి బదిలీచేశారు.
సీఐడీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇన్‌స్పెక్టర్ బీ జేమ్స్‌బాబు.. విజయ్‌కు క్యాటరింగ్ చేయడంలో ఆసక్తి ఉందన్న క్లూతో క్యాటరింగ్ కాంట్రాక్టర్లందరినీ పిలిపించి విచారించారు.
ఓ క్యాటరింగ్ కాంట్రాక్టర్ వద్ద అతని ఆధార్ వివరాలు ఉండటంతో కేసు దర్యాప్తును కొనసాగించారు. ఆ లింక్ ఆధారంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి ప్రాంతంలో క్యాటరింగ్ పనులు చేసుకుంటున్న విజయ్‌ను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
- గిరిజన గ్రామాల్లో తాగునీటి కొరత.. చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల నడక
- దేశ ఎన్నికల్లో అదానీ ‘బొగ్గు’ కుంపటి.. భారత్‌లో కాదు, ఆస్ట్రేలియాలో..
- #HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- వాట్సాప్: అప్డేట్, బ్యాకప్, 2FA, ప్రైవసీ ఫీచర్లను వాడుకోవడం ఎలా?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








