వర్జినిటీని సీల్ సీసాతో పోల్చిన ప్రొఫెసర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు...

ఫొటో సోర్స్, Amitab bhattali
- రచయిత, అమితాబ్ భట్టాసాలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా జాదవ్‌పూర్ యూనివర్సిటీ పాలక యంత్రాంగం బుధవారం నిషేధం విధించింది.
ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న సర్కార్‌పై విచారణ ప్రారంభించిన యూనివర్సిటీ అధికారులు ఆయన క్లాసులు చెప్పకూడదని కూడా ఆదేశించారు.
"ప్రొఫెసర్ సర్కార్ ఫేస్‌బుక్ కామెంట్ విషయంలో మూడు వర్వేరు విచారణలు ప్రారంభించాం. ఈ విచారణలు పూర్తయ్యేవరకూ ఆయనకు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి రావడానికి అనుమతి లేదు. విచారణ పూర్తయ్యేవరకూ ఆయన తన క్లాసులు కూడా తీసుకోలేరు" అని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సురంజన్ దాస్ చెప్పారు.
ఈ విషయంలో శాఖాపరమైన విచారణతోపాటు, పశ్చిమ బంగ రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కూడా విచారణలు చేపట్టాయి.

ఫొటో సోర్స్, FACEBOOK/KANAK SARKAR
సస్పెన్షన్‌కు డిమాండ్
సంబంధిత విభాగంలోని విద్యార్థి-టీచర్ల కమిటీ అంతకు ముందు బుధవారం జరిగిన సమావేశంలో ప్రొఫెసర్ సర్కార్‌పై తీసుకునే చర్యల గురించి చర్చించింది,
ఈ విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మిశ్రా బీబీసీతో "ఆయన వ్యాఖ్యలను ఖండించేందుకు నా దగ్గర తగిన మాటలు లేవు. వివిధ బ్యాచ్‌ల విద్యార్థులు ప్రొఫెసర్ సర్కార్ ఎప్పుడెప్పుడు ఎలాంటి లైంగిక వ్యాఖ్యలు చేశారో చెబుతూ ఒక లిఖిత మెమో ఇచ్చారు. క్లాసులో ఆయన చేసిన చాలా వ్యాఖ్యలు కూడా వీటిలో ఉన్నాయి. సర్కార్‌ను విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నేను వారి డిమాండును వైస్ ఛాన్సలర్ దగ్గరకు తీసుకెళ్లాను" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Amitab bhattasali
క్లాసులో సెక్సీ వ్యాఖ్యలు
"మా ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను ఎంత విమర్శించినా తప్పులేదు. కానీ ఇది మాకు కొత్తేం కాదు. మీరు ఆయన ఫేస్‌బుక్ అకౌంట్ తెరిస్తే, అలాంటి ఎన్నో కామెంట్స్ కనిపిస్తాయి" అని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంఏ విద్యార్థి సౌనక్ వైద్య అన్నారు
ఆయన దగ్గర చదివే మరో విద్యార్థి "ప్రొఫెసర్ సర్కార్ తీరు గురించి తనను ముందే హెచ్చరించారు. ఆయన అరుస్తారని, సెక్సియెస్ట్ కామెంట్స్ చేస్తారని సీనియర్స్ మాకు మొదట్లోనే చెప్పారు" అన్నారు.
గత రెండు దశాబ్దాలుగా ప్రొఫెసర్‌గా ఉన్న సర్కార్ ఆదివారం తన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. అందులో "చాలా మంది అబ్బాయిలు ఇప్పటికీ దద్దమ్మల్లాగే ఉన్నారు. కన్యను భార్యగా ఎంచుకోవడం గురించి వాళ్లు ఇప్పటికీ అప్రమత్తంగా లేరు. వర్జిన్ అమ్మాయి సీల్ వేసిన బాటిల్ లేదా సీల్ వేసిన ప్యాకెట్‌లా ఉంటుంది. మీరు సీల్ తీసిన కూల్ డ్రింక్ బాటిల్ లేదా చింపిన బిస్కట్ ప్యాకెట్ కొనాలనుకుంటారా? అన్నారు.

