హైదరాబాద్: 'కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు'

ఫొటో సోర్స్, UGC
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''హైదరాబాద్‌లోని శంషాబాద్ దగ్గరున్న కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. శనివారం మే 10వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది'' అని శంషాబాద్ విమానాశ్రయ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె బాలరాజు బీబీసీకి చెప్పారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. వాటిలో సుమారు పది నుంచి పదిహేను మంది కాషాయ జెండాలు కప్పుకుని, 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేస్తూ కరాచీ బేకరీ బోర్డు పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అలాగే, కరాచీ బేకరీ సిబ్బందితో, ఆ బేకరీ మెట్ల మీద పాకిస్తాన్ జెండా స్టిక్కర్లను అతికింపజేసి, వాటిని కాలితో తొక్కుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఘటనపై కేసు నమోదు చేశామనీ, ఎవరికీ గాయాలు కాలేదనీ, ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదనీ ఇన్‌స్పెక్టర్ బాలరాజు చెప్పారు.
"అది ఎవరైనా అపోహలతో చేసి ఉండవచ్చు. బీజేపీకి సంబంధం లేదు" అని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఇదే మొదటిసారి కాదు..
అయితే, తెలుగు రాష్ట్రాల్లో కరాచీ బేకరీపై దాడి జరగడం ఇదే మొదలు కాదు.
గతంలో పుల్వామా దాడి సమయంలోనూ కొందరు వ్యక్తులు హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ వద్ద ఆందోళన చేయడం, బోర్డు కవర్ చేసే ప్రయత్నాలు చేయడం వంటివి జరిగాయి.
తాజాగా, మరోసారి పహల్గాం దాడి నేపథ్యంలో కూడా ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
ఈసారి విశాఖపట్నం కేంద్రంగా, జనజాగరణ సమితి అనే సంస్థ మే 5న విశాఖ వెంకోజీపాలెం పెట్రోలు బంకు దగ్గర కరాచీ బేకరీ వద్ద ఆందోళన చేపట్టింది. బేకరీ పేరు మార్చేయాలని కోరింది.
''పేరు మార్చకపోతే కరాచీ బేకరీ యజమానులపై దేశద్రోహం కేసులు పెట్టాలి'' అని ఆ సంస్థ డిమాండ్ చేసింది. అంతేకాదు, పది రోజులలో కరాచీ బేకరీల పేర్లను మార్పు చేయకపోతే పెట్రోల్ పోసి తగలబెడతాం అని హెచ్చరికలు చేసింది ఆ సంస్థ.

ఫొటో సోర్స్, UGC
2019లో పుల్వామా దాడి తరువాత తమ మూలాల గురించి చెబుతూ ఆ బేకరీ వాసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
''కరాచీ బేకరీని కాన్ చెంద్ రామ్నాని అనే వ్యక్తి ప్రారంభించారు. భారత్ – పాకిస్తాన్ విభజన సమయంలో ఆయన భారత్ వచ్చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో 1953లో ఒక భారతీయ సంస్థగా ఇది ప్రారంభం అయింది. తరువాత దేశమంతా ఎదిగింది. కరాచీ బేకరీ అచ్చమైన భారతీయ సంస్థ. దీనిపై అపోహలకు తావులేదు'' అని సంస్థ ప్రకటించింది.
భారత్, పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి సింధీలుగా పిలిచే హిందువులు పెద్ద సంఖ్యలో వలస వచ్చి భారతదేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. వారంతా ఎక్కువగా వ్యాపారాల్లో ఉన్నారు. దేశంలోని పెద్ద స్థానాల్లోకీ ఎదిగారు.
బీజేపీ ప్రముఖ నాయకులు ఎల్కే అడ్వాణీ కూడా సింధీయే. కరాచీ బేకరీ వ్యవస్థాపకులు కూడా అదే వర్గానికి చెందిన వారు. న్యాయవాది రామ్‌జెఠ్మలానీ, నటి తమన్నా, కియారా అడ్వాణీ, వ్యాపారవేత్త హిందూజా గ్రూప్‌కు చెందిన గోపిచంద్ హిందూజా వీరంతా సింధీలే. హైదరాబాద్‌లో వీరి పేరుతో ఒక కాలనీ కూడా ఉంది.

ఫొటో సోర్స్, UGC
'ఇది భారతీయ కంపెనీ'
గతంలో ముంబైలో ఎంఎన్ఎస్ వంటి సంస్థలు కూడా కరాచీ పేరుపై ఆందోళన చేశాయి.
2021లో కోవిడ్ వల్ల ముంబైలోని బాంద్రాలో కరాచీ బేకరీ తాత్కాలికంగా మూసివేస్తే, అది పేరు వివాదం వల్లనే మూసేశారంటూ వార్తలు వచ్చాయి.
అప్పుడు కూడా కరాచీ బేకరీ ఒక ప్రకటన ఇచ్చింది.
''కరాచీ అన్న పదం తాము పుట్టిన ప్రదేశానికి సంబంధించింది మాత్రమే. ప్రస్తుత వివాదాలకు సంబంధం లేదు. ఇది పూర్తి భారతీయ కంపెనీ.'' అని ఆ సంస్థ 2021లో పేర్కొంది.
తాజా వివాదం నేపథ్యంలో మరోసారి ఆ బేకరీ యాజమాన్యం స్పందించింది.
''మా తాతగారు ఈ బేకరీ పెట్టారు. ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చినప్పుడు పేరు మాత్రమే తెచ్చుకున్నారు. ఆ ప్రేమతో పెట్టారు. మేం పూర్తి భారతీయులం. ఈ పేరు మార్చకుండా ఉండడంలో మాకు మద్దతివ్వాలని తెలంగాణ పోలీసులు, ప్రభుత్వాన్ని కోరుతున్నాం'' అని మే 8న పీటీఐతో చెప్పారు ఆ సంస్థ ప్రస్తుత యజమాని రాజేశ్ రామ్నానీ, ఆయన కుటుంబ సభ్యులు.
కరాచీ బేకరీ పేరు వివాదంపై సోషల్ మీడియాలో ఆ సంస్థకు బాగా మద్దతు వస్తోంది. చాలా కొద్దిమంది మాత్రమే పేరు మార్పు కోరుతుండగా, మెజార్టీ మద్దతిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
'బీజేపీకి సంబంధం లేదు': ఆ పార్టీ అధికార ప్రతినిధి
''అది ఎవరైనా అపోహలతో చేసి ఉండవచ్చు. బీజేపీకి సంబంధం లేదు. దాడి చేసిన వారెవరో కూడా తెలియదు. కరాచీ అనగానే పాకిస్తాన్ అనే అనుమానం చాలా మందికి వచ్చి, ఎమోషన్స్ పెరిగి, సమాచారం లేని వారు కొందరు ఆవేశపడుతున్నారు. అటువంటి ఎమోషన్స్‌ని కొందరు వాడుకుంటున్నారు. అటువంటి చర్యలను సమర్థించలేం. ఖండిస్తున్నాం. కరాచీ బేకరీ హైదరాబాదీలది, సింధీలది. వారు నిజంగా బీజేపీ వారా, ఎవరు ఇది చేశారు అన్నది తెలియదు. కానీ ఈ సందర్భంలో ఎమోషన్ కంటే యూనిటీ ముఖ్యం'' అని బీబీసీతో చెప్పారు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














