విటమిన్ మాత్రలు వేసుకుంటున్నారా... ఆరోగ్యంగా ఉన్నవారికీ అవసరమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ సోనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు ఎప్పుడైనా విటమిన్ మాత్రలు వేసుకున్నారా? ప్రపంచంలో ప్రతి రోజూ కోట్ల మంది విటమిన్ మాత్రలు మింగుతున్నారు. వారిలో మీరు కూడా ఒకరా?
గత వందేళ్లలో ప్రపంచం చాలా మారిపోయింది. విటమిన్ మాత్రలు మారుతున్న ప్రపంచాన్ని చూశాయి. వందేళ్లలో విటమిన్ టాబ్లెట్లు వంద కోట్ల డాలర్ల మార్కెట్‌గా ఆవిర్భవించింది.
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం విటమిన్ టాబ్లెట్లు చాలా ముఖ్యం అని భావిస్తున్నారు. కానీ అలా అని ప్రతి ఒక్కరూ విటమిన్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఉందా.
విటమిన్ మాత్రలు కోట్లాది జీవితాల్లో ఎప్పుడు, ఎలా భాగం అయ్యాయి. ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
వందేళ్ల ముందు విటమిన్ల గురించి ఎవరికీ తెలీదు. కానీ, ఇప్పుడు ప్రపంచంలో అన్ని వయసుల వారూ ఫుడ్-సప్లిమెంట్ల రూపంలో విటమిన్ మాత్రలు వేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వైటల్-అమీన్స్
“ప్రొటీన్, కార్బోహైడ్రేడ్స్, కొవ్వులతోపాటూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరమైన కొన్ని ఉన్నాయని 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలకు మొదటిసారి తెలిసింద”ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం పనిచేసే డాక్టర్ లీసా రోజర్స్ చెప్పారు.
అప్పట్లో శాస్త్రవేత్తలు నౌకల్లో సుదీర్ఘ సముద్ర యాత్రకు వెళ్లేవారు. వారికి తినడానికి తాజా పళ్లు, కూరగాయలు దొరికేవి కావు. దాంతో వారికి ఆహారం కొరత ఏర్పడేది. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపించింది” అన్నారు,
కానీ, 20వ శతాబ్దం ప్రారంభంలో వైటల్-అమీన్స్ గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. వాటిని మనం ఇప్పుడు వైటమిన్ లేదా విటమిన్ అని పిలుస్తున్నాం.
మన శరీరానికి 13 రకాల విటమిన్లు అవసరం. అవి A, C, D, E, K. అల్ఫాబెట్ల ప్రకారం చూస్తే విటమిన్ A, C మధ్య విటమిన్ B ఉంటుంది. అది 8 రకాలుగా ఉంటుంది. అలా మొత్తం విటమిన్ల సంఖ్య 13 అయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి విటమిన్, మరో దానికంటే భిన్నంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం వాటిని తగిన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. వీటిలో విటమిన్ D మన శరీరానికి సూర్యరశ్మి నుంచి అందుతుంది. కానీ మిగతా విటమిన్లు మనకు ఆహారం నుంచే లభిస్తాయి.
ప్రపంచంలో ఇప్పటికే రెండు బిలియన్ల మందికి పైగా విటమిన్లు లేదా మినరల్స్ లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో ఉంటున్నారు.
“పిల్లల విషయంలో విటమిన్ల లోపం ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే పిల్లలు జబ్బు పడినా లేక ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, వారికి అప్పటికే ఆకలి తగ్గిపోయి ఉంటుంది. తర్వాత ఏదైనా తిన్నా వారి శరీరం పోషకాలను స్వీకరించలేని స్థితికి చేరుకుంటుంద”ని డాక్టర్ లీజా రోజర్స్ చెప్పారు.
సైన్స్ ఇంత పురోగతి చెందినప్పటికీ విటమిన్ల గురించి ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. దానికి తోడు దారితప్పిన మన ఆహార అలవాట్లు ఈ కష్టాలను మరింత పెంచాయి.
“వీటివల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందని చాలామంది విటమిన్ టాబ్లెట్లు మింగుతున్నారు. వాటితో ఏదో అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ, మనం క్రమం తప్పకుండా సమతులాహారం తీసుకుంటే, అవి శరీరానికి అవసరమైన విటమిన్లు అందిస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఏం జరగదు. గర్భంతో ఉన్నప్పుడు లేదా వృద్ధాప్యం లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో విటమిన్ టాబ్లెట్లు వేసుకోవడం వేరే విషయం” అన్నారు డాక్టర్ లీజా.
