40 సెంట్రల్ యూనివర్సిటీల్లో బీసీ కోటా ప్రొఫెసర్లు ఒక్కరు కూడా లేరు

ఓబీసీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ జనాభాలో సగం మందిగా ఉన్న వెనుకబడి తరగతుల వారికి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీసం రిజర్వేషన్ మేరకైనా ప్రాతినిధ్యం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) కోటాలో సగం వాటా కూడా లేరని తేటతెల్లమవుతోంది.

కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ యూనివర్సిటీలు సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలలోని ఉన్నత స్థాయి - గ్రూప్ ఎ, గ్రూప్ బి - ఉద్యోగాల్లో షెడ్యూల్డు కులాలు (ఎస్‌సీలు), షెడ్యూల్డు తెగలు (ఎస్‌టీలు), ప్రత్యేకించి ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇటీవల ఒక కథనంలో వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), మానవ వనరుల మంత్రిత్వశాఖ (హెచ్‌ఆర్‌డీ)ల నుంచి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద సేకరించిన తాజా వివరాలను పరిశీలించినపుడు ఈ కీలక విషయం స్పష్టమైందని ఆ పత్రిక తెలిపింది.

ఒకవైపు.. రిజర్వేషన్లు లేని అగ్రవర్ణాల్లో పేదలకు ఉద్యోగాలు, విద్యలో 10 శాతం కోటా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేపట్టిన నేపథ్యంలో.. రిజర్వేషన్లు ఉన్న వారికే ఉన్నత ఉద్యోగాల్లో వారి కోటా మేరకైనా ప్రాతినిధ్యం లేదన్న విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఓబీసీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెంట్రల్ యూనివర్సిటీల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది రెండు విభాగాల్లోనూ ఓబీసీల ప్రాతినిధ్యం నామ మాత్రంగానే ఉంది

సెంట్రల్ యూనివర్సిటీల ప్రొఫెసర్లలో 95.2 శాతం మంది జనరల్ కేటగిరీయే

ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసిన మండల్ కమిషన్.. 1931 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఓబీసీ జనాభా 52 శాతం మంది అని అంచనా వేసింది.

రాజ్యాంగం ప్రకారం ఓబీసీలకు 27 శాతం, ఎస్‌సీలకు 15 శాతం, ఎస్‌టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.

అయితే.. దేశంలోని 40 సెంట్రల్ యూనివర్సిటీల్లో కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగాల వరకే ఓబీసీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంటే.. ఆ స్థాయి వరకూ ఉద్యోగాల్లో కోటా ప్రకారం ఓబీసీలకు కనీసం 27 శాతం ఉద్యోగాలు ఉండాలి. కానీ ఆ కోటాలో కేవలం సగం మేరకు.. 14.38 శాతం మంది మాత్రమే ఓబీసీలు ఉన్నట్లు తేలిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ముఖ్యంగా.. ఓబీసీ రిజర్వేషన్ కింద నియమితులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఖ్య శూన్యంగా ఉంది.

ప్రొఫెసర్లలో 95.2 శాతం మంది, అసోసియేట్ ప్రొఫెసర్లలో 92.9 శాతం మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లలో 66.27 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందిన వారని ఆ వివరాలు చెప్తున్నాయి. వీరిలో రిజర్వేషన్ ప్రయోజనం పొందని ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలు ఉండి ఉండొచ్చు.

  • మొత్తం 1,125 మంది ప్రొఫెసర్లలో కేవలం 39 మంది (3.47 శాతం) ఎస్‌సీలు, 8 మంది (0.7 శాతం) ఎస్‌టీలు ఉన్నారు.
  • 2,620 అసోసియేట్ ప్రొఫెసర్లలో కేవలం 130 మంది (4.96 శాతం) ఎస్‌సీలు, 34 మంది (1.3 శాతం) ఎస్‌టీలు ఉన్నారు.
  • 7,741 మంది అసోసియేట్ ప్రొఫెసర్లలో 931 మంది (12.02 శాతం) ఎస్‌సీలు, 423 మంది (5.46 శాతం) ఎస్‌టీలు, 1,113 మంది (14.38 శాతం) ఓబీసీలు ఉన్నారు.

