అస్సాం: ‘ర్యాట్ హోల్’ గనిలోకి భారీగా వరదనీరు, చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఆర్మీ, నేవీ డైవర్ల రాక

అస్సాం లో మైనింగ్ రెస్క్యూ

ఫొటో సోర్స్, Defence PRO, Guwahati

ఫొటో క్యాప్షన్, వరద నీరు ముంచెత్తడంతో గనిలో కార్మికులు చిక్కుకుపోయారు
    • రచయిత, నియాజ్ ఫరూఖీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అస్సాం రాష్ట్రంలో వరదనీరు ముంచెత్తిన ఓ బొగ్గుగనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కొందరు ర్యాట్ హోల్ పద్ధతిలో ఓ గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న సమయంలో వరదనీరు ముంచెత్తింది.

రక్షణ బృందాలకు గనిలో మృతదేహాలు కనిపించాయని, కానీ వాటివద్దకు చేరుకోలేపోయారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినట్టు రాయిటర్స్ తెలిపింది.

సోమవారం ఉదయం ర్యాట్ హోల్ పద్ధతిలో బొగ్గును తీస్తుండగా, వరదనీరు రావడంతో తొమ్మిది మంది కార్మికులు అందులో ఇరుక్కుపోయారు. ర్యాట్ హోల్ మైనింగ్‌పై ప్రభుత్వం 2014లో నిషేధం విధించినప్పటికీ ఈ పద్ధతిలో అక్రమ తవ్వకాలు అస్సాం తో సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి.

bbc telugu Whatsapp
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రంగంలోకి విశాఖ డైవర్లు

గనిలోకి వరదనీరు 100 అడుగులమేర చేరడంతో సహాయక చర్యలకు తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయని రక్షణ బృంద అధికారి ఒకరు చెప్పారు. 30గంటల నుంచి శ్రమిస్తున్నా 50 అడుగుల వరకే వెళ్లగలిగారని, ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం లేకపోయిందని చెప్పారు.

పూర్తిగా 100 అడుగుల వరకు వెళ్లేందుకు విశాఖపట్నం నుంచి ప్రత్యేక నేవీ డైవర్లు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు అస్సాం గనుల శాఖా మంత్రి కౌశిక్ రాయ్ తెలిపారు.

ఇక గనిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఘటనా స్థలానికి ఉదయం తమ సిబ్బంది చేరుకుందని. స్థానిక బృందాలతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తోందని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. సీనియర్ ఆర్మీ అధికారులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని రక్షణ చర్యలు వేగవంతం చేయడానికి స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటారని ఆ ప్రకటన పేర్కొంది.

ఆర్మీ రక్షణ బృందంలో 'డైవర్లు, కందకాలను తవ్వేవారు, భూగర్భ వైద్య బృందంతోపాటు అవసరమైన సాధనా సామాగ్రి ఉన్నాయని భారత సైన్యం వెల్లడించింది.

గనిలో కచ్చితంగా ఎంతమంది చిక్కుకున్నారనే విషయాన్ని అధికారులు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అస్సాం డీజీపీ జీపీ సింగ్ సోమవారం సాయంత్రం తెలిపారు.

గనిలోకి వరద ముంచెత్తినప్పుడు పదిమందికి పైగా కార్మికులు తప్పించుకోగలిగారని, ఇప్పుడు పది కంటే తక్కువ మందే గనిలో చిక్కుకుపోయి ఉంటారని స్థానిక కథనాలు చెబుతున్నాయి.

డీమా హసావో జిల్లాలోని ఒక పర్వత ప్రాంతంలో ఈ గని ఉంది.

ఈ గని ఉన్న ప్రాంతాన్ని చేరుకోవడం చాలా కష్టమని సీనియర్ పోలీస్ అధికారి మయంక్ కుమార్ ఝా రాయిటర్స్ మీడియా సంస్థ తో అన్నారు.

అస్సాం లో మైనింగ్ రెస్క్యూ

ఫొటో సోర్స్, Defence PRO, Guwahati

ఫొటో క్యాప్షన్, ప్రమాదం జరిగిన చోటు ఒక సుదూర పర్వత ప్రాంతం

గతంలోనూ ప్రమాదాలు

ఈశాన్య రాష్ట్రాలలో బొగ్గు గనులు అక్రమంగా తవ్వే ఘటనలలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

మేఘాలయలో అక్రమంగా తవ్విన బొగ్గు గనిలో సమీప నది నుంచి నీటి ప్రవాహం ముంచెత్తడంతో అందులో 15 మంది కార్మికులు చిక్కుకుపోయారు . 2018లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రమాదాన్ని తప్పించుకున్నారు, మిగిలినవారిని రక్షించడానికి సహాయక చర్యలు తరువాత ఏడాది 2019 మార్చి వరకు కొనసాగాయి. చివరికి రెండు మృతదేహాలనే కనుగొనగలిగారు.

నాగాలాండ్ రాష్ట్రంలో 2024 జనవరిలో 'ర్యాట్ హోల్' గనిలో మంటలు చెలరేగడంతో ఆరుగురు కార్మికులు మరణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)