షార్క్ దాడిలో యువతి మృతి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హెలెన్ లివింగ్‌స్టోన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలో బీచ్‌లో ఈత కొడుతున్న వారిపై సొర చేప (షార్క్) దాడిచేయడంతో ఒక యువతి మరణించారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ సౌత్ వేల్స్‌లోని కైలీస్ బీచ్‌లో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.
యువతి బీచ్‌లోనే మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
గాయపడిన యువకుడిని హెలికాప్టర్‌లో న్యూకాజిల్‌లోని ఆసుపత్రికి తరలించారు, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఉదయం సిడ్నీకి ఉత్తరాన 300 కి.మీ దూరంలో ఉన్న క్రౌడీ బే నేషనల్ పార్క్‌లోని కైలీస్ బీచ్‌కు పారామెడిక్‌ల కోసం కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన యువకుడి కాలి నుంచి రక్తస్రావాన్ని ఆపడానికి అక్కడున్న ఒకరు కట్టు కట్టారు. అదే ఆయన ప్రాణాలను కాపాడి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఘటనా స్థలంలో ఉన్నవారు 'ధైర్యం' ప్రదర్శించారని ఎన్ఎస్‌డబ్ల్యూ అంబులెన్స్ సూపరింటెండెంట్ జోష్ స్మిత్ అన్నారు. వారి చర్యలు వీరోచితమైనవని, గాయపడిన వ్యక్తికి సమయానికి ప్రాథమిక చికిత్స అందించినట్లు చెప్పారు.

బుల్ షార్క్ దాడేనా?
ఆ సొరచేప బహుశా 'పెద్ద బుల్ షార్క్' అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బుల్ షార్క్‌లు మంచి నీటిలోను, ఉప్పు నీటిలోను నివసిస్తాయి. ప్రమాదకరమైన సొరచేప రకాలలో బుల్ షార్క్ ఒకటని ఆస్ట్రేలియన్ మ్యూజియం తెలిపింది.
ఇంటర్నేషనల్ షార్క్ అటాక్ ఫైల్ ప్రకారం, అవి మూడో అత్యంత ప్రాణాంతకమైన షార్క్ జాతులు.
ప్రస్తుతం బీచ్ మూసివేశారు. ఆ ప్రాంతంలో అధికారులు స్మార్ట్ డ్రమ్‌లైన్‌లను ఏర్పాటు చేస్తున్నారు - ఇవి సొరచేపలను ఆకర్షిస్తాయి. తద్వారా వాటిని పట్టుకోని, వాటికి ట్యాగ్ అమరుస్తారు. ఆ తర్వాత, సురక్షితంగా నీటిలోకి తిరిగి వదులుతారు.
సమీపంలోని బీచ్‌లు కూడా 24 గంటలు మూసివేస్తున్నట్లు, డ్రోన్‌లు పైనుంచి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాయని సర్ఫ్ లైఫ్ సేవింగ్ ఎన్ఎస్‌డబ్ల్యూ (బీచ్‌లలో ఈత కొట్టే, సర్ఫింగ్ చేసే ప్రజల ప్రాణాలు కాపాడటానికి పనిచేసే రక్షణ సంస్థ) తెలిపింది.
"ఇది ఒక భయంకరమైన విషాదం, ఆ యువతి, యువకుడి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం" అని సర్ఫ్ లైఫ్ సేవింగ్ ఎన్ఎస్‌డబ్ల్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ పియర్స్ అన్నారు.
సమీపంలోని బీచ్‌లలో నీటికి దూరంగా ఉండాలని, లైఫ్‌గార్డ్‌ల సూచనలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు.
ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన ఐదో ప్రాణాంతకమైన షార్క్ దాడి ఇది. మూడు నెలల కిందట మరో షార్క్ దాడి జరిగింది. సిడ్నీ ఉత్తర బీచ్‌లో జరిగిన ఆ దాడిలో ఒక వ్యక్తి మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