బోధనేతర సిబ్బందిలోనూ అంతే..

బోధనేతర సిబ్బందిలో సైతం.. ఎస్‌సీలు కేవలం 8.96 శాతం, ఎస్‌టీలు 4.25 శాతం, ఓబీసీలు 10.17 శాతం మంది మాత్రమే ఉన్నారని గణాంకాలు చెప్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వివరించింది. ఈ విభాగంలో 76.14 శాతం మంది జనరల్ కేటగిరీలో నియమితులైన వారిగా పేర్కొంది.

యూజీసీ సెంట్రల్ యూనివర్సిటీల వివరాలు 2018 ఏప్రిల్ 1వ తేదీ వరకూ, హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ 2018 జనవరి 1వ తేదీ వరకూ, రైల్వేలు 2017 జనవరి 1వ తేదీ వరకూ, డీఓపీటీ 2015 వరకూ గల వివరాలను అందించినట్లు ఆ కథనంలో తెలిపింది.

ఐఏఎస్ అకాడమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ పోస్టులు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీల కోటా పూర్తిగా భర్తీ కావటమే లేదు

గ్రూప్-ఎ, గ్రూప్-బి అధికారుల్లో ఓబీసీలు 9 శాతం కూడా లేరు....

హెచ్ఆర్‌డీ మంత్రిత్వశాఖ, అనుబంధ విభాగాల్లో 665 మంది గ్రూప్-ఎ, గ్రూప్-బి అధికారులు ఉంటే.. వారిలో 440 మంది (66.17 శాతం) జనరల్ కేటగిరీకి సంబంధించిన వారు కాగా.. 126 మంది (18.94 శాతం) ఎస్‌సీలు, 43 మంది (6.47 శాతం) ఎస్‌టీలు, 56 మంది (8.42 శాతం) ఓబీసీలు ఉన్నట్లు ఆ గణాంకాలు చెప్తున్నట్లు వివరించింది.

అంటే.. గ్రూప్-ఎ, గ్రూప్-బి ఉద్యోగాల్లో సైతం ఓబీసీలకు గల రిజర్వేషన్ కన్నా చాలా తక్కువగానే వారి ప్రాతినిధ్యం ఉందని డీఓపీటీ సమాచారం చాటుతోంది.

ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని గ్రూప్-ఎ, గ్రూప్-బి అధికారుల గణాంకాలను చూస్తే.. దేశంలో అత్యధిక ఉద్యోగాలున్న రైల్వేలలో ఈ స్థాయి అధికారుల్లో ఓబీసీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉంది. మొత్తం 16,381 మంది గ్రూప్-ఎ, గ్రూప్-బి అధికారుల్లో కేవలం 1,319 మంది (8.05 శాతం) మాత్రమే ఓబీసీలు ఉన్నారు.

1965 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల కింద.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ నాలుగు కేటగిరీలుగా వర్గీకరించారు. గ్రూప్-ఎ కేటగిరీలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఉంటే.. గ్రూప్-డి కేటగిరీలో దిగువ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి.

ఏడో వేతన సంఘం కమిషన్ నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలోని 33.02 లక్షల మంది ఉద్యోగుల్లో గ్రూప్-ఎ ఉద్యోగులు 3 శాతం, గ్రూప్-బి ఉద్యోగులు 8 శాతం ఉన్నారు. గ్రూప్-ఎ ఉద్యోగులను ప్రధానంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నియమిస్తుంది. గ్రూప్-బి ఉద్యోగులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) నియమిస్తుంది.

ఓబీసీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిజర్వేషన్లు ఉన్నా ఓబీసీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉండటానికి క్రీమీలేయర్ విధానం ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు

మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఓబీసీల సంఖ్య 21.57 శాతమే...

అయితే.. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటివరకూ ఎంతమంది లబ్ధిపొందారన్న గణాంకాలేవీ ప్రభుత్వం వద్ద లేవు.

