'రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదంటే...' - చిదంబరంతో బీబీసీ ఇంటర్వ్యూ.

- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంతో బీబీసీ మాట్లాడింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీల నుంచి, కనీస ఆదాయ పథకం, ఉద్యోగ కల్పన, పొత్తులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం వంటి ఎన్నో అంశాలపై ఆయన సమాధానాలిచ్చారు.
ప్రశ్న: ఎన్‌వైఏవై పథకం అమలు సాధ్యమేనా? లక్షలాది పౌరులకు ఒక్కొక్కరికి రూ.72వేల చొప్పున ఇవ్వడానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయి?
చిదంబరం: పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. జీడీపీని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత వ్యయాన్ని, వచ్చే ఐదేళ్లలో జీడీపీలో పెరుగుదల అంచనాలను బట్టి చూస్తే, ఈ పథకం అమలు సాధ్యమే. 20 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. పదేళ్ల క్రితం కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయగలిగే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అట్టడుగున ఉన్న 20శాతం పేద ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించగలిగే సామర్థ్యం ఇప్పుడు భారత్‌కు ఉందనే నమ్ముతున్నాం.

ప్రశ్న: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్‌పీఏ)ను సమీక్షిస్తామని మీరు హామీ ఇచ్చారు. దేశ భద్రతతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని బీజేపీ దీనిపై విమర్శిస్తోంది. ఇది మెజారిటీ ఓటర్లకు సంబంధించిన అంశం కానప్పటికీ, మీకు ఓట్లు తీసుకొస్తుందనుకుంటున్నారా?
చిదంబరం: బీజేపీ రెండు నాలుకలతో మాట్లాడుతోంది. 2015లో త్రిపురలో ఏఎఫ్ఎస్‌పీఏను పూర్తిగా ఉపసంహరించారు. 2018లో మేఘాలయలో చట్టాన్ని ఉపసంహరించారు. 2019 ఏప్రిల్ 1న అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో ఏఎఫ్ఎస్‌పీఏను తొలగించారు. మానవహక్కుల పరిరక్షణకు, సాయుధ దళాల హక్కుల పరిరక్షణకు దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఏప్రిల్ 2న కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏఎఫ్ఎస్‌పీఏను ఎలా సవరిస్తారు అని బీజేపీ మమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు మేం సమాధానం చెప్పేముందు, పూర్తిగా ఎలా ఉపసంహరించారో సమాధానం చెప్పండి.
ప్రశ్న: తమిళనాడులో తప్ప కాంగ్రెస్‌కు బలమైన పార్టీలతో పొత్తులు దొరికినట్లు లేవనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీని అధికారం నుంచి ఎలా దించగలరు?
చిదంబరం: మహారాష్ట్ర, అసోం, బిహార్, కర్నాటక, కేరళ, తమిళనాడులో కాంగ్రెస్‌కు బలమైన మిత్రులున్నారు. ఇవన్నీ పెద్ద రాష్ట్రాలే. కేవలం ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్‌లలో మాత్రమే మాకు పొత్తులు లేవు. మాకు చాలా రాష్ట్రాల్లో పొత్తులున్నాయి. బీజేపీకి ఎన్ని రాష్ట్రాల్లో పొత్తులున్నాయి, చెప్పండి. కేవలం నాలుగు రాష్ట్రాలు. తమిళనాడులో వారు పెట్టుకున్న పొత్తు ఎందుకూ పనికిరాదు. ఇక మిగిలింది బిహార్, మహారాష్ట్ర. ఇంకెక్కడున్నాయి చెప్పండి?

ప్రశ్న: రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎందుకు ప్రకటించడం లేదు?
చిదంబరం: ఈ విషయంపై ఎన్నిసార్లు మాట్లాడాలి? దీని గురించి ఎన్నోసార్లు స్పష్టం చేశా. ఎన్నికల తర్వాత కూటమిలోని పార్టీలన్నీ కలసి కూటమి అధ్యక్షుడిని ఎన్నుకుంటాయి. ఇదేమీ కొత్త కాదు. మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్, దేవేగౌడల ఎంపిక కూడా ఇలాగే జరిగింది. ఎన్నికలు ముగిశాక భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి చర్చించుకుని, తమ నాయకుడిని ప్రకటిస్తాయి. ఈసారి కూడా అలాగే జరుగుతుంది.
ప్రశ్న: వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం వెనక కారణాలేంటి? దక్షిణ భారత దేశాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు. బీజేపీ ఏం నిర్లక్ష్యం చేసింది, కాంగ్రెస్ తమ హయాంలో ఈ ప్రాంతానికి ఏం చేసింది?
చిదంబరం: అది నిజమే. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే బీజేపీ ఉత్తరాదికి, హిందీవారికి చెందిన పార్టీ. దక్షిణాది రాష్ట్రాల్లో వారికి ఎలాంటి మూలాలూ లేవు. అందుకే వారు ఈ రాష్ట్రాల గురించి పట్టించుకోరు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కాంగ్రెస్ ఎప్పుడూ కూడా సంపూర్ణ భారత దేశానికి చెందిన పార్టీ. ఈ పార్టీలో నాయకులు ఉత్తరాదిలోనైనా, దక్షిణాదిలోనైనా ఎక్కడైనా పోటీచేయవచ్చు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీ కూడా ఇలానే చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే చేస్తున్నారు. ఇది ఓ మంచి చర్య అనుకుంటున్నా.

ప్రశ్న:రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి కావాలని డీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఓ జాతీయ నాయకుడిగా దీన్ని ఎలా చూస్తారు?
చిదంబరం: ఇది పార్టీలు పార్లమెంటులో చర్చించాల్సిన అంశం. రాష్ట్రాలకు ఓ అంశాన్ని నిర్వహించగలిగే సామర్థ్యం పెరిగింది అనుకున్నప్పుడు, ఆ అంశాన్ని కేంద్రం రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. పాఠశాల విద్య అంశాన్ని రాష్ట్రాలకు బదలాయించాలని ఈ మేనిఫెస్టోలో మేం పేర్కొన్నాం కూడా.
ఇవి కూడా చదవండి.
- కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రమాదకరమైనది: అరుణ్ జైట్లీ
- బీజేపీ మేనిఫెస్టో 2019: 'ఆరు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలతో హామీ పత్రం'
- తెలుగునాట కుల రాజకీయాలు: ఆ రెండు కులాల మధ్యే ప్రధాన పోటీ
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- ఆంధ్రప్రదేశ్: రాజధాని అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చింది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