ఫొటో సోర్స్, KANAK SARKAR/FB
భావ వ్యక్తీకరణ హక్కుతోనే
సర్కార్ తన పోస్ట్‌లో "ఒక అమ్మాయి సహజంగా సీల్ వేసినట్టే ఉంటుంది. ఒక వర్జిన్ అంటే ఆమెతోపాటూ విలువలు, సంస్కారం, లైంగిక స్వచ్ఛత అన్నీ కలగలిసి ఉంటాయని అర్థం" అన్నారు.
అయితే, సర్కార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన తన కామెంట్స్ డిలిట్ చేశారు.
ఫేస్‌బుక్ పోస్టును సమర్థించుకున్న ప్రొఫెసర్ బీబీసీతో ఆ పోస్టును తన ప్రైవేట్ గ్రూప్‌లో లైట్‌గా రాశానని, కానీ దానిపై వివాదం తలెత్తడంతో డెలిట్ చేశానని చెప్పారు.
"అందరిలాగే నాకు కూడా భావవ్యక్తీరణ హక్కు ఉంది. సమాజంలో విలువల గురించి ఒక సుదీర్ఘ చర్చ నడుస్తోంది. ఈ పోస్ట్ అందులో ఒక భాగమే. అంతకు ముందు నేను అబ్బాయిల గురించి కూడా రాశాను. ఈ కామెంట్‌ను విడిగా కాకుండా ఆ మొత్తం సంభాషణలో ఒక భాగంలాగే చూడాలి. కానీ దీనివల్ల చాలా కుటుంబాలు ముక్కలవుతున్నాయని, సామాజిక విలువలు లేక చాలా కాపురాలు కూలిపోతున్నాయనే నిజాన్ని దాయలేం" అన్నారు.

ఫొటో సోర్స్, Amitab bhattaali
సీల్ చిరిగిపోతుందని తెలీదా?
ప్రొఫెసర్ సర్కార్ స్టూడెంట్ అయిన ఒక విద్యార్థి "మేమేమైనా మినరల్ వాటర్ బాటిళ్లమా, లేక ఇంకేదైనానా. దేవుడు మాకు ఎలాంటి సీల్ వేసి పంపించలేదు. ఆయనకు కనీసం జీవశాస్త్రం గురించి తెలుసా. చాలా చిన్న వయసులోనే రకరకాల కారణాల వల్ల మా సీల్ చిరిగిపోతుందని ఆయనకు తెలీదా? అన్నారు.
యూనివర్సిటీలో మిగతా చాలా మంది విద్యార్థులు కూడా ప్రొఫెసర్ కనక్ సర్కార్ కూల్ డ్రింక్ బాటిల్, బిస్కట్ పాకెట్ కామెంట్‌పై సీరియస్‌గా ఉన్నారు. ఆయన ఒక మహిళను అలాంటి వస్తువులతో ఎలా పోలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొఫెసర్ సర్కార్ కామెంట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం ఇవ్వాలని యూనివర్సిటీ పాలక యంత్రాంగం కోరింది.
ఇవి కూడా చదవండి:
- ట్విటర్ సంచలనం: ఒక్క ట్రిక్కుతో 50 లక్షల రీట్వీట్లు
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- పదేళ్ల నుంచి కోమాలో ఉన్న మహిళ ప్రసవం... ఆస్పత్రి సిబ్బందికి డీఎన్ఏ పరీక్షలు
- హరప్పా నాగరికతలో పురాతన ‘దంపతుల’ సమాధి చెప్తున్న చరిత్ర
- విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫొటోలు వాస్తవానికి భారతీయ సైనికులవి కాదు
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- కోడిపందేల చరిత్ర తెలిసి ఉండొచ్చు.. మరి కోడి చరిత్ర తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








