మెస్సీ.. మెస్సీ.. మెస్సీ.. హైదరాబాద్ ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహం

ఫొటో సోర్స్, Getty Images
అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ శనివారం(డిసెంబరు 13) హైదరాబాద్ వస్తున్నారు.
గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం(గోట్) ఇండియా టూర్ - 2025 పేరుతో పర్యటన సాగబోతోందని నిర్వాహకులు ప్రకటించారు.
డిసెంబరు 13 నుంచి 15 వరకు ఇండియాలో తన టూర్ షెడ్యూల్ ను మెస్సీ ఇన్ స్టా అకౌంట్ ద్వారా వెల్లడించారు.
ఇందులో మొదట హైదరాబాద్ లేకపోయినప్పటికీ, తర్వాత తన పర్యటనలో హైదరాబాద్‌ను చేర్చినట్లుగా మెస్సీ ప్రకటించారు.
మెస్సీ పర్యటన ప్రైవేటు వాణిజ్య కార్యక్రమం అయినప్పటికీ, మెస్సీ టూర్ విషయంలో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
అతని రాకను స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మెస్సీ పర్యటించే కోల్‌కతా, హైదరాబాద్, ముంబయి, దిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
భారత్‌లో మెస్సీ టూర్‌ను శతద్రు దత్తా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో మెస్సీ ఆడే మ్యాచ్ కోసం విక్రయిస్తున్న టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.

హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే...
రెండేళ్ల పాలన సందర్భంగా తెలంగాణ రైజింగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
ఇప్పటికే డిసెంబరు 8, 9 తేదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో సదస్సు నిర్వహించింది.
తెలంగాణ బ్రాండ్‌ను గ్లోబల్ వేదికపై చాటి చెప్పే ఉద్దేశంతో హైదరాబాద్‌లో మెస్సీ టూర్ నిర్వహిస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
శనివారం( డిసెంబరు 13) సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా ఆడబోతున్నాడు మెస్సీ.
మొత్తం స్టేడియం సామర్థ్యం 39వేల మందికి సరిపడా ఉంది.
మెస్సీ ఆడే మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు.

ఫొటో సోర్స్, Rachakondapolice
సీఎం రేవంత్ రెడ్డి వర్సస్ మెస్సీ..
మెస్సీ హైదరాబాద్ టూర్ వివరాలను టూర్ చీఫ్ ప్యాట్రన్, సలహాదారు పార్వతీరెడ్డి మీడియాకు వెల్లడించారు.
మొదట సాయంత్రం 5 గంటల నుంచి రెండు గంటపాటు మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుంది.
తర్వాత ఏడు గంటల సమయంలో స్టేడియానికి మెస్సీ వస్తాడని పార్వతీరెడ్డి చెప్పారు.
సింగరేణి- ఆర్ఆర్9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ పేరుతో రెండు జట్ల మధ్య 20నిమిషాలపాటు ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది.
''మ్యాచ్ చివరి 5-10 నిమిషాలపాటు సింగరేణి తరఫున సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడతారు. మ్యాచ్‌లో విజేతలకు మెస్సీ చేతుల మీదుగా ట్రోఫి అందిస్తాం'' అని చెప్పారు పార్వతీ రెడ్డి.
అనంతరం ఉప్పల్ స్టేడియంలో తిరుగుతూ మెస్సీ ప్రేక్షకులకు అభివాదం చేస్తారు.
ఆ తర్వాత జరిగే 'ఫుట్ బాల్ క్లినిక్'లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో మెస్సీ మాట్లడతాడు. తన ప్రయాణం, ఫుట్ బాల్ విశేషాలను వివరిస్తాడని పార్వతీరెడ్డి తెలిపారు. .
అలాగే రాత్రికి ఫలక్‌నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
''కార్యక్రమంలో పాల్గొని మెస్సీతో ఫొటో దిగేందుకు 9లక్షల95వేలరూపాయలు చెల్లించాలి. దీనికి జీఎస్టీ అదనం. ఇందుకు వంద మందికి అవకాశం కల్పిస్తున్నాం'' అని చెప్పారామె.
మెస్సీతోపాటు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ ఆటగాళ్లు కూడా వస్తున్నట్లుగా పార్వతీ రెడ్డి వివరించారు.

