సునీల్ సాంగ్వాన్: ఈ బీజేపీ నాయకుడు జైలు అధికారిగా ఉన్నప్పుడు వివాదాస్పద గురు గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఆరు సార్లు పెరోల్ ఇచ్చారా?

సునీల్ సాంగ్వాన్‌, గుర్మీత్ రామ్ రహీమ్

ఫొటో సోర్స్, FB/SUNEENSANGWAN/GURMEET

ఫొటో క్యాప్షన్, సునీల్ సాంగ్వాన్‌, గుర్మీత్ రామ్ రహీమ్
    • రచయిత, సత్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో చర్ఖీ దాద్రీ స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా మాజీ జైలు అధికారి సునీల్ సాంగ్వాన్‌ను నిలబెట్టింది. సునీల్ సాంగ్వాన్‌ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో వివాదాస్పద గురు గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఆరు సార్లు పెరోల్ లేదా ఫర్లో ఇచ్చిన అధికారిగా వార్తల్లో నిలిచారు.

అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్, రోహ్‌తక్‌లోని సునారియా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.

గుర్మీత్‌కు మంజూరైన పెరోల్ లేదా ఫర్లో విషయంలో లేవనెత్తిన ప్రశ్నలకు సునీల్ సాంగ్వాన్‌ బీబీసీకి సమాధానమిచ్చారు.

స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకున్న ఆయన ఇటీవల బీజేపీలో చేరగా, పార్టీ ఆయనను చర్ఖీ దాద్రీ శాసనసభ స్థానం నుంచి పోటీలోకి దింపింది.

వీఆర్‌ఎస్‌కు ముందు సునీల్ గురుగ్రామ్‌లోని జైలులో జైలర్‌గా పని చేసేవారు. దానికి ముందు ఐదేళ్లపాటు ఆయన రోహ్‌తక్ జైలు సూపరింటెండెంట్‌గా పని చేశారు.

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ 2017లో అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలడంతో ఆయనను రోహ్‌తక్‌లోని జైలుకు పంపారు.

ఆ సమయంలో సునీల్ సాంగ్వాన్‌, రోహ్‌తక్ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు.

సునీల్ సాంగ్వాన్‌ను పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ చాలా వేగంగా వ్యవహరించింది. హరియాణా ప్రభుత్వం ఆయన వీఆర్‌ఎస్ దరఖాస్తును 2024 సెప్టెంబర్ 1న ఆమోదించింది.

సునీల్ సాంగ్వాన్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఆయనకు సాయంత్రం 4లోగా 'నో డ్యూస్' సర్టిఫికెట్ జారీ చేయాలని హరియాణా జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) సెప్టెంబర్ 1న రాష్ట్రంలోని అన్ని జైలు సూపరింటెండెంట్‌ల కార్యాలయాలకు ఈ-మెయిల్ పంపారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సాంగ్వాన్‌

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సాంగ్వాన్‌ ( మధ్యలో )

ఆరు సార్లు పెరోల్

రామ్ రహీమ్ 10 సార్లు పెరోల్‌ లేదా ఫర్లో మీద జైలు నుంచి బయటకు వచ్చారు. అందులో ఆరు సార్లు సాంగ్వాన్‌ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో ఆయన బయటకు వచ్చారు.

సునీల్ సాంగ్వాన్‌ జైళ్ల శాఖలో 22 ఏళ్లకు పైగా పనిచేశారు. 2002లో హరియాణా జైళ్ల శాఖలో చేరిన ఆయన, రోహ్‌తక్‌లోని సునారియా జైలుతో సహా రాష్ట్రంలోని అనేక కారాగారాల్లో సూపరింటెండెంట్‌గా పని చేశారు.

ఆయన హయాంలో రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భాలు ఇవి:

  • 2020 అక్టోబర్ 24న అత్యవసర పెరోల్ - ఒకరోజు
  • 2021 మే 21న అత్యవసర పెరోల్ - ఒక రోజు
  • 2022 ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు (పంజాబ్ ఎన్నికల సమయంలో)
  • 2022 జూన్ 17 నుంచి జులై 16 వరకు (హరియాణాలో మున్సిపల్ ఎన్నికలకు ముందు)
  • 2022 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 25 వరకు (ఆదంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు)
  • 2023 జనవరి 21 నుంచి మార్చి 3 వరకు
గుర్మీత్ రామ్ రహీమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుర్మీత్ రామ్ రహీమ్

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

హరియాణా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ (టెంపరరీ రిలీజ్) యాక్ట్, 2022 ప్రకారం ఖైదీల పెరోల్‌కు లేదా ఫర్లోకు సిఫారసు చేసే అధికారం జైలు సూపరింటెండెంట్‌‌కు ఉంది.

