బిహార్: ఎన్డీయే హవాలోనూ ఎంఐఎం తన 5సీట్లను ఎలా కాపాడుకోగలిగింది?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం ఓటు బ్యాంక్, సీమాంచల్

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఒవైసీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఈసారి బిహార్‌లో 25 స్థానాల్లో పోటీ చేసి అందులో ఐదింటిని గెలుచుకుంది.

వీటిలో జోకిహాట్, బహదూర్‌గంజ్, కోచాదామన్, అమౌర్, బాయసి ఉన్నాయి.

ఈ ఐదు స్థానాలు ముస్లింలు అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఉన్నాయి.

బిహార్‌లో ఎన్డీయే దెబ్బకు ఆర్జేడీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీ బలం 25 సీట్లకు తగ్గింది. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా ఎంఐఎం సాధించిన విజయం కీలకమైనది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆర్జేడీలోకి ఫిరాయించారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో గెలిచిన 5 సీట్లను ఎంఐఎం నిలుపుకుంది.

సీమాంచల్‌ ప్రాంతంలో కిషన్‌గంజ్, కటిహార్, అరారియా, పూర్ణియా జిల్లాలు ఉన్నాయి. ఈ 5 జిల్లాల్లో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలున్నాయి.

ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారు. చాలా కాలంగా ఇది ప్రతిపక్షాలకు బలమైన కోటగా ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో ఎన్డీయే కూటమి 14 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 4, ఆర్జేడీ ఒక్క స్థానానికే పరిమితమయ్యాయి.

మెజారిటీ స్థానాలు ఎన్డీయే కూటమికి దక్కకడంతో రానున్న రోజుల్లో సీమాంచల్ ప్రాంతం ప్రతిపక్షాలకు కంచుకోటగా ఉంటుందనే గ్యారంటీ లేకుండా పోయింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఒవైసీ, ముస్లిం ఓటు బ్యాంక్, సీమాంచల్

ఫొటో సోర్స్, facebook.com/PartyAIMIM

ఫొటో క్యాప్షన్, ముస్లింలు, దళితుల సమస్యల పరిష్కారానికి తాము పోరాడుతున్నామని ఎంఐఎం ప్రచారం చేసింది.

ఎంఐఎం బలమైన ప్రదర్శన

బిహార్ జనాభాలో దాదాపు 17 శాతం మంది ముస్లింలు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ముస్లింలలో దాదాపు 47 శాతం మంది సీమాంచల్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం, యాదవ్‌ ఓటర్లను ఆర్జేడీ ప్రధాన ఓటు బ్యాంకుగా భావిస్తారు.

బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి ఒక వైపు పశ్చిమబెంగాల్, మరోవైపు నేపాల్, ఇంకో వైపు బంగ్లాదేశ్‌ఉన్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రాంతం కీలకంగా ఉంది.

2020 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ8, దాని మిత్ర పక్షం జేడీయూ 4 సీట్లు గెలుచుకున్నాయి.

ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 5, సీపీఐఎంఎల్, ఆర్జేడీ ఒక్కో సీటు దక్కించుకున్నాయి.

అయితే ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

దీంతో ఎంఐఎం ఆర్జేడీ, కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకును దెబ్బ తీసిందని, బీజేపీకి లాభం చేకూర్చిందనే విశ్లేషణలు వచ్చాయి.

2025లోనూ ఎంఐఎం ఐదు చోట్ల గెలవడంతో పాటు కిషన్‌గంజ్‌ జిల్లాలోని ఠాకూర్ గంజ్, కటిహార్‌ జిల్లాలోని బలరాంపూర్‌లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.

ప్రాణ్‌పూర్, అరారియా, కస్బా, కేవటి వంటి నాలుగు స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు మూడో స్థానంలో ఉన్నారు. ఈ సీట్లలో ఫలితాలను ఎంఐఎం ప్రభావితం చేసింది. ఇక్కడ ఎంఐఎం పోటీలో లేకుంటే ఫలితాలు తారుమారై ఉండేవి.

బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు స్థానాలను గెలుచుకున్నాయి. పూర్ణియా జిల్లాలోని కస్బా నియోజకవర్గంలో ఎల్జేపీ( రామ్ విలాస్) అభ్యర్థి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. దీని వల్ల మహాఘట్‌బంధన్‌ ఎక్కువగా నష్టపోయింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం ఓటు బ్యాంక్, సీమాంచల్

ఫొటో సోర్స్, aimim_national@x

ఫొటో క్యాప్షన్, కోచాదామన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎంఐఎం అభ్యర్థి సర్‌వర్ ఆలం (మధ్యలో ఉన్న వ్యక్తి) గెలిచారు.

బీజేపీకి ‘బీ టీమ్’ అనే ఆరోపణలు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ లేదా ఆ పార్టీ నాయకత్వంలోని కూటమికి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు క్షీణించిందని సూచిస్తున్నాయి.

2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈసారి ఎన్నికల్లో ఓట్ల విభజన జరక్కుండా చూసేందుకు తమతో కలవాలని మహా కూటమి అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు.

