ఇండియా-ఈయూ: ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’తో యూరోపియన్ వైన్లు, కార్ల ధరలు తగ్గుతాయా?

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
‘‘భారతదేశం తన చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. ఈ రోజు తేదీ 27 కావటం ఒక శుభ పరిణామం. ఎందుకంటే సరిగ్గా ఇదే రోజున, యూరోపియన్ యూనియన్‌లోని 27 దేశాలతో ఈ ఎఫ్‌టీఏపై భారత్ సంతకం చేసింది’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు అన్నారు.
ఈ కార్యక్రమంలో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంటోనియో కోస్టాను 'లిస్బన్ గాంధీ'గా అభివర్ణించారు ప్రధాని మోదీ.
"ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. దీని విలువ గ్లోబల్ జీడీపీలో సుమారు 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు మూడోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తుంది'' అని మోదీ చెప్పారు.
కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల మనకున్న ఉమ్మడి నిబద్ధతను ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. అలాగే, ఈ ఒప్పందం ద్వారా అటు వాణిజ్యానికి, ఇటు గ్లోబల్ సప్లై చైన్‌కు ఇరువైపులా 'మరింత బలం' చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు.
మరి భారత్, ఈయూల మధ్య జరిగిన ఒప్పందం వల్ల వచ్చే మార్పులేంటి?


ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images
ఈ ఒప్పందంతో ఆశిస్తున్న ప్రధాన మార్పులు...
ఈ ఒప్పందం వల్ల భారతదేశంలో తయారీ రంగానికి కొత్త బలం చేకూరుతుందని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేశారు.
''సేవారంగం మరింత విస్తరించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యాపారవేత్తకు, పెట్టుబడిదారుడికి భారతదేశంపై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తుంది'' అని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా మాట్లాడుతూ, ‘‘గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ మారుతోంది. ఇటువంటి తరుణంలో భారతదేశం, యూరప్ మధ్య ఈ భాగస్వామ్యం చరిత్రాత్మకమైంది. భారత్ మాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఆవిర్భవించింది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ ఒప్పందం వల్ల రెండు బిలియన్ల (200 కోట్ల) మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రపంచ శాంతి కోసం మేము మీపై నమ్మకం ఉంచగలం'' అని అన్నారు.
అలాగే, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ, ''భారతదేశం, యూరప్ కలిసి చరిత్రను సృష్టిస్తున్నాయి. మేము 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'ను కుదుర్చుకున్నాం. 200 కోట్ల మంది ప్రజల కోసం స్వేచ్ఛా వాణిజ్య మండలి (ఫ్రీ ట్రేడ్ జోన్) ఏర్పాటు చేశాం. దీనివల్ల భారత్, యూరప్ రెండూ ప్రయోజనం పొందుతాయి'' అని చెప్పారు.
ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో తమ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
భారత్ వ్యూహం వెనుక...
యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ సోమవారం జరిగిన భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ముఖ్య అతిథుల ఎంపిక, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో తన వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను వేగవంతం చేయాలనే భారతదేశ దౌత్యపరమైన వ్యూహాన్ని సూచిస్తుంది.
ప్రస్తుతం భారతదేశం, యూరప్ రెండూ అమెరికాతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలను ఎదుర్కొంటున్నాయి. భారత్-ఈయూ మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఒప్పందం ద్వారా ఇరుపక్షాలు పరస్పరం తమ మార్కెట్లలోకి ప్రవేశాన్ని సులభతరం చేస్తున్నాయి.
గతంలో గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా నియంత్రణను వ్యతిరేకించినందుకు యూరోపియన్ మిత్రదేశాలపై 'ట్రేడ్ వార్' తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన డోనల్డ్ ట్రంప్, ఆ తర్వాత వెనక్కి తగ్గారు.
అదే సమయంలో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకుతో భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలను అమెరికా విధించింది. మొత్తంగా ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను అమలుచేస్తోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఒప్పందంలోని ముఖ్యాంశాలు...
భారత్, ఈయూ మధ్య 2024-25 సంవత్సరంలో వస్తువుల వాణిజ్యం సుమారు రూ.11.5 లక్షల కోట్లు కాగా, సేవల వాణిజ్యం రూ.7.2 లక్షల కోట్లకు చేరుకుంది.
ఈయూకు లాభమేమిటంటే: భారతదేశం తన ఇతర వ్యాపార భాగస్వాములెవరికీ ఇవ్వని విధంగా యూరోపియన్ యూనియన్‌కు సుంకాలలో భారీ రాయితీలను ఇవ్వనుందని యూరోపియన్ కమిషన్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
- కార్లపై ఉన్న టారిఫ్‌లను క్రమంగా 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నారు. అలాగే కార్ల విడిభాగాలపై విధిస్తున్న సుంకాలను రానున్న ఐదు నుంచి పదేళ్ల కాలంలో పూర్తిగా తొలగిస్తారు.