ఫొటో సోర్స్, Telangana cmo
ఫుట్‌బాల్ ప్రాక్టీసు చేసిన రేవంత్ రెడ్డి
మెస్సీతో ఆడే మ్యాచ్ కోసం కొన్ని రోజుల నుంచి కొంత సమయంపాటు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీసు చేస్తున్నారు.
ఎంసీహెచ్ఆర్డీ ఫుట్ బాల్ గ్రౌండ్ తోపాటు సంగారెడ్డి జిల్లాలోని వోక్సన్ యూనివర్సటీలోని గ్రౌండులోనూ ప్రాక్టీసు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Rachakondapolice
జడ్ కేటగిరీ భద్రతలో మెస్సీ
హైదరాబాద్ లో మెస్సీ కోసం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లుగా చెప్పారు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు.
''ఉప్పల్ లో జరిగే మ్యాచ్ కోసం 3000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నాం.
450 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. స్టేడియం ప్రాంతాన్ని 4 జోన్లుగా విభజించి భద్రత కల్పిస్తున్నాం'' అని చెప్పారు.
మెస్సి వచ్చీ వెళ్లేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు సుధీర్ బాబు.
మరోవైపు టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు అభిమానులు.
''ఆన్ లైన్ లో టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ ఈవెంట్ టికెట్లు రూ.3,250 నుంచి రూ.30వేల వరకు ఉన్నాయి'' అని ఉప్పల్ కు చెందిన శ్రీహరి చెప్పారు.
మెస్సీని జీవితకాలంలో ఒకసారి చూసే అవకాశమని, స్టేడియంలో సౌకర్యాలు, సీటింగుకు తగ్గట్టుగా టికెట్ ధరలు ఉన్నాయని టూర్ సలహాదారు పార్వతీరెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
కోల్ కతా.. హైదరాబాద్.. ముంబయి.. దిల్లీ
డిసెంబరు 13 నుంచి 15 మధ్య మెస్సీ ఇండియా టూర్ జరగబోతోంది. ఈ మేరకు నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు.
ఈ పర్యటనలో ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ లు ఆడటం, మ్యుూజికల్ కన్సర్ట్ లు, మీట్ అండ్ గ్రీట్, డిన్నర్ పార్టీలు వంటి ఈవెంట్లు నిర్వహిస్తున్నట్టుగా ఈవెంట్ నిర్వహకుడు శతద్రు దత్తా చెప్పారు.
మొదట శనివారం (13వ తేదీ) తెల్లవారుజామున కోల్‌కతా వస్తాడు మెస్సీ. అక్కడ మీట్ అండ్ గ్రీట్, మెస్సీ విగ్రహం ఆవిష్కరణ, ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం వంటి కార్యక్రమాలు ఉంటాయి.
అదే రోజు మధ్యాహ్నం కోల్‌కతా నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ చేరుకుంటాడు.
సాయంత్రం ఐదు గంటల నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కార్యక్రమం మొదలవుతుందని హైదరాబాద్ టూర్ చీఫ్ ప్యాట్రన్, సలహాదారు పార్వతీరెడ్డి మీడియాకు చెప్పారు.
''సాయంత్రం ఏడు గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకున్నాక సుమారు గంటా నలభై నిమిషాలపాటు కార్యక్రమంలో పాల్గొంటారు'' అని చెప్పారామె.
మరుసటి రోజు అంటే డిసెంబరు 14న ఉదయం బయల్దేరి ముంబయి వెళతారు.
అక్కడ సెలబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడతాడు. ఛారిటీ ఫ్యాషన్ షో లో పాల్గొంటాడు.
చివరగా డిసెంబరు 15న దిల్లీకి చేరుకుని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు.
ప్రధాని నరేంద్ర మోదీని కూడా మెస్సీ కలుస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా, ఈ విషయంపై నిర్వాహకుల నుంచి అధికారిక సమాచారమేదీ రాలేదు.
మెస్సీ చివరిసారిగా 2011లో భారత్ లో పర్యటించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మెస్సీ ఇండియాకు వస్తుండటంతో ఫుట్ బాల్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎవరీ శతద్రుదత్తా..?
మెస్సీ టూర్ ను భారత్ లో నిర్వహిస్తున్న వ్యక్తి శతద్రుదత్తా. 'శతద్రుదత్తా ఇనిషియేటివ్' పేరుతో టూర్ షెడ్యూల్ విడుదలైంది.
ఈయన పశ్చిమ్ బెంగాల్‌లోని హుగ్లీకి చెందిన వ్యక్తి. శతద్రుదత్తా ఇనిషియేటివ్ పేరుతో ఈవెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. స్పోర్ట్ట్స్ సెలబ్రిటీలకు సంబంధించి ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఫుట్ బాల్ ఆటగాళ్లను భారత్ తీసుకువచ్చి ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.
గతంలోనూ పీలే, రోనాల్డినో, మారడోనా వంటి ప్రముఖ ఆటగాళ్లను భారత్ తీసుకువచ్చి ఈవెంట్లు నిర్వహించారు.
2022లో అర్జెంటీనా ఫుట్ బాల్ ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోఫించిన మెస్సీని గోట్ ఇండియా టూర్-2025 పేరుతో భారత్ తీసుకువస్తున్నారు
రాజకీయ వివాదం
మెస్సీ పర్యటన నేపథ్యంలో రాజకీయంగా వివాదం నెలకొంది.
పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులెంతో చెప్పాలని బీజేపీఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
''ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం రూ. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏయే శాఖల నుంచి ఖర్చు చేస్తోంది.. ఎందుకు ఖర్చు చేస్తోందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి'' అని చెప్పారు.
అయితే, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మెస్సీ పర్యటన సహకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
''మెస్సీ రావడంతో ప్రపంచవేదికపై తెలగాణ బ్రాండ్ పేరు వినిపిస్తుంది. తెలంగాణకు మరింత పేరు తెచ్చేందుకు మెస్సీ పర్యటన ఉపకరిస్తుంది'' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














