కరోనావైరస్: మహిళల నేతృత్వంలోని దేశాలు మహమ్మారిపై సమర్థంగా పోరాడుతున్నాయి... ఎందుకలా?

ఈ మహిళా నేతలు
ఫొటో క్యాప్షన్, ఈ మహిళా నేతలు శాస్త్రీయ దృక్పథంతో కరోనావైరస్‌తో పోరాటం చేస్తున్నారు.
    • రచయిత, పాబ్లో ఉకోవా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

న్యూజీలాండ్ నుంచి జర్మనీ వరకు, తైవాన్ నుంచి నార్వే వరకు మహిళలు నాయకత్వం వహిస్తున్న దేశాల్లో కోవిడ్-19కి గురై మరణించిన వారి సంఖ్య తక్కువగా నమోదైంది.

ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకు వారి నాయకత్వంలో అమలు చేసిన విధానాలను మీడియా ప్రశంసించింది.

ఇటీవల ఫోర్బ్స్ పత్రిక "నిజమైన నాయకత్వానికి వారు ఉదాహరణలను" అని ప్రశంసించింది.

మానవాళి కోసం ఒక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో మహిళలు చేసి చూపిస్తున్నారని ఫోర్బ్స్ రాసింది.

కోవిడ్ 19 ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నవారు మహిళలేనని చాలా మంది వ్యాఖ్యానించారు. అయితే ప్రపంచ దేశాలలో మహిళలు ఆధిపత్యం వహిస్తున్న దేశాలు 7 శాతం మాత్రమే .

అయితే, మహిళలు ఈ విపత్తుని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి గల కారణాలు ఏమిటి?

ఐస్ ల్యాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐస్ ల్యాండ్

సత్వర చర్యలు

ఐస్ లాండ్ ప్రధాన మంత్రి కాట్రిన్ జాకోబ్స్డోటిర్ చాలా పెద్ద స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

ఐస్ లాండ్ జనాభా 3.6 లక్షలు అయినప్పటికీ జనవరి చివరి వారం నుంచి 20 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలని నిషేధించింది. అప్పటికి ఆ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ దేశంలో ఏప్రిల్ 09వ తేదీ నాటికి కోవిడ్ 19 బారిన పడి 9 మంది మరణించారు.

తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ కూడా వైరస్ ని అరికట్టడానికి ఒక వైరస్ నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నివారణ చర్యల్ని సత్వరమే అమలు చేశారు.

ఫేస్ మాస్కుల వంటి వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పత్తిని కూడా పెంచారు. తైవాన్ లో 2 కోట్ల 40 లక్షల జనాభా ఉన్నప్పటికీ అక్కడ కేవలం ఆరు మరణాలు నమోదు అయ్యాయి.

న్యూజీలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ వైరస్ నివారణకు చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. ఇతర దేశాల్లోలా వైరస్ బారిన పడిన వారి సంఖ్యని ఫ్లాట్ చేయాలనే విధానంలో కాకుండా అసలు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.

దేశంలో ఆరు మరణాలు నమోదు అయిన వెంటనే లాక్ డౌన్ విధించారు. ఏప్రిల్ 20 నాటికి న్యూజీలాండ్ లో నమోదైన మరణాలు 12.

త్సాయి ఇంగ్ వెన్

ఫొటో సోర్స్, SAM YEH/AFP

ఫొటో క్యాప్షన్, సైనికులు, అధికారులతో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్

కోవిడ్ -19 ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఒక్క మహిళా నాయకత్వమే మాత్రమే కాకుండా ఈ దేశాలలో ఇంకొక సారూప్యత ఉంది.

ఈ దేశాలన్నీ అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలు. ఈ దేశాల్లో పటిష్టమైన సంక్షేమ పధకాలు అమలులో ఉన్నాయి. సామాజిక అభివృద్ధిలో ఎప్పుడూ అవి అత్యధిక స్థానంలో ఉంటాయి. అలాగే, ఈ దేశాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ కూడా ఉంది.

బెర్లిన్ లో ఒక మహిళ

ఫొటో సోర్స్, ODD ANDERSEN/AFP

ఇదంతా భిన్నత్వానికి సంబంధించినది

ఈ దేశాల్లో మహిళా నాయకులు రాజకీయాలు చేసే విధానం కూడా కీలకమేనని పరిశీలకులు వ్యాఖ్యానించారు.

"పురుషుల కన్నా భిన్నమైన నాయకత్వం మహిళలు చేస్తున్నారని నేను అనుకోవటం లేదు. కానీ, మహిళలు నాయకత్వం వహించే చోట నిర్ణయాలు తీసుకోవడంలో భిన్నత్వం కనిపిస్తుంది" అని 3డి ప్రోగ్రాం ఫర్ గర్ల్స్ అండ్ విమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , యు ఎన్ ఫౌండేషన్ లో సీనియర్ ఫెలో డాక్టర్ గీత రావు గుప్త చెప్పారు.

పురుషులు, మహిళలు ఇద్దరి అభిప్రాయం తీసుకోవడం వలన ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడుతుందని అన్నారు.

“ఇది స్వీయ ప్రశంసలు చేసుకుంటూ, సైన్స్ ని హేళన చేసే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో లాంటి నాయకుల తీరుకి భిన్నంగా ఉంటుంది”.

