సియెర్రా లియోన్: ఆయిల్ ట్యాంకర్ పేలడంతో 99 మంది మృతి - BBC Newsreel

సియెర్రా లియోన్ అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, PRESIDENT JULIUS MAADA BIO/ TWITTER

ఫొటో క్యాప్షన్, రద్దీగా ఉండే సూపర్ మార్కెట్ వెలుపల ఈ ప్రమాదం జరిగింది

సియెర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 99కి పెరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్, లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకొట్టుకున్నాక ఇంధనం చుట్టుపక్కల వెదజల్లినట్లు పడటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఫలితంగా పెద్ద మంటలు చెలరేగడంతో, అక్కడి వాహనాలతో పాటు వ్యక్తులు కూడా అగ్నికి ఆహుతయ్యారు.

స్థానిక మీడియా సంస్థలు ప్రసారం చేసిన ఫుటేజీలో, ట్యాంకర్ చుట్టూ ఉన్న వీధుల్లో బాగా కాలిపోయిన మృతదేహాలు కనిపించాయి.

ఈ ఘటనతో తాను తీవ్రంగా కలత చెందినట్లు అధ్యక్షుడు జులియస్ మాడ బయో పేర్కొన్నారు. 'విషాదకరమైన మంటలు, భయంకరమైన ప్రాణనష్టం తీవ్రంగా బాధించాయి' అని ఆయన అన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనలో 100కు పైగా ప్రజలు చనిపోయినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని ఫ్రీటౌన్ మేయర్ వైవోనీ అకీ సాయర్ చెప్పారు.

ప్రభుత్వ ఆధీనంలో నడుస్తోన్న శవాగారంలో 90కి పైగా మృతదేహాలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫ్రీటౌన్ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 100 మంది చికిత్స పొందుతున్నారు.

అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మరణించిన వారిలో చాలా మంది వాహనాల్లోనే చిక్కకుపోయారు

భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు, ఫ్రీటౌన్ నగరానికి తూర్పున ఉన్న వెల్లింగ్టన్ శివారులోని రద్దీగా ఉన్న చోయ్‌త్రమ్ సూపర్‌మార్కెట్ వెలుపల ఒక కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

ప్రయాణీకులతో నిండిపోయిన ఒక బస్సు ఈ ప్రమాదంలో పూర్తిగా దగ్ధం కావడంతో పాటు, సమీపంలోని దుకాణాలు, మార్కెట్ స్టాల్స్‌ను అగ్నికీలలు చుట్టుముట్టాయని ఒక నివేదిక వెల్లడించింది.

ఇలాంటి ప్రమాదాన్ని ఇంతవరకు చూడలేడని సియెర్రా లియోన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ హెడ్ బ్రిమా బురెహ్ సెసీ, స్థానిక మీడియాతో పేర్కొన్నారు.

మంటల్లో కాలిపోయిన ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మంటల్లో కాలిపోయిన ఆయిల్ ట్యాంకర్, ట్రక్కు

'అగ్నిగుండాలు, ట్రాఫిక్‌ను చుట్టుముట్టాయి': ఫ్రీటౌన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఉమారు ఫొఫునా

ప్రమాదం జరిగిన ప్రదేశంలోని కాలిపోయిన వాహనాల్లో మృతుల శరీరభాగాలు ఇంకా ఉన్నాయి. పెట్రోల్ ట్యాంకర్‌తో పాటు దాన్ని ఢీకొట్టిన ట్రక్కు కూడా అక్కడే ఉంది.

ఈ రెండూ ఢీకొనగానే, దగ్గరలో ఉన్న వాహనదారులు లీకవుతోన్న పెట్రోల్‌ను సేకరించడం మొదలుపెట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతలోనే భారీ పేలుడు సంభవించింది.

అగ్నికీలలు సమీపంలోని ప్రాంతాలను చుట్టుముట్టాయి. ట్రాఫిక్‌లో నిలిచిన వాహనాలు ఇందులో దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను ఫ్రీటౌన్‌లోని సెంట్రల్ మార్చరీకి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని నగరంలోని ఆసుపత్రుల్లో చేర్చుతున్నట్లు చెప్పారు. ఆర్మీ, పోలీసు అధికారులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఉపాధ్యక్షుడి నేతృత్వంలో ఎమర్జెన్సీ మీటింగ్‌ను నిర్వహించనున్నారు.