- యంత్రాలు (మెషినరీ)పై 44 శాతం వరకు, రసాయనాలపై 22 శాతం వరకు, మందుల (ఫార్మాస్యూటికల్స్)పై 11 శాతం వరకు ఉన్న సుంకాలను దాదాపు పూర్తిగా రద్దు చేస్తారు.
- యూరప్‌లోని చిన్న తరహా పరిశ్రమలకు కొత్త ఎగుమతి అవకాశాలు లభిస్తాయి.
టారిఫ్‌లు తగ్గించడం వల్ల భారత్‌కు వచ్చే యూరోపియన్ వస్తువులు ముఖ్యంగా లగ్జరీ కార్లు, వైన్స్, మెడిసిన్స్ వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని ది హిందూ, హిందూస్థాన్ టైమ్స్, మింట్ సహా పలు మీడియా సంస్థలు కథనాలు రాశాయి.
భారతీయ రంగాలకు ప్రయోజనం: ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (యూరప్), నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (భారతదేశం) మధ్య జరిగిన ఈ ఒప్పందం చరిత్రాత్మకమైందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందానికి సంబంధించి కొన్ని వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటితో పాటు పీఐబీ సమాచారం ప్రకారం...
- దుస్తులు, వస్త్రాలపై మొదటి రోజు నుంచే 'జీరో డ్యూటీ' (సున్నా సుంకం) వర్తిస్తుంది. ఎఫ్‌టీఏ ద్వారా 263.5 బిలియన్ డాలర్ల విలువైన యూరోపియన్ టెక్స్‌టైల్ మార్కెట్ భారత్‌కు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల చేనేత వృత్తులవారు, కళాకారులు, మహిళలు, ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
- భారత్ నుంచి ఎగుమతి అయ్యే 9,425 టారిఫ్ లైన్ల (వస్తువుల రకాలు)పై సుంకాలను పూర్తిగా రద్దు చేశారు. అంటే ఈ 9,425 రకాల వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. సుమారు రూ.6.41 లక్షల కోట్ల విలువైన వస్తువులను యూరప్‌కు ఎగుమతి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
- ఈయూకు భారత్ చేసే ఎగుమతుల్లో దాదాపు 99 శాతం ఉత్పత్తులు 'జీరో డ్యూటీ' పరిధిలోకి వస్తాయి.
- ఐటీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ వంటి 144 ఉప రంగాల్లో భారతీయ నిపుణులకు యూరప్ మార్కెట్లలో అవకాశం లభిస్తుంది.
- యూరప్‌లో చదువుకునే భారతీయ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత 9 నెలల పాటు 'పోస్ట్-స్టడీ వీసా' పొందేందుకు ఒప్పందం కుదిరింది.
- భారతీయ సంప్రదాయ వైద్య నిపుణులకు కూడా యూరప్‌లో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
ఉభయులకు కలిగే కీలక ప్రయోజనాలు...
ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి. ఈ ఏడాది భారత జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లను దాటే దిశగా సాగుతోంది. ఆర్థిక వ్యవస్థలో జపాన్‌ను వెనక్కి నెట్టే అవకాశం ఉంది.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్, భారతదేశం కలిస్తే రెండు బిలియన్ల (200 కోట్ల) మంది ప్రజలతో కూడిన ఒక భారీ స్వేచ్ఛా మార్కెట్ ఏర్పడుతుందని, ఇది ప్రపంచ జీడీపీలో నాలుగో వంతుకు సమానంగా ఉంటుందని అన్నారు.
భారతదేశానికి ఐరోపా సమాఖ్య ఇప్పటికే అతిపెద్ద వాణిజ్య సమూహంగా ఉంది.
ఈ ఒప్పందం 'జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్' (జీఎస్‌పీ) పునరుద్ధరణకు కూడా దోహదపడుతుంది. దీని ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి యూరోపియన్ మార్కెట్లోకి వచ్చే అనేక ఉత్పత్తులకు దిగుమతి సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఈ ఒప్పందంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) భారతదేశానికి 22వ ఎఫ్‌టీఏ భాగస్వామిగా మారింది.
భారతదేశం ఇప్పటికే బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ చేసుకుంది. ఇప్పుడు ఈయూతో జరిగిన ఒప్పందంతో భారతీయ వ్యాపారవేత్తలకు దాదాపు మొత్తం యూరప్ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














