పోస్టాఫీసుల్లో నిలిచిన తపాలా సేవలు.. గ్రామీణుల అవస్థలు.. వేతన పెంపుకు కేబినెట్ ఆమోదం

ఫొటో సోర్స్, DL Narasimha/BBC
- రచయిత, డీఎల్ నరసింహా
- హోదా, బీబీసీ తెలుగు కోసం
పదిహారు రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో తపాలా సేవలు నిలిచిపోయాయి. పోస్టాఫీసుల్లో దాచుకున్న డబ్బును తీసుకునే అవకాశం లేక గ్రామీణులు, ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
"పానం బాగలేదు సార్.. డాక్టరు కాడికి బోయి సూపిచ్చుకోవాల. కూలికిబోయినేది.. నాకొచ్చే పించిన్ డబ్బులంతా పోట్టాపీసులోనే ఉంది . వారమైంది రోజూ తిరిగిపోతన్న ఈ పోట్టాపీసు తెరసడమెల్యా. బందంట.. ఏంబందో ఏంపాడో..పానంబోతంది. ఎప్పుడుదెరుచ్చారో ఏమో అంతలోపల ఈన్నే సచ్చేటట్టున్న".. ఇది కర్నూలు జిల్లాలోని బిల్లలాపురం గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే 70 ఏళ్ల ఓ వృద్దురాలి ఆవేదన.
"కన్నాపరేషన్ సేయిచ్చుకోవాల.. తిన్నీకి ఇంట్లో సరుకుల్లేవు కొనుక్కోవాల. నా డబ్బు పోస్ట్ ఆఫీసులో ఉంది. రోజూ తిరిగిపోతన్న. స్టయికని ఇయ్యడంలేదు. ఏందిని బతకాలా?".. ఇది కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓ వృద్దురాలి బాధ.

ఫొటో సోర్స్, DL Narasimha/BBC
‘ఇక్కడైతే కేవలం వేలిముద్ర వేస్తే సరిపోతుంది’
గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నిరక్షరాస్యుల ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా పోస్టాఫీసుతోనే ముడిపడి ఉంటాయి. పట్టణాలు, మండల కేంద్రాల్లోని బ్యాంకులకు ప్రయాణ ఛార్జీలు పెట్టుకొని వెళ్లలేని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు సొంతూళ్లలో ఉన్న పోస్టాఫీసును, అందులో పనిచేసే తమకు తెలిసిన ఉద్యోగులను ఎంతగానో నమ్ముతారు.
వారి సహాయంతోనే పోస్టాఫీసులో తమ పనులను చక్కబెట్టుకుంటారు. ‘‘ఇక్కడైతే డబ్బు వేయాలన్నా, తీయాలన్నా బ్యాంకుల్లో మాదిరిగా ఇబ్బంది ఉండదు. కేవలం వేలిముద్రవేస్తే సరిపోతుంది. మిగతాదంతా తపాలా ఉద్యోగే రాసి నమ్మకంగా డబ్బిస్తారు’’ అని మాకం బాలమ్మ చెప్పారు.