సియెర్రా లియోన్

తీరప్రాంత నగరమైన ఫ్రీటౌన్‌లో లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇక్కడి ప్రజలు అనేక తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డారు.

నగరంలోని ఒక స్లమ్ ఏరియాలో మార్చిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 80 మంది గాయపడ్డారు. 5000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

2017లో భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన బురదతో సిటీలో 1000 మంది మరణించారు. దాదాపు 3000 మంది నిరాశ్రయులయ్యారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమెరికా: బైడెన్ కలలుగన్న లక్ష కోట్ల డాలర్ల బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం

అమెరికాలో మౌలిక వసతుల అభివృద్ధికి లక్ష కోట్ల డాలర్లు (సుమారు రూ. 74 లక్షల కోట్లు) ఖర్చు చేసేందుకు అక్కడి కాంగ్రెస్ ఆమోదం పలికింది.

అత్యంత కీలకమైన ఈ ఆర్థిక ప్యాకేజీకి కాంగ్రెస్ ఆమోదం లభించడమనేది దేశీయంగా అధ్యక్షుడు జో బైడెన్ సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు.

ప్రతినిధుల సభలో 228-206 ఓట్ల తేడాతో ఆమోదం పొందిన ఈ పబ్లిక్ వర్క్స్ బిల్ డెమొక్రాట్లలో చీలిక తెచ్చింది.

సభలోని ఉదారవాద సభ్యులు మద్దతు పలుకుతున్న మరో కీలక బిల్లయిన సోషల్ స్పెండింగ్ బిల్‌పైనా చర్చ సాగుతోంది.

అమెరికాలో రోడ్లు

ఫొటో సోర్స్, Reuters

మౌలిక వసతుల ప్యాకేజీకి సభ ఆమోదం దక్కడంతో ఇక అది అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాల్చనుంది.

ఈ మౌలిక సదుపాయల చట్టం మేరకు హైవేలు మెరుగుపర్చడం.. రోడ్లు, వంతెనలు, నగరాలలో రవాణా వసతులు మెరుగుపర్చడం, ప్రయాణికుల రైళ్ల కోసం నేరుగా సమాఖ్య ప్రభుత్వమే 55 వేల కోట్ల డాలర్లు( సుమారు రూ. 4 లక్షల కోట్లు) ఖర్చు చేయనుంది.

శుద్ధ ఇంధనాలు, శుద్ధ జలాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం కూడా ఖర్చు చేస్తారు.

ఈ బిల్లు ఆమోదం కోసం మూడు నెలల కిందట 19 మంది రిపబ్లికన్ సభ్యులు డెమొక్రాట్లకు మద్దతుగా చేరారు.

అయితే, సభలోని చాలామంది ఉదారవాద సభ్యులు తుది బిల్లును తిరస్కరించారు. ఎలాగైనా ఆమోదం పొందాలనే లక్ష్యంతో కీలకమైన ఉదారవాద విధానాలను బిల్లు నుంచి తొలగించి అవతలి పక్షం మద్దతు తీసుకున్నారంటూ వారు ఆక్షేపించారు.

హెల్త్ కేర్, విద్య, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా సాంఘిక సంక్షేమ బిల్లుపై ఓటు వేసే వరకు ఈ మౌలిక సదుపాయాల బిల్లుకు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెసనల్ ప్రొగ్రెసివ్ కాకస్ సభ్యులు చెప్పారు.

అమెరికన్ కాంగ్రెస్‌లోని రెండు సభలను డెమొక్రాట్లు స్వల్ప మెజారిటీతో నియంత్రిస్తున్నారు. కాబట్టి బిల్లుల ఆమోదానికి సార్వత్రిక మద్దతు కూడగట్టడం అవసరం.

సోషల్ స్పెండింగ్ బిల్లుకు రెండు సభల్లోనూ సాధారణ మెజారిటీ లభిస్తే చాలు. కానీ, డెమొక్రాట్లలో మధ్యేవాదులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దాని ఆర్థిక ప్రభావాలను అంచనావేయాలని పట్టుపడుతున్నారు. ఇందుకు కొన్ని వారాల సమయం పట్టొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)