ఫేస్ బుక్ వివాదంలో కొత్త మలుపు... ఆంఖీదాస్‌పై కేసు పెట్టిన ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్

ఆంఖీ దాస్, మార్క్ జుకర్ బర్గ్

ఫొటో సోర్స్, Ankhi Das

ఫొటో క్యాప్షన్, ఆంఖీ దాస్, మార్క్ జుకర్ బర్గ్
    • రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
    • హోదా, బీబీసీ హిందీ కోసం, రాయ్ పూర్ నుంచి

కొన్నివర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఫేస్‌బుక్‌పై మొదలైన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు.చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన ఓ జర్నలిస్ట్‌ ఇండియాలో ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ డైరక్టర్‌ (సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఏషియా) అంఖీదాస్‌పై రాయ్‌పూర్‌లో‌ కేసు పెట్టారు.

భారతశిక్షా స్మృతిలోని 295A, 505(1), 506, 500, 34 సెక్షన్‌ల కింద అంఖీదాస్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదైంది. అంఖీదాస్‌తోపాటు వివేక్‌సిన్హా, రామ్‌సాహు అనే మరో ఇద్దరిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.ఈ కేసుపెట్టిన అవేశ్‌ తివారి జర్నలిజం వృత్తిలో ఉన్నారు. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫేక్‌ న్యూస్‌ కమిటీలో సభ్యుడు కూడా.

ఇటీవల 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్' ఫేస్‌బుక్ ఇండియా గురించి ప్రచురించిన సమాచారం ప్రకారం ఆ సంస్థ భారతదేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టే వారిని ప్రోత్సహిస్తోందని అవేశ్‌ తివారి ఆరోపించారు.ఈ కథనం ఆధారంగానే ఆమెపై కేసు పెట్టారు అవేశ్‌ తివారి.

“ఫేస్‌బుక్‌ భారతదేశంలో వ్యాపారం చేయాలనుకుంటోంది. కానీ, దానికి రాజకీయాలు చేసే హక్కులేదు. ఇది కార్పొరేట్ సంస్థలు, పాత్రికేయుల మధ్య యుద్ధం కాదు. భారత రాజ్యాంగ విలువలను రక్షించే పోరాటం’’ అని అవేశ్‌ తివారి బీబీసీతో అన్నారు.

ఆవేశ్ తివారీ

ఫొటో సోర్స్, Alok Putul

ఫొటో క్యాప్షన్, ఆవేశ్ తివారీ

కేసుపై దర్యాప్తు జరుగుతుందని, నిబంధన ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని రాయపూర్‌ సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్ అజయ్ యాదవ్ అన్నారు. ఇటీవల 'వాల్‌స్ట్రీట్ జర్నల్'లో ప్రచురితమైన ఒక కథనం, “భారతదేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తల చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే విషయంలో ఫేస్‌బుక్‌ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది’’ అని పేర్కొంది.

బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులపైనా, నేతలపైనా నిషేధం విధించడం వల్ల భారతదేశంలో మన వ్యాపారంపై ప్రభావం పడే అవకాశముంటుందని ఫేస్‌బుక్‌కు చెందిన సీనియర్ అధికారిణి అంఖీదాస్ తన ఉద్యోగులతో వ్యాఖ్యానించినట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ వివాదం మొదలయ్యాక, కాంగ్రెస్‌ పార్టీ ఫేస్‌బుక్‌, బీజేపీలను టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగింది. దీనిపై దర్యాప్తు జరపాలని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు ఏఐసీసీ ఒక లేఖ రాసింది.

అయితే, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనాన్ని ఫేస్‌బుక్‌ తోసిపుచ్చింది. తాము విద్వేషాన్ని రగిలించే ఎలాంటి కంటెంట్‌నైనా నిషేధిస్తామని, రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా దీన్ని అమలు చేస్తామని పేర్కొంది.

ఎఫ్ఐఆర్ కాపీ

ఫొటో సోర్స్, Alok Putul

ఫొటో క్యాప్షన్, ఎఫ్ఐఆర్ కాపీ

అంఖీదాస్‌ ఫిర్యాదు

వాల్‌స్ట్రీట్‌ జర్నల్ కథనం ప్రచురితమైన తర్వాత, ఆగస్టు 16 రాత్రి, ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ డైరక్టర్‌ (సెంట్రల్‌ అండ్‌ సౌత్‌ ఏషియా) అంఖీదాస్‌ ఢిల్లీ సైబర్ సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపూర్‌కు చెందిన అవేశ్‌ తివారీతోపాటు, మరో ఐదుగురు వ్యక్తులు, ఇంకొందరిపైనా అంఖీదాస్ కేసు పెట్టారు. వీరు సోషల్‌ మీడియాలో తనను బెదిరిస్తూ పోస్టులు పెట్టారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఆ మరుసటి రోజే అవేశ్‌ తివారీ రాయ్‌పూర్‌లో అంఖీదాస్‌పై ఫిర్యాదు చేశారు. అయితే అంఖీదాస్ తనపై చేసిన‌ ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించ లేదు.

“లోక్‌సభ ఎన్నిలకు ముందు అన్ని రకాల విద్వేష పూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌లో అనుమతించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని తొలగించవద్దని ఆమె తన కింది ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. అలా తొలగించడం వల్ల ఫేస్‌బుక్‌కు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న రాజకీయ సంబంధాలు చెడిపోతాయని ఆమె అన్నారు’’ అని అవేశ్ తివారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

“ఫేస్‌బుక్‌ యూజర్‌ రామ్‌సాహు నన్ను, నా ఇంటినీ తగలబెడతానని బెదిరించారు. ఈ పోస్ట్‌ తర్వాత నాకు రకరకాల ప్రాంతాల నుంచి వాట్సాప్‌ కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయి. ఫేస్‌బుక్‌ డైరక్టర్‌ అంఖీదాస్‌ పేరు తీసుకువస్తే చంపేస్తామని కొందరు బెదిరించారు’’ అని అవేశ్‌ తివారి వెల్లడించారు.

అంఖీదాస్‌, రామ్‌సాహు, వివేక్‌ సిన్హాలాంటి వ్యక్తులు దేశంలో మతపరమైన అసమానతలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారని అవేశ్‌ తివారీ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)