ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: ఏపీ ఎన్నికల బరిలో ఇద్దరు హీరోయిన్లు

రోజా, మాధవీలత

ఫొటో సోర్స్, facebook/RojaSelvamani/ActorMadhaviLatha

ఆంధ్రప్రదేశ్‌లో పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ. రాష్ట్రంలో మొత్తం 3,69,33,091 ఓటర్లు ఉంటే ఇందులో పురుషులు 1,83,24,588 కాగా, స్త్రీ ఓటర్లు 1,86,04,742.

కానీ, చట్ట సభల్లో ప్రాతినిధ్యం, ఎన్నికల్లో పోటీ విషయంలో మాత్రం పురుషులకు ఆమడదూరంలో మహిళలు ఉన్నారు.

2014 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి మొత్తంగా 2,153 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో 1,974 మంది పురుషులు. మహిళల అభ్యర్థుల కేవలం 179. ఇక రాష్ట్రంలో మొత్తం 175 శాసన సభ స్థానాలకుగాను గత ఎన్నికల్లో 20 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఏపీ చట్టసభల్లో గత ఎన్నికల సమయంలో వారి ప్రాతినిధ్యం 11 శాతానికే పరిమితమైంది.

ఈసారి మాటేమిటి..

ఈసారి ప్రధాన పార్టీలు మహిళా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు పెద్దపీట వేస్తూ హామీలిచ్చినా టికెట్ల కేటాయింపులో మాత్రం పాత ధోరణినే అవలంభించాయి.

ఎక్కువగా రిజర్వుడు స్థానాల్లోనే మహిళా అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు కొవ్వూరు, సింగనమల.. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు పాడేరు, రంపచోడవరంలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు మహిళలే కావడం దీనికి ఉదాహరణ.

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను అధికార టీడీపీ 20 మంది మహిళలకు టికెట్లు కేటాయించగా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ 11 మంది మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించింది.

శ్రీకాళహస్తి జనసేన అభ్యర్థి నగరం వినూత

ఫొటో సోర్స్, NAgaram vinutha/fb

ఫొటో క్యాప్షన్, శ్రీకాళహస్తి జనసేన అభ్యర్థి నగరం వినూత

వీళ్లు ఎక్కడి నుంచి అంటే..

సినీనటి మాధవి లత ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఆ పార్టీ తరఫున గుంటూరు వెస్ట్ నుంచి బరిలోకి దిగారు. దేశాభివృద్ధికి, సుస్థిర పాలనకు మోదీని మరోసారి ఎన్నుకోవాలని ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఒకప్పటి సినీ హీరోయిన్ ఆర్కే రోజా తన సిటింగ్ స్థానం చిత్తూరు జిల్లా నగరి నుంచి మరోసారి బరిలో దిగారు. అక్కడ టీడీపీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు భానుప్రకాశ్‌ను పోటీకి నిలిపింది. గత ఎన్నికల్లో ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేశారు. ఆయన మరణంతో ఈసారి టీడీపీ టికెట్ కుమారుడికి దక్కింది.

టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఈసారి తన కుమార్తెను బరిలోకి దించారు. జలీల్ సిట్టింగ్ స్థానం విజయవాడ వెస్ట్‌ నుంచి ఆయన కుమార్తె షబానా ఖాతూన్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి టీడీపీలోని ముస్లిం మైనారిటీల నుంచి పోటీ ఏర్పడినా టికెట్ షబానాకే దక్కింది. మరోవైపు ఆమె ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ఫత్వా జారీ అయింది.

విజయనగరం నుంచి ఆశోక్ గజపతి రాజు వారసురాలు అదితి గజపతి రాజు బరిలోకి దిగుతున్నారు. ఎంఏ సైకాలజీ చదువుకున్నారు. 1955లో అదితిగజపతిరాజు నాన్నమ్మ కుసుమగజపతిరాజు గజపతినగరం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు అదితి అదే బాటలో నడవాలనుకుంటున్నారు. అశోక్‌ గజపతి రాజు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన స్థానం నుంచే ఆమె బరిలోకి దిగుతున్నారు.

ఆదిరెడ్డి భవానీ

ఫొటో సోర్స్, AdireddySrinivas

ఫొటో క్యాప్షన్, ఆదిరెడ్డి భవానీ

రాజమండ్రి సిటీ నుంచి ఎర్రన్నాయుడి కుమార్తె

రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ తరఫున ఆదిరెడ్డి భవాని బరిలోకి దిగుతున్నారు. ఈమె శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు సోదరి. అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు. ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో ఆమెను పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు.