కానీ, యూనిఫాం రిసోర్స్ లొకేటర్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ఏ, బీ, సీ (సఫాయి కార్మికులు సహా) ఉద్యోగులు 2016 జనవరి ఒకటో తేదీ నాటికి మొత్తం 32,58,663 మందిగా ఉండగా.. వారిలో ఎస్‌సీలు 17.49 శాతం (5,69,886 మంది), ఎస్‌టీలు 8.47 శాతం (2,76,007 మంది), ఓబీసీలు 21.57 శాతం ఉన్నారని గత డిసెంబర్‌లో లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా చెప్పింది. వీరిలో రిజర్వేషన్ల ద్వారా కాకుండా జనరల్ కేటగిరీలో భర్తీ అయిన వారు కూడా ఉన్నారు.

ఓబీసీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను నిరాకరిస్తూ మెరిట్‌ మాత్రమే ప్రాతిపదికగా ఉండాలని తరచుగా ఆందోళనలు చేస్తున్న వారూ ఉన్నారు

ఓబీసీల్లో క్రీమీలేయర్ విధానమే కారణమా?

ప్రభుత్వ ఉద్యోగాల్లో.. ముఖ్యంగా ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఓబీసీ కోటా నిండకపోవటానికి ప్రధాన కారణం.. మోసపూరితంగా అమలులోకి తెచ్చిన క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) విధానమేనని తాను భావిస్తున్నట్లు బహుళ బహుజన సమితి చైర్మన్ ఉ.సాంబశివరావు పేర్కొన్నారు.

''సామాజికంగా, విద్యపరంగా వెనుకబాటు అనేది రిజర్వేషన్లకు వాస్తవ ప్రాతిపదిక. కానీ సామాజికంగా, విద్యపరంగా అణగారిపోయిన వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కొందరు ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లయితే వారికి క్రీమీలేయర్ విధానం వల్ల రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతున్నాయి. సామాజికంగానూ, ఆర్థికంగానూ అణగారిపోయే ఉన్న వారు ముందుకు వచ్చి రిజర్వేషన్లు అందుకునే పరిస్థితి లేకుండాపోయింది'' అని ఆయన బీబీసీతో మాట్లాడుతూ వివరించారు.

''గేదె ముందు మేత వేసి.. గేదె మూతి కట్టేసిన చందంగా ఉంది ఓబీసీ రిజర్వేషన్ల పరిస్థితి. సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన వారికి క్రీమీలేయర్ అనే విధానంతో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు నిరాకరించటం ఇదే కోవకు వస్తుంది'' అని ఆయన అభివర్ణించారు.

ఉ సాంబశివరావు

ఫొటో సోర్స్, Facebook/Usaa U Sambasiva Rao

ఫొటో క్యాప్షన్, ఓబీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించి, క్రమీలేయర్‌ను డీ కేటగిరీలో చేర్చాలని సామాజిక ఉద్యమకారుడు ఉ సాంబశివరావు అంటున్నారు

''ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని యూపీఏ ప్రభుత్వం 2006 ప్రయత్నించినపుడు ఎయిమ్స్, ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు కొందరు ఆ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. వారితో చర్చలు జరిపిన నాటి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ సారథ్యంలోని కమిటీ.. క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయటానికి అంగీకరించింది'' అని ఉసా వివరించారు.

క్రీమీలేయర్ అంటే.. ప్రభుత్వ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఓబీసీల్లో 'వెనుకబాటు నుంచి బయటపడిన' వారికి రిజర్వేషన్లు మినహాయించటం. 'ఆర్థిక ప్రగతి' ప్రాతిపదికగా తొలుత 1993లో అమలులోకి వచ్చిందీ విధానం. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లకు ఇటువంటి క్రీమీలేయర్ విధానం లేదు.

1993 నుంచి 2004 వరకూ రూ. లక్ష దాటితే క్రీమీలేయరే...

