"పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ టెండర్లు పిలవాలని కమిటీ సూచన"- ప్రెస్ రివ్యూ

పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసిందని, ప్రధాన గుత్తేదారుతో ఒప్పందం రద్దయితే ఇక ఉప గుత్తేదారులకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని కమిటీ సూచించినట్లు సమాచారం ఉందని ఈనాడు చెప్పింది.
రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో అవకతవకలు, అంచనాల పెంపు, నిబంధనల ఉల్లంఘనల వంటి అంశాలపై పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఇంజినీర్లతో ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తొలుత వీరిని పోలవరం ప్రాజెక్టుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది.
పోలవరం ప్రాజెక్టుకు 2005లో టెండర్లు పిలిచిన నాటి నుంచి చోటుచేసుకున్న అన్ని పరిణామాలపై కమిటీ దృష్టి సారించింది. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలను, ఉత్తర్వులను సమీక్షించింది.
పోలవరం ఇంజినీరు ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు శ్రీధర్‌లను కమిటీ ప్రశ్నించింది. మొత్తం అన్ని రికార్డులను పరిశీలించిన మీదట ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేస్తూ నివేదికను సిద్ధం చేసిందని ఈనాడు తన కథనంలో రాసింది.
పోలవరం హెడ్‌వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిపార్సు చేసిందని సాక్షి తెలిపింది. దీనికి రీటెండరింగ్ నిర్వహించాలని సూచించిందని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి బీజేపీ ఎంపీ 150 కి.మీ. పాదయాత్ర చేయాలి: ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని సాక్షి తెలిపింది.
బీజేపీ ఎంపీలందరూ అక్టోబర్ 2 నుంచి 31 వరకు వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని మోదీ చెప్పారు.
ఈ మేరకు మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ప్రధాని కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు.
బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోదీ సూచించారు.
మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2, వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31లను పురస్కరించుకుని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోదీ సూచించారు. పాదయాత్రలో ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ఎంపీలు తెలుసుకోవాలని, అలాగే ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అడగాలని చెప్పారు.
యాత్రలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.
ఈడీ మాజీ ఏడీ బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇళ్లలో సీబీఐ సోదాలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) బొల్లినేని శ్రీనివాస గాంధీకి చెందిన ఇళ్లలో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారని, హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్‌తోపాటు విజయవాడలోని ఆయన నివాసాల్లో ఏకకాలంలో జరిపిన సోదాల్లో రూ.3.75 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం ఉందని నమస్తే తెలంగాణ రాసింది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో దర్యాప్తు చేసిన శ్రీనివాస గాంధీ, ప్రస్తుతం సెంట్రల్ జీఎస్టీలో పన్నుల ఎగవేత వ్యతిరేక విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.
గాంధీ దురుద్దేశంతో తనను కేసులపేరిట వేధించారని, అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ జగన్ 2017 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశం విడిచి వెళ్లేందుకు నరేశ్ గోయల్‌కు దిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరణ
మూసివేతకు గురైన జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ దేశం విడిచి వెళ్లడానికి అనుమతించేందుకు దిల్లీ హైకోర్టు తిరస్కరించిందని, దేశం విడిచి వెళ్లాలంటే జెట్ ఎయిర్‌వేస్ బకాయిపడ్డ రూ.18 వేల కోట్లకు బ్యాంకు గ్యారెంటీ చెల్లించాలని ఆదేశించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ప్రస్తుత పరిస్థితుల్లో గోయల్‌కు మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆయనపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.
గోయల్ ఎన్నారై హోదాను, వీసాను కాపాడుకొనేందుకు జులై 10లోగా బ్రిటన్‌కు, జులై 23లోగా దుబాయ్‌కు వెళ్లాల్సి ఉంది.
జెట్ ఎయిర్‌వేస్‌లో భారీ ఎత్తున అవకతవకలు ఉన్నాయని గ్రహించిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ మే 25న ఆయనపై లుక్ అవుట్ నోటీసును జారీ చేసింది. అదే రోజు ఆయన దుబాయ్‌కు వెళ్తుండగా బలవంతంగా దింపేశారు.
నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న సంస్థను బ్యాంకులకు అప్పగించి, మార్చి 25న జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ పదవికి గోయల్ రాజీనామా చేశారు. బ్యాంకులు బెయిల్ అవుట్‌కు సిద్ధపడక పోవడంతో ఏప్రిల్ 17న సంస్థ మూతపడింది.
సంస్థ మొత్తం అప్పులు రూ.15 వేల కోట్లకు చేరాయి. జూన్‌లో బ్యాంకులు జెట్ ఎయిర్‌వేస్‌పై దివాలా పిటిషన్ వేశాయి.
ఇవి కూడా చదవండి:
- INDvNZ భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే కనీసం ఎన్ని పరుగులు చేయాలి?
- ధోనీ లేని భారత జట్టును ఊహించగలరా...
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- క్రికెట్ ప్రపంచ కప్ 44 ఏళ్ల చరిత్రలోని ఈ రికార్డు కొనసాగితే.. విజేత టీమిండియానే
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- చర్మం తెల్లగా అవటం కోసం వాడే క్రీములు ఎంత ప్రమాదకరమో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