ఫొటో సోర్స్, DL Narasimha/BBC
తపాలాశాఖలో రెండు రకాల ఉగ్యోగులు
పల్లె ప్రజలతో ముఖ్యంగా పేదల జీవితాలతో మమేకమైన గ్రామీణ తపాలా కార్యాలయాలు పదహారు రోజులుగా మూతపడ్డాయి. తమ వేతన సవరణకోసం కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన నివేదికను వెంటనే అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రెండు లక్షల డెబ్బైవేలమంది గ్రామీణ డాక్ సేవకులు (జీడీఎస్) బంద్‌లో పాల్గొంటున్నారు.
ఆంధ్రాలో 16 వేలు, తెలంగాణలో 11 వేల మంది గ్రామీణ డాక్ సేవకులు నిరాహారదీక్షలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోల్లో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంద్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షా ముప్పై వేల బీపీవోలు (బ్రాంచ్ పోస్టాఫీసులు) మూతపడగా అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణాలో ఆరువేలు ఆంధ్రాలో తొమ్మిదివేల కార్యాలయాలున్నాయి.
తపాలాశాఖలో రెండు రకాల ఉగ్యోగులు పనిచేస్తుంటారు. ఎనిమిది గంటలపాటు పనిచేసే రెగ్యూలర్ ఉద్యోగులు, టైంస్కేల్ (3 గంటలు లేదా 4 గంటల పని) విధానంలో పనిచేసే ఉద్యోగులున్నారు.
ఎనిమిది గంటలపాటు పనిచేసే రెగ్యూలర్ ఉద్యోగులకు మాత్రం ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే అన్ని రకాల ప్రయోజనాలు వర్తిస్తాయి.
టైంస్కేల్ సిబ్బందికి ఇవేమి వర్తించవు. వీరి వేతన సవరణకు ప్రత్యేకంగా పోస్టల్ బోర్డుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగితో జీడీఎస్ పే కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
1957 నుండి ఇప్పటివరకూ ప్రభుత్వం ఐదు కమిటీల నివేదికల ఆధారంగా గ్రామీణ తపాల ఉద్యోగులకు వేతన సవరణ చేసింది. ప్రస్తుతం ఆరవ కమిటీ సిఫారసుల ప్రకారం జీడీఎస్‌లకు వేతనాలను పెంచాల్సి ఉంది.
ఇందుకోసం కేంద్రం 2015 నవంబరులో కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. ఈయన 2016 నవంబర్‌లోనే తన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. 18 నెలలైనా ఈ నివేదిక ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. దీంతో గ్రామీణ తపాల ఉద్యోగులు బంద్ నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, DL Narasimha/BBC
20 ఏళ్లుగా పని.. 12 వేలకు మించని జీతం
కమలేష్ చంద్ర కమిటీ.. వేతన సవరణతోపాటు గ్రామీణ తపాలా ఉద్యోగుల సంక్షేమానికి అనేక ప్రతిపాదనలు చేసిందని ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి బి. వి. రావు తెలిపారు.
రెగ్యులర్ ఉద్యోగులకు వేతన సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, 20 ఏళ్లుగా పనిచేస్తున్న జీడీఎస్‌లకు కూడా 12 వేలకు మించి జీతం రావటంలేదని ఆయన తెలిపారు.
బంద్ కారణంగా ఇప్పటికే 18వేల పాస్‌పోర్టులు, విద్యార్ధులకు చెందిన వివిధరకాల హాల్ టికెట్స్ కార్యాలయాల్లోనే నిలిచిపోయాయన్నారు. గ్రామాల్లో అవసరానికి పెన్షన్ డబ్బు అందక పేదప్రజలు పడుతున్న అవస్థలు ప్రభుత్వానికి కనిపించటంలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకూ ఆందోళన విరమించేదిలేదని బి. వి. రావు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బంద్ ఇలాగే కొనసాగితే కష్టం
గ్రామీణ డాక్ సేవకులు చేస్తోన్న బంద్ కారణంగా గ్రామాల్లో తపాలా సేవలు నిలిచిపోయాయని, ఇలాగే కొనసాగితే వివిధ రకాల ఉత్తరాలు, పాస్‌పోర్టులు మరింతగా పేరుకుపోయే అవకాశముందని నంద్యాల డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె. నాగభూషణం తెలిపారు.
తమకు అత్యవసరమైన రిజిష్టర్డ్ పోస్టులు, పాస్‌పోర్టులు, ఇతర వస్తువులు వచ్చాయన్న సమాచారం తెలిసినవారు తమ గుర్తింపు కార్డులను సంబంధిత ప్రధాన పోస్టాఫీసులో కాని సబ్ పోస్టాఫీసులో కాని చూపించి వాటిని పొందవచ్చని తెలిపారు.
పోస్టల్ డిపార్టుమెంటుకు చెందిన ట్రేస్ అండ్ ట్రాక్ యాప్ ద్వారా తమ ఉత్తరాలు ఎక్కడున్నది తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.
వేతన పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కాగా, బుధవారం (జూన్ 6వ తేదీ) కేంద్ర కేబినెట్ గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనాల పెంపుకు ఆమోదం తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా 3.07 జీడీఎస్‌లకు లబ్ధి చేకూరుతుందని వివరించింది.
జీడీఎస్‌లను రెండు రకాలుగా వర్గీకరించింది. బ్రాంచ్ పోస్టు మాస్టర్లు (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్లు (ఏబీపీఎం). వీరు పనిచేసే సమయం ఆధారంగా అలవెన్సు (టీఆర్‌సీఏ) స్లాబుల్ని హేతుబద్ధీకరించి, గతంలో ఉన్న 11 స్లాబుల్ని ఇప్పుడు మూడు స్లాబులుగా వర్గీకరించింది. బీపీఎంలు, బీపీఎంయేతర సిబ్బందికి రెండు స్థాయిల్లో ఇవి వర్తిస్తాయి.
- బీపీఎంలకు కనీస టీఆర్‌సీఏ.. నాలుగు గంటలు పనిచేసే వారికి రూ.12 వేలు, ఐదు గంటలు పనిచేసే వారికి రూ.14500
- ఏబీపీఎం/డాక్ సేవక్‌లకు కనీస టీఆర్‌సీఏ.. నాలుగు గంటలు పనిచేసే వారికి రూ.10 వేలు, ఐదు గంటలు పనిచేసే వారికి రూ.12 వేలు
కాగా, కేంద్ర కేబినెట్ నిర్ణయం నేపథ్యంలో సమ్మె విరమించుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అందులో పాల్గొంటున్న తపాలా సిబ్బంది తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- గిరుల మీది గంగను ఊరికి తరలించిన జనులు!
- #UnseenLives: ఊరికి రోడ్డొచ్చాక కూలీల జీవితంలో కొంత మార్పొచ్చింది
- ఆధార్‌తో లాభమా? నష్టమా?
- #AadhaarFacts: పేదలకు ఆధార్ వరమా? శాపమా?
- ఆధార్ లింక్ లేక.. కూలీ డబ్బులు రాక..
- #AadhaarFacts: తల్లీబిడ్డలను కలిపిన ఆధార్
- ఆధార్ అంత మంచిదైతే ఇన్ని సమస్యలెందుకు?
- ఏ దేశాల్లో ఎలాంటి గుర్తింపు కార్డులు వాడతారు?
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