తొలుత క్రీమీలేయర్ విధానాన్ని అమలులోకి తెచ్చినపుడు.. వార్షిక ఆదాయం రూ. 1 లక్షకు మించిన ఓబీసీలు రిజర్వేషన్‌కు అనర్హులుగా నిర్ణయించారు. అనంతరం 2004లో ఈ ఆదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు, 2008లో రూ. 4.5 లక్షలకు, 2013లో రూ. 6 లక్షలకు పెంచారు. 2017 సెప్టెంబర్‌లో ఈ క్రీమీ లేయర్ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

అంటే.. 1993 నుంచి 2004 వరకూ ఓబీసీల్లో వార్షిక ఆదాయం రూ. 1 లక్ష దాటిన వారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు దక్కలేదు. 2004 నుంచి 2008 వరకూ రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న ఓబీసీలకు, 2008 నుంచి 2013 వరకూ రూ. 4.5 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వారికి, 2013 నుంచి 2017 వరకూ రూ. 6 లక్షల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారికి ఓబీసీ రిజర్వేషన్లు దక్కలేదు. 2017 సెప్టెంబర్ నుంచి వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు దాటిన ఓబీసీలకు రిజర్వేషన్లు వర్తించవు.

''ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు, క్రీమీలియర్ విధానం అమలులోకి తెచ్చిన ఒక సంవత్సరం తర్వాత నేను, కె.బాలగోపాల్ ఈ రిజర్వేషన్ల అమలుతీరును పరిశీలించాం. మొత్తం 27 శాతం కోటాలో క్రమీలేయర్ నిబంధన కారణంగా కేవలం 7 శాతం కోటానే భర్తీ అవుతున్నట్లు గుర్తించాం. ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లకు ఉన్నట్లుగా బీసీ రిజర్వేషన్ పోస్టులకు 'బ్యాక్‌ల్యాగ్' రక్షణ కూడా లేకపోవటం వల్ల.. ఓబీసీ కోటాలో మిగిలిపోయిన 20 శాతం సీట్లు జనరల్ కేటగిరీలో కలుస్తున్నాయని.. దానివల్ల జనరల్ అభ్యర్థులే లాభపడుతున్నారు'' అని ఉసా వివరించారు.

ఓబీసీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓబీసీ కోటాలో తమ వర్గాలకూ రిజర్వేషన్లు కల్పించాలన్న ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగుతునూ ఉన్నాయి

‘‘ఓబీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి...‘‘

ఓబీసీలు సామాజికంగా, విద్య పరంగా అభివృద్ధి చెందాలంటే.. వారికి కేటాయించిన కోటా మేరకైనా ఉద్యోగాలు భర్తీ కావాలంటే.. ఓబీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలని.. అత్యంత వెనుకబడిన వర్గాలను ఎ-వర్గీకరణలోనూ, క్రీమీలేయర్‌ను డి-వర్గీకరణలోనూ ఉంచాలని.. తాము సూచించే పరిష్కారం ఇదేనని ఉసా పేర్కొన్నారు.

మరోవైపు.. ఓబీసీ రిజర్వేషన్లు చాలా ఆలస్యంగా అమలులోకి రావటం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి ఒక కారణం కావచ్చునని సీనియర్ జర్నలిస్టు, సామాజిక విశ్లేషకుడు నాంచారయ్య మెరుగుమాల అభిప్రాయపడ్డారు.

ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లు రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచే అమలవుతోంటే.. ఓబీసీ రిజర్వేషన్లు 1993 నుంచి అమలులోకి వచ్చాయి.

‘‘నిజానికి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఓబీసీల్లో రాజకీయ, సామాజిక చైతన్యం కూడా చాలా తక్కువగా ఉంది. అంబేడ్కర్ కృషి వల్ల దళిత వర్గాల్లో సామాజిక చైతన్యం బలపడింది. బీసీ వర్గాల వారు రాజకీయంగా బలపడిన ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బీసీలు చైతన్య వంతంగా ఉన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘అయితే.. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోలిస్తే కేంద్ర ఉద్యోగాల్లో బీసీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉండటానికి కారణం.. దేశ వ్యాప్తంగా బీసీల చైతన్యంలో తారతమ్యాలు.. చైతన్యం తక్కువగా ఉండటంగా భావించవచ్చు’’ అని చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)