కానీ, కేవలం సప్లిమెంట్లుగా విటమిన్ టాబ్లెట్లు వేసుకునేవారు లక్షల మంది ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం అవసరమా?

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నో ఆశల మార్కెట్
విటమిన్ల గురించి సైన్స్ అనలిస్ట్ కేథరీన్ ప్రైస్ చాలా అధ్యయనం చేశారు. 20వ శతాబ్దం ప్రారంభంలో విటమిన్ అనే మాటను కనిపెట్టిన పోలెండ్ బయోకెమిస్ట్ కాషొమెయె ఫంక్‌కు మార్కెటింగ్ అవార్డు ఇవ్వాలని అంటున్నారు.
“ఆ దిశగా పనిచేస్తున్న మిగతా శాస్త్రవేత్తలు దీనిని ఫుడ్-హార్మోన్ లేదా ఫుడ్-యాక్సెసరీ ఫ్యాక్టర్ అనే పేర్లు పెట్టారు. ఫుడ్ యాక్సెసరీ ఫ్యాక్టర్ అనే పేరు విటమిన్లలా అద్భుతాలు చేయలేదు. తమ పిల్లలకు ప్రతి రోజూ ఫుడ్-యాక్సెసరీ ఫ్యాక్టర్ ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు” అన్నారు
ఆ సమయంలో డబ్బు సంపాదించాలని ఆలోచించిన వారికి, విటమిన్ అనే కొత్త కాన్సెప్టుతో లాటరీ తగిలినట్టు అయ్యింది. ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్.. చేసేవారికి ఇది అద్భుతమైన వస్తువు అనిపించింది అంటారు కేథరీన్.
విటమిన్ల కోసం అన్వేషణ కొనసాగుతున్నప్పుడు, అదే సమయంలో ఫుడ్-ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆహార పదార్థాల్లో సహజంగా పోషకాలు ఉంటాయి. కానీ, ఎక్కువ కేసుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో ఆ పోషక తత్వాలన్నీ నాశనం అయిపోతాయి.

ఫొటో సోర్స్, Getty Images
“నూనెల్లో సహజ విటమిన్లు ఉంటాయి. కానీ ఆ నూనెల వల్ల ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువ రోజులు ఉంచితే పాడైపోతాయి. అందుకే ప్రాసెసింగ్ సమయంలో నేచురల్ ఆయిల్స్ తొలగించడం చాలా అవసరం. అలా ప్రాసెస్డ్ ఫుడ్‌లో విటమిన్లు ఉండవు. వాటిని భర్తీ చేయడానికి ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఎక్కువగా సింథటిక్ విటమిన్లు కలపుతారు” అని కేథరీన్ ప్రైస్ చెప్పారు.
కానీ, మార్కెటింగ్ భాషలో వీటిని యాడెడ్ విటమిన్స్ అన్నారు. అలా యాడెడ్ విటమిన్స్ కాన్సెప్ట్ జోరందుకుంది. ఇదే వరుసలో 1930వ దశకంలో అమెరికాలో విటమిన్ మాత్రలు పుట్టాయి. వాటితో మహిళలను టార్గెట్ చేశాయి.
వారు తమ మార్కెటింగ్ మహిళల వైపే తీసుకెళ్లారు. మహిళల మేగజీన్‌లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతోంది. వాటిలో, తల్లులు విటమిన్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే వారి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మీ పిల్లలకు వైటమిన్ సప్లిమెంట్లు ఇవ్వండ”ని చెబుతున్నారు కేథరీన్.
“1930 తర్వాత దశకంలో అమెరికాలో విటమిన్, ఫుడ్ ఇండస్ట్రీ వృద్ధి చెందింది. ఫుడ్ సప్లిమెంట్ మార్కెట్ కూడా అంతకంతకూ పెరిగి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ పెరుగుతూ పోతే విటమిన్లు మాత్రం ఎక్కడో వెనకబడిపోయాయ”ని అన్నారు.
