"సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రమంతా పచ్చబడుతుంటే కాంగ్రెసోళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయి": కేటీఆర్ - ప్రెస్ రివ్యూ

కేటీఆర్

ఫొటో సోర్స్, Twitter/KTR

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు 16 సీట్లిస్తే, తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.5 లక్షల కోట్లు తెస్తామని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హామీ ఇచ్చారని ఈనాడు తెలిపింది. కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, ఎన్‌డీఏ‌కు 150, యూపీఏకు 100 స్థానాలకు మించి రావని ఆయన పేర్కొన్నారని చెప్పింది.

శనివారం తెలంగాణలోని వనపర్తిలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గ, చేవెళ్లలో చేవెళ్ల నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. కేవలం ఇద్దరు ఎంపీలతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తెలంగాణను సాధించుకొచ్చారని, 16 స్థానాలను ఆయనకు కానుకగా ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతామని చెప్పారు.

"రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో మనమే కీలకంగా మారతాం. ఫెడరల్‌ ఫ్రంట్ కోసం వివిధ రాష్ట్రాల నేతలంతా కేసీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పవనాలు వీస్తున్నాయి. నిరంతరం కేసీఆర్‌ను విమర్శించే ప్రతిపక్షాలు ఇప్పుడు ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతున్నాయి. టన్నుల కొద్దీ విమర్శలు చేసే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు. రైతుబంధును ప్రధాని మోదీ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో అమలు చేస్తున్నారు. మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నీతీ ఆయోగ్‌ సూచించింది. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్ర మంత్రులు వారి ప్రాంతాలకే న్యాయం చేసుకుంటున్నారు. దేశంలో ఇక జాతీయ పార్టీలకు ఉనికి లేదు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయి" అని ఆయన పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రమంతా పచ్చబడుతుంటే కాంగ్రెసోళ్ల కళ్లు ఎర్రబడుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Twitter/Congress

కేసీఆర్ రిమోట్ మోదీ చేతిలో ఉంది: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రిమోట్‌ కంట్రోల్‌ ఉందని, అందుకే మోదీ ఏం చేసినా కేసీఆర్‌ మద్దతిస్తారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారని సాక్షి తెలిపింది. కేసీఆర్‌ అవినీతి చిట్టా మోదీ వద్ద ఉందని, అందుకే వీరిద్దరూ పరస్పరం సహకరించుకుంటున్నారని ఆయన ఆరోపించారని చెప్పింది.

నోట్లరద్దు, వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) విషయంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యులు బీజేపీకి మద్దతిచ్చిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని రాహుల్‌ చెప్పారు. శనివారం తెలంగాణలోని శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన 'కనీస ఆదాయ వాగ్దాన సభ'లో భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

మోదీ కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నారని, ఆయన 15-20 మంది కార్పొరేట్ల పక్షాన ఉన్నారని ఆరోపిస్తూ, కాంగ్రెస్‌ దేశంలోని పేదల పక్షాన ఉంటుందని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే పేదలను వెతికి పట్టుకుని మరీ వారి బ్యాంకు ఖాతాల్లో కనీస ఆదాయ పథకం కింద డబ్బులు నేరుగా వేస్తామని చెప్పారు.

"గత ఐదేళ్లుగా మోదీ దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలని చూస్తున్నారు. ధనిక, పేద భారతదేశాలుగా విడిపోయేలా పాలిస్తున్నారు. పెద్ద పెద్ద విమానాల్లో తిరిగేవారికి అండగా నిలుస్తున్నారు. రూ.3.5 లక్షల కోట్లను పెట్టుబడి దారులకు రుణమాఫీ కింద ఇచ్చారు. కార్పొరేట్లకు అండగా ఉండి ధనిక భారతదేశాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు పేద రైతులు చేతులు జోడించి రుణమాఫీ చేయాలని కోరినా.. అది మా ప్రభుత్వ విధానం కాదంటున్నారు. రెండున్నర కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానని మోదీ మాట తప్పారు. అయినా లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీలంతా మోదీకే మద్దతిచ్చారు. నోట్లరద్దు మంచిదని కేసీఆర్‌ అంటారు. జీఎస్టీని సమర్థిస్తారు. మోదీ ఏం చేయాలనుకున్నా కేసీఆర్‌ మద్దతిస్తారు. వేల కోట్ల రూపాయల రఫేల్‌ కుంభకోణంలో కేసీఆర్‌ మోదీని ఎన్నిసార్లు ప్రశ్నించారు? ఎప్పుడైనా ఆ రూ.30వేల కోట్ల గురించి అడిగారా? కనీసం విచారణ జరపాలని అడిగారా? మోదీ ప్రధానిగా కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్‌ అవినీతి చిట్టా మోదీ చేతిలో ఉంది. మోదీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌ ఉంది" అని రాహుల్ ఆరోపించారని సాక్షి రాసింది.

