ఆస్ట్రేలియాలో భారీ సాలెగూళ్ల దుప్పటి... సాలీళ్లు ఎందుకిలా అల్లుకున్నాయి?

సాలీడు గూళ్ళతో కప్పేసిన ప్రాంతం

ఫొటో సోర్స్, CAROLYN CROSSLEY

పైనున్న ఫొటో చూశారా.. అవేవో వలలు అనుకుంటున్నారా? అవి వలలు కాదు. అవన్నీ సాలెగూళ్లు.

అవును. అవన్నీ సాలీళ్లు తయారు చేసుకున్న గూళ్లే. రోడ్డు పక్కనున్న చెట్లు, పచ్చిక బయళ్లు, రాళ్లు రప్పలు ఇలా అన్నింటిని కలుపుతూ భారీ గూళ్లను తయారు చేసుకున్నాయి.

ఒక ప్రాంతంలో అయితే సాలీడు గూడు ఒక కిలోమీటరుకు పైగా రోడ్డును కప్పేసింది.

ఆస్ట్రేలియాలో ఇటీవల వరదలు వచ్చిన ప్రాంతాల్లో సాలీళ్లు ఇలా గూళ్లు అల్లుకున్నాయి.

కొన్ని రోజుల పాటు కురిసిన భారీ వర్షాల తర్వాత ఈ సాలెగూళ్లు కనిపించాయని విక్టోరియాలోని గిప్స్‌ల్యాండ్ ప్రాంతవాసులు చెబుతున్నారు.

చెట్టును కప్పేసిన భారీ సాలెగూడు అల్లిక

ఫొటో సోర్స్, CAROLYN CROSSLEY

ఫొటో క్యాప్షన్, చెట్టును కప్పేసిన భారీ సాలెగూడు

మనుగడ కోసమే ఈ భారీ సాలెగూళ్లు

వరదల నుంచి తప్పించుకోవడానికి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేందుకు సాలీళ్లు బెలూనింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

బెలూనింగ్ పద్ధతిలో సాలీళ్లు అధిక ఎత్తులకు ఎగిరేందుకు పట్టు దారాన్ని గాలిలోకి విసురుతాయని చెప్పారు.

దాని ఫలితంగానే ఇలాంటి విస్తారమైన సాలెగూళ్లు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు.

"కొన్ని లక్షల సాలీళ్లు కలిసి సిల్కు దారాలను చుట్టు పక్కల ఉన్న చెట్లపైకి విసిరి ఉంటాయి. అవన్నీ సమన్వయంతో ఒకదానికొకటి కలపడం వల్లే ఇంత పెద్ద సాలెగూడు సాధ్యమయింది" అని విక్టోరియా మ్యూజియంలో సీనియర్ ఇన్సెక్ట్స్ క్యూరేటర్ డాక్టర్ కెన్ వాకర్ చెప్పారు.

"భూమిపై మనుగడ సాగించే సాలీళ్లు వరద నీటిలో కొట్టుకుపోకుండా తప్పించుకునేందుకు భూమిపై నుంచి త్వరగా ఎగరాలి. ఈ సిల్కు దారాలు పాములా చుట్టుకుని పక్కన ఉన్న చెట్ల పైకి అల్లుకోవడంతో అవి సులభంగా తప్పించుకోగలవు" అని ఆయన ఏజ్ వార్తాపత్రికకు చెప్పారు.

వరదల వల్ల జరిగిన నష్టాన్ని చూడటానికి వెళ్లిన స్థానిక కౌన్సిలర్ కారోలిన్ క్రోస్లీ ఈ సహజ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

"అదేమీ భయంకరంగా లేదు. అది అందంగా ఉంది. ఈ సాలెగూళ్లతో చెట్లు, కంచెలు అన్నీ కప్పుకుపోయాయి" అని ఆమె బీబీసీకి చెప్పారు.

రోడ్డు పై భారీ సాలెగూడు అల్లిక

ఫొటో సోర్స్, CAROLYN CROSSLEY

ఫొటో క్యాప్షన్, రోడ్డు పక్కన భారీ సాలెగూడు

మనోహరంగా మారిన సాలెగూళ్లు

"ఈ సాలీడు దారాలు భూమి మీద అలల్లా ఎగసిపడుతున్న దృశ్యం సూర్యాస్తమయ సమయంలో మనోహరంగా ఉంది. ఈ గూడు అంతా చిన్న చిన్న సాలీళ్లతో ఒకటే పొరలా ఉంది" అని చెప్పారు.

"ఈ అద్భుతమైన కళాత్మక దృశ్యాన్ని సృష్టించడానికి సాలీళ్లన్నీ ఒకదానితో ఒకటి జట్టు కట్టినట్లు ఉన్నాయి. ఈ గూడు ఎక్కడా విడిపోలేదు" అని ఆమె చెప్పారు.

వీటిని చూసి ముందు రోడ్డుపై వేసిన వలలు అనుకున్నామని మరో స్థానిక వ్యక్తి అమండా ట్రేగర్ బీబీసీకి చెప్పారు.

"నేను గతంలో కూడా ఇలాంటి దృశ్యాన్ని చూశాను కానీ ఇంత భారీ స్థాయిలో కాదు. ఇది కళ్లు తిప్పుకోలేనంత అందంగా ఉంది" అని అన్నారు.

సాలెగూడు పై పాకుతున్న సాలీళ్లు

ఫొటో సోర్స్, CAROLYN CROSSLEY

ఫొటో క్యాప్షన్, సాలెగూడుపై పాకుతున్న సాలీళ్లు

ఈ సున్నితమైన సాలీడు గూళ్లు కొన్ని రోజుల తర్వాత విడిపోవచ్చు.

భారీ వరదల తర్వాత కనువిందు చేస్తున్న ఈ దృశ్యం అద్భుతంగా ఉందని స్థానికులు అంటున్నారు.

భారీ వర్షాలు, పెనుగాలులు విక్టోరియాలోని చాలా ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వరదలతో అక్కడ భారీ ఆస్తి నష్టం జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)