"ఆర్జేడీ మా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంది. అది మర్చిపోయి మేం వారితో కలిసేందుకు సిద్ధపడ్డాం. అయితే వారు మా ఆఫర్‌ను అంగీకరించకుండా, తరువాత వారు ముస్లిం ఓట్లను మేమే చీల్చామని ఆరోపించలేరు. మాకున్న బలంతో మేం సీమాంచల్‌లో 50 కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అని బిహార్ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ ఈ ఏడాది జూన్‌లో 'ది ప్రింట్‌'తో చెప్పారు.

ఈ ఎన్నికల్లో ఎంఐఎం 25 స్థానాల్లో పోటీ చేసింది.

అక్తరుల్ ఇమాన్ కృషి వల్లే తమ పార్టీ ఐదు చోట్ల విజయం సాధించిందని ఎంఐఎం అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆదిల్ హసన్ చెప్పారు.

మైనారిటీలు, దళితుల సమస్యల పరిష్కారానికి తాము పోరాడామని అందుకే ఆ వర్గాలు తమను విశ్వసించాయని ఆయన అన్నారు.

గతంలో ఎంఐఎం ప్రాతినిధ్యం వహించిన బలరాంపూర్ స్థానంలో ఈసారి ఎల్జేపీ( రామ్‌విలాస్) గెలిచింది. ఇక్కడ ఎల్జేపీ అభ్యర్థి సంగీత దేవి 389 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.

2020లో 243 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలను గెలుచుకుంది. మెజార్టీ మార్క్ కంటే 3 సీట్లే ఎక్కువ. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ75 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది.

కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసి 19 సీట్లు గెలుచుకుంది. సీపీఐఎంఎల్ 12, సీపీఐ రెండు, సీపీఎం రెండుచోట్లా గెలిచాయి. ఆర్జేడీ నాయకత్వంలోని కూటమి మొత్తం 110 సీట్లు గెలుచుకుంది.

ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం ప్రచారం చేసిన రెండు అంశాలు మహా కూటమి ఓటు బ్యాంకును దెబ్బ తీశాయని భావిస్తున్నారు. తన ర్యాలీలలో సీమాంచల్ ప్రజలను నిర్లక్ష్యం చేశారనే అంశాన్ని ఒవైసీ తరచూ ప్రస్తావించడం వాటిలో ఒకటి. ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

గత ఎన్నికల్లో రెండు కూటములు ముస్లింలకు తక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించాయి.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం ఓటు బ్యాంక్, సీమాంచల్

ఫొటో సోర్స్, facebook.com/PartyAIMIM

ఓటు బ్యాంక్ ఒవైసీ వైపు ఎలా మళ్లిందంటే..

"ముస్లింలు మెజార్టీగాఉన్న ప్రాంతాల్లో ముస్లింల ఓటింగ్ సరళి ఉన్నట్లుగా వారు మైనారిటీలుగా ఉన్న ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. ముస్లింలు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో వారి భద్రత అనేది సమస్య కాదు. అలాగే మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో వారి భద్రతను స్థానిక అంశంగా భావిస్తారు" సీనియర్ జర్నలిస్ట్ సురూర్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.

"వాళ్లు చాలా అంశాల గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. తమకు సొంత పార్టీ ఉండాలని, స్థానికంగా తమ సమస్యల్ని పరిష్కరించే వాళ్లు ఉండాలని కోరుకోవచ్చు" అని సురూర్ అహ్మద్ అన్నారు.

ఈ అంశాలు సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎంకు సానుకూలంగా మారాయనేది ఆయన అభిప్రాయం.

"ఒవైసీ ప్రధానంగా ముస్లిం రాజకీయాలు చేస్తారు. అలాంటప్పుడు ఆయన ప్రత్యర్ధులు ముస్లిం ఓటుబ్యాంక్ పార్టీలే. బిహార్‌లో ఆయన ప్రత్యర్థులు కాంగ్రెస్, ఆర్జేడీలే. బీజేపీ కాదు" అని సురూర్ అహ్మద్ విశ్లేషించారు.

గత ఎన్నికల్లో ఏఐఎంఐఎం 5 సీట్లు గెలుచుకుంది. కానీ అందులో నలుగురు ఆర్జేడీలో చేరారని సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మ చెప్పారు.

"ఒవైసీ ఒకదాని తర్వాత ఒకటి ర్యాలీలలో తాను మహా ఘట్ బంధన్‌తో కలిసేందుకు ప్రయత్నించానని, అయితే కూటమి తనను చేర్చుకునేందుకు ఒప్పుకోలేదని ఒక స్టోరీ అల్లారు" అని స్మితా శర్మ బీబీసీ 'ది లెన్స్' కార్యక్రమంలో చెప్పారు.

బిహార్‌లో ముస్లింలు, యాదవులు తమ ఓటు బ్యాంకని కాంగ్రెస్, ఆర్జేడీ భావిస్తున్నాయి. అయితే ఈసారి ఆ ఓటు బ్యాంక్ చీలిపోయిందని ఆమె అన్నారు.

"మహా ఘట్ బంధన్ తమను నిర్లక్ష్యం చేసిందని స్థానిక ముస్లింలు భావించారు. ఆ కూటమి తమకు సరైన ప్రాతినిధ్యం ఇచ్చేందుకు ఇష్టపడలేదా అనేది వారి మనసులో ఉన్న ప్రశ్న" అని ఆమె తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)