డేటా చోరీ కేసులో జగన్, విజయసాయి దొరికిపోయారు: చంద్రబాబు

డేటా చోరీ పేరిట బాహుబలి సినిమాకు మించిన మహా కుట్రలు జరిగాయని, ఇది 'అనేక మంది విలన్లు' కలిసి నడిపిస్తున్న పన్నాగమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వేసిన స్కెచ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డైరెక్షన్‌, తెలంగాణ పోలీసుల యాక్షన్‌లో ఇదంతా జరిగిందని చెప్పారని పేర్కొంది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook/Andhra PradeshCM

"ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక సాక్ష్యం వదిలి వెళతాడు. డేటా చోరీ కేసులోనూ జగన్‌, విజయసాయి రెడ్డి రెడ్‌ హ్యాండెడ్‌గా ఇలాగే దొరికిపోయారు. వాళ్లు రూపొందించుకున్న కుట్రల 'స్కెచ్‌'ను పొరపాటుగా ఎన్నికల కమిషన్‌కు అందించిన వినతిపత్రంతో కలిపి ఇచ్చేశారు. దానిని ఈసీ అధికారిక ఫిర్యాదులో భాగంగా స్వీకరించింది" అంటూ దీనికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు.

శనివారం చంద్రబాబు రాజధాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ను ఎలా టార్గెట్‌ చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని ఆధారంగా టీడీపీలో ఎవరిని ఇరుకున పెట్టాలి... అంటూ ఫోకస్‌ పాయింట్‌ ఫర్‌ సెర్చ్‌ ఆన్‌ ఐటీగ్రిడ్స్‌, టాకింగ్‌ పాయింట్స్‌ ఆన్‌ సేవా మిత్ర అనే రెండు పత్రాలు వైసీపీ రాసిపెట్టుకోగా, అదే స్కెచ్‌ ప్రకారం, కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు నడుచుకున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి చెందిన సమాచారాన్ని తీసుకెళ్లి వైసీపీకి అప్పగించి, తమపైనే ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు.

ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య అని, తేలిగ్గా తీసుకునేది లేదని సీఎం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కోటాతోనే కొలువులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినందున ఉద్యోగ ప్రకటనల జారీపై స్పష్టత వచ్చిందని ఈనాడు రాసింది.

ప్రవేశాలు, ఉద్యోగాల భర్తీలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, కాపులకు ఐదు శాతం చొప్పున రిజర్వేషన్‌ కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వీటి ప్రకారమే ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి. ఇందుకు కనీసం నెల సమయం పట్టే అవకాశాలున్నాయి.

భూపరిపాలన, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఇతర ఉద్యోగ ప్రకటనల జారీ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రకరకాల అవరోధాల అనంతరం ప్రకటనల జారీకి ఏపీపీఎస్సీ ఉపక్రమిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ గత నెలలో చట్టం తెచ్చింది. దీంతో లోగడ అమల్లో ఉన్న జీవోల ప్రకారం ప్రకటనలు ఇవ్వాలా? కొత్త ఉత్తర్వులను అమలుచేయాలా? అన్న అంశాన్ని ఏపీపీఎస్‌సీ ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ఈ క్రమంలో కొత్త రిజర్వేషన్ల అమలుపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడినందున అమలుపై సందిగ్ధత తొలగింది.

గత ఏడాది సెప్టెంబరు 19న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ఆమోదానికి, ఖాళీల భర్తీకి తగ్గట్టు ఏపీపీఎస్‌సీకి వివరాలు పంపడంలో సంబంధిత శాఖలు జాప్యం చేశాయి. ఈ క్రమంలోనే భూపరిపాలన శాఖలో ఉన్న 670 జూనియర్‌ అసిస్టెంట్‌-కమ్‌-కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (గ్రూపు-4) పోస్టులకు సంబంధించి సామాజికవర్గాలవారీ వివరాలు, ఇతర సమాచారాన్ని ఏపీపీఎస్‌సీకి పంపడంలో జాప్యం కొనసాగింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల ఖాళీల వివరాలు కూడా కమిషన్‌కు ఆలస్యంగా అందాయి. సమాచారం వచ్చి ఉద్యోగ ప్రకటనలకు సిద్ధమవుతున్న తరుణంలో కొత్త రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)