విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కూటమి, ఏప్రిల్ 19నే ఎందుకీ తీర్మానం?

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ
ఫొటో క్యాప్షన్, నాలుగేళ్లపాటు జీవీఎంసీ మేయర్‌‌గా పని చేసిన గొలగాని హరి వెంకట కుమారి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ) మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయవంతమైంది.

అవిశ్వాస తీర్మానం పెట్టిన సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరుకావడంతో అవిశ్వాసం నెగ్గారు. సమావేశం ప్రారంభం కాగానే హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నాక ఓటింగ్ జరిగింది.

ఓటింగ్‌లో 74 మంది సభ్యులున్న కూటమి విజయం సాధించింది. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజార్టీ సాధించడంతో విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది.

మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారి నిన్నటితో నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు.

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతకు ముందు ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.

అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినప్పటికీ.. ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు ? ఏప్రిల్ 19నే అవిశ్వాసం వెనుక మతలబేంటి?

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీలో ఎవరి బలం ఎంత?

నాలుగేళ్ల క్రితం జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు నాలుగుచోట్ల విజయం సాధించారు. మొత్తం 98 స్థానాలు.

2024 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కౌన్సిల్‌లో పార్టీల లెక్కల్లో తేడాలొచ్చాయి.

వైసీపీకి చెందిన దాదాపు 20 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. అలాగే, ఇండిపెండెట్లు కూడా ఇద్దరు టీడీపీ, మరో ఇద్దరు జనసేనలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్‌లో కూటమి బలం 53కి పెరిగింది. వైసీపీ బలం 38కి తగ్గిపోయింది.

వీరిలో కూడా చాలామంది కూటమి నాయకులతో టచ్‌లో ఉండటంతో తమ బలం ప్రస్తుతం 74కి చేరినట్లుగా కూటమి నాయకులు చెబుతున్నారు.

సంఖ్యాబలం, సమయం అనుకూలంగా మారడంతో వైసీపీకి చెందిన మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిని పదవి నుంచి దించేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరకు విజయం సాధించారు.

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Edward paul

నాలుగేళ్ల నిబంధనే కారణమా?

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించిన తర్వాత, జీవీఎంసీ పాలకవర్గానికి నాలుగేళ్లు నిండేవరకూ అవిశ్వాసానికి వీలుపడదనే నిబంధన పెట్టారు.

దీంతో, కూటమి పార్టీలు మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటివరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. ఏప్రిల్ 18కి నాలుగేళ్లు పూర్తవ్వడంతో.. 19న అవిశ్వాసానికి సిద్ధం చేసుకున్నారు. .

"అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను బెంగళూరు, శ్రీలంకకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా కూటమి నాయకులు తమ సభ్యులను మలేసియా ట్రిప్‌కు పంపించారు. క్యాంపులతో జీవీఎంసీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యూహాలకు సిద్ధమయ్యాయి." అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్.శివప్రసాద్ బీబీసీతో అన్నారు.

అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74. జీవీఎంసీలో మొత్తం డివిజన్లు 98. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి ఎక్స్‌అఫీషియో సభ్యులు మరో 13.

తాజాగా, కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ వైసీపీ నుంచి కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్నట్టయింది. అనుకున్నట్లుగానే అధికారలో ఉన్న మేయర్ అవిశ్వాసం తీర్మానంలో ఓడిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)