మనుషులకు 13 రకాల విటమిన్లు అవసరం. కానీ, ఇప్పుడు 87 వేలకు పైగా ఫుడ్-సప్లిమెంట్లు మార్కెట్లో ఉన్నాయి. విటమిన్స్ పరిశ్రమ పూర్తిగా నిలదొక్కుకుంది. మనం వాటిపై ఆధారపడిపోయాం. అందుకే, విటమిన్లు మనకు చాలా అవసరమే, ఇందులో సందేహం లేదు. కానీ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు రహస్యం ఈ మాత్రల్లోనే ఉందనే మాటను ఫుడ్-సప్లిమెంట్స్ మెగా ఇండస్ట్రీ మన మనసుల్లోకి చొరబడేలా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
విటమిన్స్ ఫర్ విక్టరీ
“విజయం కోసం విటమిన్లు అవసరం అని, యుద్ధం గెలవడానికి ఆరోగ్యంగా ఉండడం అవసరం అనుకున్నారు. గెలిచిన యుద్ధాన్ని కాపాడుకోడానికి ప్రజలు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం అని భావించారు. దేశం విజయంతం కావాలంటే ఆ దేశ ప్రజలు పోషకాహార లోపంతో ఉండకూడదని అనుకున్నార”ని నిపుణులు డాక్టర్ సలీమ్ అల్-గిలానీ చెప్పారు.
ఆయన బ్రిటన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ హిస్టరీ బోధిస్తున్నారు.
“రెండో ప్రపంచ యుద్ధం జరిగినపుడు విటమిన్ల విషయంలో ప్రభుత్వాల జోక్యం చేసుకోవడం అనేది అత్యంత ఆసక్తికరంగా కనిపించింది. 1941లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్డ్ ప్రభుత్వం అమెరికా సైనికులకు ‘విటమిన్ అలవెన్సు’లు ప్రకటించింది” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆరోగ్యం గురించి ఆందోళనలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తమ సైనికులకు విటమిన్ల లోపం లేకుండా చూడాలని బ్రిటన్ నిశ్చయించుకుంది.
కానీ, 1940వ దశకంలో బ్రిటన్. విటమిన్ల గురించి కాస్త ఎక్కువే ఆలోచించింది. బాగా చదువుకున్న వారితో మార్కెటింగ్ చేయించడం, విటమిన్ సప్లిమెంట్లు తీసుకునేలా జనాలను ప్రేరేపించింది. విటమిన్ మాత్రలను ‘వైట్ మాజిక్’ అనడం మొదలెట్టారు.
శరీరంలో విటమిన్లు తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం, కానీ, ఎక్కువ విటమిన్లు తీసుకోవడం అంతకంటే ఎక్కువ ప్రమాదం కావచ్చు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అవసరానికి మించి విటమిన్లు తీసుకోవడం వల్ల పిల్లలు తీవ్రంగా జబ్బు పడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రభుత్వ కూడా అప్రమత్తమైంది. వారు తమ ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. తర్వాత, 1980వ దశకంలో పిండం ఎదుగుదల కోసం ఫోలిక్ యాసిడ్ చాలా అవసరమని, అది విటమిన్ B రూపమే అని నిర్ధరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలు గర్బం దాల్చే ముందు, వారికి ఫోలిక్ యాసిడ్ లోపం లేకుండా చేయడానికి గర్భం ధరించిన మొదటి వారాల్లో ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలని చెబుతారు.
“గర్భధారణ చాలావరకూ ప్రణాళిక ప్రకారం జరగదు. దాంతో, ఫోలిక్ యాసిడ్ వారికి అందే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుందనే వాదన ఉంది. అందుకే ధాన్యంతో తయారయ్యే ఆహార ఉత్పత్తుల్లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ప్రపంచంలో దాదాపు 75 దేశాలు వీటిని తప్పనిసరి చేశాయి. బ్రిటన్, యూరోపియన్ దేశాలు మాత్రం చాలా సడలింపులు ఇచ్చాయి. ఆ దేశాల్లో తయారయ్యే ఫుడ్ ప్రొడక్ట్స్ లో కూడా పోలిక్ యాసిడ్ ఉండడం తప్పనిసరి చేయాలని ఇప్పుడు వాటిపై చాలా ఒత్తిడి తెస్తున్నార”ని గిలానీ చెప్పారు.