పెద్దాపురం నుంచి టీడీపీ తరఫున ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తుండగా ఆయనపై పోటీకి ఒక మహిళలను వైసీపీ బరిలో దింపింది. ఇక్కడ ఆ పార్టీ నుంచి తోట నరసింహం సతీమణి తోట వాణి పోటీ చేస్తున్నారు. ఇటీవలే తోట నరసింహం కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. గత లోక్‌సభలో నరసింహం టీడీపీ పక్ష నేతగా వ్యవహరించారు.

విశాఖ జిల్లాల పాయకరావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత ఈసారి నియోజకవర్గం మారారు. అధినేత చంద్రబాబు సూచన మేరకు ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జవహర్‌ కృష్ణా జిల్లా తిరువూరు నుంచి పోటీ చేస్తున్నారు. శాసన సభ సమావేశాల సమయంలో నగరి ఎమ్మెల్యే రోజాతో అనిత గొడవపడిన సంఘటన వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. పాయకరావుపేటలోని తెలుగు దేశం కార్యకర్తలు అనితకు టికెట్ కేటాయించవద్దని చంద్రబాబుకు లేఖ కూడా రాశారు.

పత్తికొండ నుంచి వైసీపీ తరఫున శ్రీదేవి బరిలో ఉన్నారు

ఫొటో సోర్స్, SRIDEVI/FB

ఫొటో క్యాప్షన్, వైసీపీ పత్తికొండ అభ్యర్థి శ్రీదేవి

వైసీపీ తొలి అభ్యర్థి శ్రీదేవి

కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి వైసీపీ తరఫున శ్రీదేవి బరిలోకి దిగారు. 2019 ఎన్నికలకు సంబంధించి వైసీపీ ప్రకటించిన తొలి అభ్యర్థి శ్రీదేవినే. పార్టీ అధినేత జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా 2017 నవంబర్‌లోనే ఆమె పేరును ఖరారు చేశారు.

గత ఎన్నికల్లో పాణ్యం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన గౌరు చరితారెడ్డి ఈ ఎన్నికల్లో పార్టీ మారారు. సిట్టింగ్ స్థానం నుంచే టీడీపీ తరఫున ఆమె పోటీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో కాంగ్రెస్‌లో ఉన్న గౌరు కుటుంబం ఆ తర్వాత వైసీపీలో చేరింది. ఇటీవలే చరితారెడ్డి కుటుంబం టీడీపీలో చేరింది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి భూమా దంపతుల కుమార్తె అఖిల ప్రియ మరోసారి పోటీ చేస్తున్నారు. 2014లో శోభా నాగిరెడ్డి మృతి అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే తండ్రి నాగిరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

కోట్ల కుటుంబానికి చెందిన సుజాతమ్మ కర్నూలు జిల్లా ఆలూరు నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఆమె ఇటీవల భర్త కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సుజాతమ్మ 2004లో తొలిసారిగా డోన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు.

శ్రుతి దేవి

ఫొటో సోర్స్, SRUTHI DEVI/FB

ఫొటో క్యాప్షన్, అరకు లోక్‌సభ స్థానం నుంచి తండ్రి కిషోర్ చంద్ర దేవ్ పై పోటీ చేస్తున్న శ్రుతి దేవి (కాంగ్రెస్)

తండ్రిపై కుమార్తె పోటీ

పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే అరకు లోక్ సభ స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి తండ్రీకూతరు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున శ్రుతి దేవి పోటీ చేస్తుండగా,

టీడీపీ నుంచి కిశోర్ చంద్రదేవ్ బరిలోకి దిగారు. శ్రుతి దేవి కిశోర్ చంద్రదేవ్ కుమార్తె. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌లో ఉన్న కిశోర్ చంద్రదేవ్ యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇటీవల ఆయన టీడీపీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనకు అరకు టికెట్ కేటాయించింది.

కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీ బీజేపీ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తనయుడు హితేశ్ ఇటీవల వైసీపీలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ టికెట్‌పై పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

సినీ నటుడు, రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ స్థానం నుంచి మురళీమోహన్ కోడలు మాగంటి రూపను టీడీపీ బరిలోకి దింపింది.

వివిధ పార్టీలు మహిళలకు కేటాయించిన స్థానాలను కింది పట్టికలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)