ఇకపై సాయుధ దళాల్లో అమ్మాయిలనూ చేర్చుకుంటాం - సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఎన్డీఏ ద్వారా మహిళలను కూడా సాయుధ దళాల్లో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది.
మంగళవారం త్రివిధ దళాల అధిపతులను సంప్రదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి సుప్రీం ధర్మాసనానికి చెప్పారు.
"ఒక శుభవార్త ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా శాశ్వత కమిషన్‌కు అమ్మాయిలను కూడా చేర్చుకోవాలని అత్యున్నత స్థాయి బలగాలు, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మంగళవారం రాత్రి తీసుకున్నారు" అని ఏఎస్‌జీ చెప్పారు.
ఎన్డీయే, ఇండియన్ నావెల్ అకాడమీ (ఐఎన్ఐ)లో మహిళలను కూడా నియమించాలని సాయుధ దళాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిసి చాలా సంతోషంగా ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది.
అలా చేయమని కోర్టు ఆదేశించడానికి బదులు లింగ సమానత్వానికి అనుకూలంగా భద్రతా దళాలే ఇలాంటి మరిన్ని చర్యలు తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు బెంచ్ చెప్పింది.
మహిళలను కూడా ఎన్డీయే పరీక్షలు రాయడానికి అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.
సెప్టెంబర్ 22న కోర్టు దీనిపై తదుపరి విచారణ జరపనుంది.

ఫొటో సోర్స్, Getty Images
జైలులో అగ్ని ప్రమాదం, 41 మంది ఖైదీలు మృతి
ఇండోనేసియా రాజధాని జకార్తా శివారులోని ఓ జైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో 41 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
జకార్తా శివారుల్లో ఉన్న తాంగెరాంగ్ జైలులో బుధవారం వేకువన ఖైదీలు నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి.
అక్కడి బ్లాక్-సిలో ఈ మంటలు వ్యాపించాయి.
బ్లాక్-సి సామర్థ్యం 40 కాగా ప్రమాదం జరిగేటప్పటికి అందులో 122 మంది ఉన్నారు.
ఖైదీల్లో దాదాపు అంతా మాదకద్రవ్యాల కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్నవారే.
ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ఖైదీలు గాయపడ్డారు. వారిలో కొందరు ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ అధికారులు ఇంకా నిర్ధరించలేదు.
600 మంది సామర్థ్యం గల ఈ జైలులో 2000 మంది ఖైదీలు ఉన్నారు.
ఇంత పెద్దసంఖ్యలో ఖైదీలు ఉంటున్న ఈ జైలుకి 15 మంది గార్డులు మాత్రమే కాపలాగా ఉన్నారు.

ఫొటో సోర్స్, THANH NIEN
కోవిడ్ వ్యాప్తికి కారణమైన వ్యక్తికి అయిదేళ్ల జైలు శిక్ష
కోవిడ్ రూల్స్‌ను బేఖాతరు చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమైన ఓ వ్యక్తికి వియత్నాంలో అయిదేళ్ల జైలు శిక్ష విధించారు.
వియత్నాంకు చెందిన 'లీ వేన్ ట్రీ' వల్ల 8 మందికి కోవిడ్ సోకిందని, వారిలో ఒకరు మరణించారని కోర్టు నిర్ధరణకు వచ్చింది.
కొద్దినెలల కిందట వరకు కరోనావైరస్ వ్యాప్తిని వియత్నాం సమర్థంగా నియంత్రించింది. అయితే, ఈ ఏడాది జూన్ తరువాత డెల్టా వేరియంట్ అక్కడ విజృంభించింది.
వియత్నాంలో ఇప్పటివరకు 5,30,000 పాజిటివ్ కేసులు, 13,300 మరణాలు నమోదు కాగా అందులో అత్యధికం గత రెండు మూడు నెలల్లో నమోదైనవే.
ఎక్కువగా హో చి మిన్ సిటీలో కోవిడ్ తీవ్రత ఉంది.
28 ఏళ్ల 'లీ వేన్ ట్రీ' జులైలో హో చి మిన్ సిటీ నుంచి తన సొంతూరు 'కా మావూ'కు మోటార్‌సైకిల్ మీద వెళ్లారు.
అయితే, 'కా మావూ'లో హెల్త్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తన ట్రావెల్ హిస్టరీ గురించి ఆయన అబద్ధం చెప్పారు. అంతేకాదు, ఐసోలేషన్ నియమాలు కూడా పాటించలేదు.
ఇతర ప్రాంతాల నుంచి కా మావూ వచ్చేవారు ఎవరైనా సరే కనీసం 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని అప్పటికి అక్కడ ఆదేశాలున్నాయి. కానీ, లీ వేన్ అది పాటించలేదు.
ఆ తరువాత లీ వేన్‌కి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆయన సందర్శించిన ఓ వెల్ఫేర్ సెంటర్ సిబ్బందికి, ఆయన కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది.
ఈ కేసు విచారించిన న్యాయస్థానం లీ వేన్‌కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు 880 డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 64 వేలు) జరిమానా విధించింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: దేశం పేరు మార్చిన తాలిబాన్లు, ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- 'పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపో' అంటూ కాబుల్‌లో పాక్ వ్యతిరేక ర్యాలీ.. గాల్లోకి తాలిబాన్ల కాల్పులు
- పంజ్‌షీర్‌లో పాకిస్తాన్ వెన్నుపోటు పొడుస్తోందా? ఇరాన్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి?
- వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