విటమిన్ల కంపెనీలు వాటిని చాలా అతి చేసి చెబుతాయి, ప్రభుత్వం వాటిని సరిగా రెగ్యులేట్ చేయడం లేదు, అందుకే, ఎక్కువ మంది విటమిన్ల విషయంలో మార్కెటింగ్ వలలో పడుతున్నారని ఆయన చెబుతున్నారు.
“విటమిన్లు తీసుకోవడం వల్ల కలిగే హాని, ప్రయోజనాల గురించి ఆలోచించాక జనం విటమిన్లు, మిగతా ఫుడ్ సప్లిమెంట్లు తీసుకోవడం మొదలెడతారు. విటమిన్ల విషయంలో భ్రమలు సృష్టించే సమాచారం అందినప్పుడు కూడా వారలా చేస్తారు. ఆ భ్రమలను ఎవరూ దూరం చేయరు. ప్రపంచవ్యాప్తంగా విటమిన్ల వ్యాపారం వృద్ధి చెందడానికి కారణం ఇదే” అన్నారు.

ఫొటో సోర్స్, APOMARES
సెక్సీ, కూల్ లుక్ కావాలని...
“ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుతోంది. వారికి కొనుగోలు శక్తి ఉంటుంది. ఖర్చు చేయడానిక డబ్బు ఉంటుంది. వారి దగ్గర సమయం కూడా ఉంటుంది. దాంతో వారు తమ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించగలరు” అన్నారు అని రీసెర్చ్ కంపెనీ యూరో మానిటర్‌లో పనిచేసే మాథ్యూ ఆస్టర్.
ఆయన హెల్త్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గణాంకాలను విశ్లేషిస్తుంటారు.
“హెల్త్ ప్రొడక్ట్ వినియోగం, ఆసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. చైనా కూడా వేగంగా పెరిగే మార్కెట్. ఆగ్నేయాసియా దేశాల్లో, ముఖ్యంగా థాయ్‌లాండ్, వియత్నాంలో హెల్త్ ప్రొడక్ట్స్ మార్కెట్ చాలా పెద్దది. ఆసియాలో గత కొన్నేళ్లుగా ఈ మార్కెట్ చాలా కమర్షియల్ అయిపోయింది” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం యువత విటమిన్ మాత్రలు ఎక్కువగా వేసుకోవడం కూడా ఈ ఇండస్ట్రీ గ్లోబల్ గ్రోత్‌కు ఒక కారణం అంటారు మాథ్యూ
“చిన్న వయసు వారు కూడా విటమిన్స్ తీసుకోవడం ఇటీవల మనం చూస్తున్నాం. అంతకు ముందు తరం అలా చేసేవారు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెక్సీ, కూల్ లుక్ కోరుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా తమ లుక్స్, ఫిట్‌నెస్ ద్వారా వాటిని ప్రోత్సహిస్తున్నారు” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే, జనం ఆహారానికి బదులు టాబ్లెట్లే వేసుకునే పరిస్థితి వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా మార్కెట్‌కు భిన్నంగా ఉంది.
“ఈ పరిశ్రమ వేగం నెమ్మదిస్తుందని నాకు అనిపించం లేదు. వినియోగదారుల్లో రోజుకు ఒక్క మాత్ర కూడా వేసుకోని వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు. వాళ్లంతా నేను నా మొత్తం పోషకాలు ఆహారం నుంచే పొందాలి అనుకోవాలి. మార్కెట్ మన అలవాట్లను క్యాష్ చేసుకుంటోంది. మనం సమతులాహారం తీసుకుంటే, ఒత్తిడిని తగ్గించుకోగలిగితే, కొన్ని ప్రత్యేక కేసుల్లో తప్పితే ఎవరికీ, ఎప్పుడూ ఎలాంటి సప్లిమెంట్ల అవసరం ఉండదు” అంటారు మాథ్యూ.
కొంతమంది ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే, రోగులకు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం తప్ప వేరే దారి ఉండదు. కానీ బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అసలు సప్లిమెంట్ ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది.
నిజంగా, మనకు వీటి అవసరం ఉందా. లేక మనం తీసుకునే ఆహారం పట్ల నిర్లక్ష్యమే దీనికి కారణమా.
ఇప్పుడు, మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోండి. నిజాయితీగా వాటికి జవాబు వెతకండి. ఎందుకంటే ఆ ఆరోగ్యం మీది, దానిపై ఖర్చు చేసే డబ్బు కూడా మీదే.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