ఈ సిఫార్సును జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపుతారు. నేరారోపణల తీవ్రత ఆధారంగా విడుదల చేసే అధికారాలున్న డిప్యూటీ కమిషనర్ లేదా డివిజనల్ కమిషనర్ లాంటి అధికారులు మాత్రమే విడుదల ఆర్డర్ జారీ చేయగలరు.

బీజేపీ నుంచి టికెట్‌ పొందిన తర్వాత సునీల్‌ సాంగ్వాన్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘‘ఇలాంటి వార్తను చూసి ఆశ్చర్యపోయే అమాయకులు ఎవరు ఉంటారు?’’ అని కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు.

గుర్మీత్ రామ్ రహీమ్‌కు అనేకసార్లు పెరోల్ రావడం, సాంగ్వాన్‌ అభ్యర్థిత్వం, బీజేపీతో ఆయన సంబంధంపై సోషల్ మీడియా యూజర్లు కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అయితే, తన హయాంలో ఆరు సార్లు గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్ లేదా ఫర్లో లభించిందన్న మాటను సునీల్ సాంగ్వాన్‌ తోసిపుచ్చారు.

“నా పదవీ కాలంలో రామ్ రహీమ్‌కు ఆరుసార్లు పెరోల్ లేదా ఫర్లో ఇచ్చినట్లు నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెరోల్ రావాలంటే జైల్ సూపరింటెండెంట్ సంతకం ఒక్కటే సరిపోదు. దాని అనుమతికి డివిజనల్ కమిషనర్ సంతకం కూడా కావాలి’’ అని ఆయన అన్నారు.

“నేను బాబా గుర్మీత్ రామ్ రహీమ్ పెరోల్‌ను మూడుసార్లు తిరస్కరించినందుకు నన్ను అభినందించాలి. మొదటిసారి 2019 జూలై 29న, రెండోసారి 2019 అక్టోబర్ 30న, మూడోసారి 2020 ఏప్రిల్ 20న, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవాలంటూ ఆయన పెరోల్ కోరారు. దానిని నేను తిరస్కరించాను. సాధారణ ఖైదీలు ఎవరైనా శిక్షాకాలంలో ఒక సంవత్సరం పూర్తి చేశాక పెరోల్‌కు అర్హులు అవుతారు. కానీ బాబాకు మూడేళ్ల పాటు పెరోల్ రాలేదు’’ అన్నారు.

“రొటీన్ పెరోల్‌ను డివిజనల్ కమిషనర్ ఆమోదించారు. బాబా దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా లీగల్ ప్రాసెస్‌ ద్వారానే పెరోల్ పొందారు’’ అని ఆయన తెలిపారు.

సునీల్ సాంగ్వాన్‌

ఫొటో సోర్స్, SAT SINGH/BBC

తండ్రి వారసుడిగా సునీల్ సాంగ్వాన్‌

సునీల్ సాంగ్వాన్‌ తండ్రి సత్పాల్ సాంగ్వాన్‌ గతంలో హరియాణా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రెండు నెలల కిందటే ఆయన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ని వీడి బీజేపీలో చేరారు.

సత్పాల్ సాంగ్వాన్‌ 1996లో రాజకీయాల్లోకి రాకముందు బీఎస్‌ఎన్ఎల్‌లో సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేసి, ఆ తర్వాత రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్‌కు చెందిన హరియాణా వికాస్ పార్టీ అభ్యర్థిగా చర్ఖీ దాద్రీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు సత్పాల్ సాంగ్వాన్‌. 2009లో హరియాణా జనహిత్ కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి భూపేంద్ర హుడా ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2014లో కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

2019లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో జేజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు.

బీబీసీకి అందిన సమాచారం ప్రకారం, సునీల్ సాంగ్వాన్‌ జైలు సూపరింటెండెంట్ పదవి నుంచి స్వచ్ఛంద పదవీ విరమణకు మొదట ఇష్టపడలేదు. అయితే, ఆయన తండ్రి సత్పాల్ సాంగ్వాన్‌కు వయసు మీదపడటంతో చర్ఖీ దాద్రీలో జాట్ వర్గం ఓట్లను సంపాదించే, సొంత గుర్తింపు ఉన్న యువనేత కోసం బీజేపీ వెతుకుతుండగా సునీల్ సాంగ్వాన్‌ బీజేపీ దృష్టిలో పడ్డారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో బబితా ఫొగాట్ బీజేపీ అభ్యర్ధిగా చర్ఖీ దాద్రి నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. జేజేపీ అభ్యర్థిగా సత్పాల్ సాంగ్వాన్‌ రెండో స్థానంలో నిలవగా, స్వతంత్ర అభ్యర్థి సోంబీర్ సాంగ్వాన్‌ ఇక్కడ విజయం సాధించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)