‘సత్లెజ్ నదిలో ఇసుక మైనింగ్ వల్ల పంటలకు నీళ్లు లేకుండాపోయాయి...’ :బీబీసీ రివర్ స్టోరీస్

పంజాబ్‌లో పరవళ్లు తొక్కుతున్న సత్లెజ్ నది ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఇసుక మైనింగ్ వల్ల ఈ నది పరీవాహక ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక రైతులపై కూడా ఇసుక మైనింగ్ ప్రభావం ఉంది. ఈ విషయాలను లోతుగా పరిశీలించడానికి బీబీసీ ప్రయత్నించింది.
పంజాబ్ రాష్ట్రంలో.. కొన్ని చట్టపరమైన చర్యల కారణంగా ఇప్పటికైతే సత్లెజ్ నదీ తీరంలో ఇసుక మైనింగ్ ఆగిపోయింది. కానీ ఇక్కడి సహజ వనరులు ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రోపడ్ ప్రాంతంలో మైనింగ్ జరిపినపుడు, సత్లెజ్ నది స్థిరత్వం కోసం, పరీవాహక ప్రాంత సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ కూడా 2019 జనవరి 31 నాటి ఆదేశంలో పేర్కొంది.
రైతులపై కూడా ఇసుక మైనింగ్ ప్రభావం ఉందని, బిలాస్‌పూర్ గ్రామానికి చెందిన టేక్ సింగ్ అనే రైతు చెబుతున్నారు. ఈ నదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆయన వ్యవసాయం చేస్తారు.

''మొదట్లో ఈ నది నుంచి తేమ వచ్చేది. కానీ ఇప్పుడు తేమను పీల్చేసుకుంటోంది. గతంలో భూగర్భజలాల స్థాయి బాగుండేది. కానీ ప్రస్తుతం భూగర్భజలాలు వంద అడుగుల లోతుకు పడిపోయాయి. దాంతో మా గ్రామంలో బోర్లు ఇతర గ్రామాలకన్నా చాలా లోతుగా వేశారు. మొదట్లో పరిస్థితి ఇలా లేకుండేది'' అని టేక్ సింగ్ అన్నారు.

నూర్పూర్ బేడీ బ్లాక్‌కు చెందిన రైతులు.. భూగర్భజలాలు అడుగంటడంతో ఆందోళన పడుతున్నారు. ట్యూబ్ వెల్స్ అన్నీ ఉపయోగం లేకుండా పోతున్నాయి.
సౌపూర్ బరీవాల్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల దుర్గా దాస్ అనే రైతు తన ఒకటిన్నర ఎకరాల పొలానికి మెషీన్ల సాయంతో నీరు అందించాలని ఆలోచిస్తున్నారు. 70 అడుగుల లోతు వరకూ తవ్వారు. కానీ నీటి జాడ ఎక్కడా కనిపించలేదంటున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ..

''క్రషర్లు పనిచేయడం మొదలైనప్పటినుంచి భూగర్భజలాల స్థాయి బాగా పడిపోయింది. పంటలకు నీరు అందడం లేదు. మళ్లీ మళ్లీ బోర్లు వేస్తున్నాం. ఇంకా ఎంత లోతు బోర్లు వేయాలో పాలుపోవడం లేదు'' అన్నారు.
''పంజాబ్‌లో భూగర్భజల మట్టం తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇందుకు మైనింగ్ కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మైనింగ్ వల్ల ఆ సమీప ప్రాంతాల్లో భూగర్భజలాల స్థాయి వేగంగా తగ్గిపోతున్నాయి. ఇది పర్యావరణానికి పెను ప్రమాదంగా మారింది'' అని బీబీసీ ప్రతినిధి సర్బ్‌జిత్ సింగ్ ధాలీవాల్ అన్నారు.

మైనింగ్ వల్ల భూగర్భజలాలు ఎందుకు తగ్గిపోతాయో, కేంద్ర భూగర్భజల బోర్డు రీజనల్ డైరెక్టర్ అనూప్ కూమార్ ఇలా చెబుతున్నారు.
''పర్వతాలపై నుంచి నదీ జలాలు నీటితో పాటుగా ఇసుకను కూడా తీసుకొస్తాయి. అది భూగర్భ జలాలకు చాలా అవసరం. ఆ ఇసుకనంతా తవ్వేస్తే, మట్టి పొరలు మాత్రమే మిగిలిపోతాయి. దాంతో నేల లోపల నీరు ప్రవహించడానికి ఆటంకం కలుగుతుంది. అందుకే భూగర్భ జలాల స్థాయి తగ్గిపోతుంది'' అని అన్నారు.
ఇసుక మైనింగ్ ద్వారా కొంతమంది ఆర్థికంగా చాలా బలపడొచ్చు. కానీ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని పూరించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు.
ఇవి కూడా చదవండి
- ఎవరిని చూసి జనం ఓటు వేస్తారు..? పార్టీయా, ముఖ్యమంత్రి అభ్యర్థా, స్థానిక అభ్యర్థా - ఏడీఆర్ సర్వేలో ఏం తెలిసింది?
- ఏపీ ఎన్నికల బరిలో ఇద్దరు హీరోయిన్లు
- నెలలు నిండకుండానే పిల్లలు ఎందుకు పుడతారు?
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- గూగుల్ ప్లస్ ఎందుకు మూతపడింది
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- అబార్షన్ పిల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









