రూ. 1750 కోట్ల విలువైన బిట్‌కాయిన్లు ‘లాక్‌’ అయిపోయాయి.. విడిపించడానికి మిగిలింది రెండు చాన్స్‌లు మాత్రమే.. మిస్సయితే మిగిలేది సున్నా

డిజిటల్ వాలెట్‌లో బిట్ కాయిన్లను దాచి, ఆ పాస్‌వర్డ్ రాసిపెట్టుకున్న పేపర్ పోగొట్టుకున్నారు థామస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డిజిటల్ వాలెట్‌లో బిట్ కాయిన్లను దాచి, ఆ పాస్‌వర్డ్ రాసిపెట్టుకున్న పేపర్ పోగొట్టుకున్నారు థామస్

మనందరికీ ఇది అనుభవమే. ఒక్కోసారి మన పాస్‌వర్డ్‌లు మరచిపోతుంటాం. ఆ ఆందోళనలో ఎనిమిదిసార్లు పాస్‌వర్డ్ ఊహించి లాగిన్ అవటానికి ప్రయత్నించి విఫలమవుయ్యాక.. ఇక రెండే చాన్స్‌లు మిగిలివుంటాయి.

ప్రోగ్రామర్ స్టెఫాన్ థామస్ సరిగ్గా ఈ పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆయనకు మిగిలిన రెండు చాన్స్‌లు కూడా విఫలమైతే.. పోయేది 24 కోట్ల డాలర్ల (దాదాపు 1,750 కోట్ల రూపాయలు) విలువైన బిట్‌కాయిన్లు.

ఆ బిట్‌కాయిన్లు ఉన్న హార్డ్ డ్రైవ్ పాస్‌వర్డ్ స్టెఫాన్ మరచిపోయారు.

ఆయన దుస్థితి న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడీ వార్త వైరల్‌గా మారింది.

ఫేస్‌బుక్ సెక్యూరిటీ విభాగం మాజీ అధిపతి అలెక్స్ స్టామోస్ తను సాయం చేస్తానని ముందుకొచ్చారు. అయితే అందుకు స్టెఫాన్ బిట్‌కాయిన్లలో పది శాతం వాటా ఇవ్వాలన్నారు.

బిట్‌కాయిన్ విలువ ఇటీవలి నెలల్లో విపరీతంగా పెరిగింది.

ఒక బిట్‌కాయిన్ విలువ ప్రస్తుతం 34,000 డాలర్లు (దాదాపు 25 లక్షల రూపాయలు) గా ఉంది.

కానీ ఈ క్రిప్టోకరెన్సీ విలువ ఎప్పుడూ అనిశ్చితంగానే ఉంటుంది.

దీని విలువ పెరగటం కొనసాగుతుందా కుప్పకూలుతుందా అనే దానిపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిట్ కాయిన్

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడు కొన్ని డాలర్లే...

జర్మనీలో జన్మించిన స్టెఫాన్ థామస్ ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. ఓ దశాబ్దం కిందట.. క్రిప్టోకరెన్సీ ఎలా పని చేస్తుందనేది వివరిస్తూ ఒక వీడియో రూపొందించారు. అందుకు గాను ఆయనకు 7,002 బిట్‌కాయిన్లు రుసుముగా చెల్లించారు.

అప్పుడు ఒక్కో బిట్‌కాయిన్ విలువ కేవలం కొన్ని డాలర్లు మాత్రమే.

దీంతో ఆ బిట్‌కాయిన్లను ఒక హార్డ్ డ్రైవ్‌లో ఐరన్‌కీ డిజిటల్ వాలెట్‌లో దాచారు.

ఆ డిజిటల్ వాలెట్ పాస్‌వర్డ్‌ను ఒక కాగితం మీద రాసుకున్నారు. ఆ కాగితం పోయింది.

సొంత బ్యాంక్

ఈ పాస్‌వర్డ్‌ను పది సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే.. అది ఎన్‌స్క్రిప్ట్ అయిపోతుంది. ఇక వాలెట్‌ను తెరవటం అసాధ్యంగా మారుతుంది.

ఈ పరిస్థితి ఆయన క్రిప్టోకరెన్సీల విషయంలో సంశయంలో పడేలా చేసింది.

‘‘అసలు మన సొంత బ్యాంక్ అనే ఆలోచనే అయోమయం. మనం మన బూట్లు సొంతంగా తయారు చేసుకుంటామా? బ్యాంకులు ఎందుకు ఉన్నాయంటే.. అవి చేసే పనులన్నిటినీ మనం చేయం కదా’’ అని న్యూయార్క్ టైమ్స్‌తో వ్యాఖ్యానించారు థామస్.

వీడియో క్యాప్షన్, లబ్..డబ్బు: సోషల్ మీడియాతో జర జాగ్రత్త

లాక్డ్ ఔట్

ప్రస్తుతం స్టాన్‌ఫర్డ్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న థామస్.. ‘‘లాక్ అయిపోయిన 22 కోట్ల బిట్‌కాయిన్‌ల కోసం పది పాస్‌వర్డ్‌లను గెస్ చేయొద్దు. దానిని ప్రొఫెషనల్స్ దగ్గరకు తీసుకెళ్లి 20 ఐరన్‌కీలు కొనుగోలు చేసి.. వాటిని తెరవటానికి మరో మార్గం వెదకటానికి ఆరు నెలల సమయం కేటాయించాలి’’ అని ట్వీట్ చేశారు.

‘‘పది శాతం వాటా ఇస్తే నేను చేస్తాను. కాల్ మి’’ అంటూ దానికి ఫేస్‌బుక్ సెక్యూరిటీ విభాగం మాజీ అధిపతి అలెక్స్ స్టామోస్ రిప్లై ఇచ్చారు.

తమ సంపద లాక్డ్ ఔట్ అయిన బిట్‌కాయిన్ మిలియనీర్ కాగల తొలి వ్యక్తి థామస్ కాదు.

ప్రస్తుతం దాదాపు 14,000 కోట్ల డాలర్ల విలువైన బిట్‌కాయిన్లు.. తెరవలేని వాలెట్లలో పోగొట్టుకోవటమో, ఉండిపోవటమో జరిగిందని క్రిప్టోకరెన్సీ డాటా కంపెనీ చెయిన్‌ఎనాలసిస్ చెప్తోంది.

డిజిటల్ కరెన్సీని తిరిగి తెచ్చే వ్యాపార సంస్థలకు ప్రతి రోజూ అనేక వినతలు వస్తున్నాయి.

ఒక వ్యాపారి తన డిజిటల్ వ్యాలెట్ ప్రైవేట్ కీలు దాచిన ల్యాప్‌టాప్‌ను అతడి సహోద్యోగి రీఫార్మాట్ చేయటంతో దాదాపు 800 బిట్‌కాయిన్లు పోగొట్టుకున్నారని కూడా న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది.

ఇక 2013లో వెల్ష్ వ్యక్తి ఒకరు.. 7,500 బిట్‌కాయిన్లు దాచిన కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్‌ను చెత్తకుప్పలో పారేసి.. ఆ తర్వాత దానికోసం ఎంతగానో వెదికారు.

ఆ సమయంలో ఆ బిట్‌కాయిన్ల విలువ 40 లక్షల బ్రిటిష్ పౌండ్లు. ఇప్పుడైతే వాటి విలువ 25 కోట్ల బ్రిటిష్ పౌండ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)