పురుషులకైనా, స్త్రీలకైనా స్వతహాగా నాయకత్వ లక్షణాలు రావని లండన్ కింగ్స్ కాలేజీలో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ లీడర్షిప్ డైరెక్టర్ రోసీ క్యాంప్ బెల్ అభిప్రాయపడ్డారు.

"మహిళలకి స్వతహాగా కలుపుకుని పోయే స్వభావం కలిగి ఉంటుందని అన్నారు. దురదృష్టవశాత్తు పురుషుల్లో స్వీయ ప్రశంస, పోటీ తత్త్వం ఎక్కువగా ఉంటుందని” ఆమె అన్నారు.

పురుషుల్లో ఉండే ఈ లక్షణాన్నే ప్రజా రాజకీయాల్లో ఎక్కువగా వాడతారని అన్నారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

పురుష లక్షణ రాజకీయాలతో వచ్చే సమస్యలు

“ప్రజా నాయకులు తమకి మద్దతు సంపాదించుకోవడానికి సులభమైన సందేశాలపై ఆధారపడతారని క్యాంప్ బెల్ చెప్పారు. “ఈ మహమ్మారిని అరికట్టడానికి కూడా ఇదే విధానాన్ని వాడటమే సమస్యకి దారి తీసింది”.

“యూఎస్, బ్రెజిల్, హంగరీ లాంటి కొన్ని దేశాల నాయకులు తమ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి విదేశీయులపై నెపం తోసేశారు”.

“ట్రంప్ , బోల్సొనారో పురుషాధిక్యతతో ప్రవర్తించారు.”

“ఫ్రాన్స్ కి చెందిన మారిన్ లి పెన్ లాంటి కొందరు తప్ప, మహిళల ప్రవర్తనా విధానం ఇలా ఉండదు”.

పురుషాధిక్య రాజకీయాలు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.

బోల్సొనారో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో

ఆయా దేశాల్లో నెలకొన్న సాంఘీక, సాంస్కృతిక, ఆర్ధిక పరిస్థితులు, వనరులకు అనుగుణంగా కోవిడ్ 19 అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాయి. ఇందులో జెండర్ వహించిన పాత్ర ఏమీ ఉండకపోవచ్చు.

క్యాంప్ బెల్ వర్గీకరించినటువంటి పురుషాధిక్యత ఉన్న నాయకులు కూడా కొంత మంది ప్రభావవంతమైన చర్యలే తీసుకున్నారు.

దక్షిణ కొరియా లో మూన్ జె ఇన్ ఈ వైరస్ ని అరికట్టడానికి అవలంబించిన విధానాలు అతని పార్టీకి ఏప్రిల్ 15 వ తేదీ జరిగిన ఎన్నికలలో భారీ విజయాన్ని తెచ్చి పెట్టాయి.

గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మెట్సోటాకీస్ కూడా తాను అవలంబించిన చర్యలకి ప్రశంసలు అందుకున్నారు. కోటి పది లక్షల జనాభా ఉన్న గ్రీస్ దేశంలో ఏప్రిల్ 20 వ తేదీ నాటికి 114 మరణాలు చోటు చేసుకున్నాయి.

6 కోట్ల జనాభా ఉన్న ఇటలీలో 22000 మరణాలు చోటు చేసుకున్నాయి

శాస్త్రీయ సలహాలు, సామాజిక దూరం పాటిస్తూ గ్రీస్ దేశం వైరస్ అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.

అలాగే మహిళలు నాయకత్వం వహిస్తున్న మరి కొన్ని దేశాల్లో వైరస్ ని అరికట్టేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వైరస్ ని నియంత్రించడంలో సఫలీకృతులయ్యారు. కానీ, అతి తక్కువ స్థాయిలో జరుగుతున్న వైద్య పరీక్షలు అక్కడ ఒక పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. వైద్య సిబ్బందికి తగినంత రక్షణ పరికరాలు లేవని అక్కడ వైద్య సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు.

నార్వే ప్రధాని ఎర్నా సోల్డ్ బర్గ్, డెన్మార్క్ ప్రధాని మాట్టే ఫ్రెడెరిక్సెన్
ఫొటో క్యాప్షన్, నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్, డెన్మార్క్ ప్రధాని మాట్టే ఫ్రెడెరిక్సెన్

కఠినమైన నిర్ణయాలు

కోవిడ్ -19 ని ప్రారంభ దశలో అరికట్టడానికి నాయకులు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వైరస్ ప్రారంభమైన తోలి దశలోనే ఆర్ధిక వ్యవస్థని నియంత్రించే పని చేయగలగాలి. అయితే అలాంటి నిర్ణయాలు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దీనికి ప్రజా నాయకులు సంసిద్ధంగా ఉండరని క్యాంప్ బెల్ అన్నారు.

అయితే, కొంత మంది మహిళా నాయకులు ఈ విపత్తు గురించి బహిరంగంగా, నిజాయితీగా మాట్లాడి ప్రశంసలు పొందారు.

జర్మనీ అధ్యక్షురాలు ఏంగెలా మెర్కెల్ కోవిడ్ 19 ఒక మహమ్మారి అని తొందరగా గుర్తించారు. వెంటనే అతి పెద్ద స్థాయిలో పరీక్షలు నిర్వహించి, స్వీయ నిర్బంధం చేశారు. జర్మనీలో కోవిడ్ 19 బారిన పడి 4600 మంది మరణించారు. జర్మనీ జనాభా 8 కోట్ల మూడు లక్షలు.

నార్వే, డెన్మార్క్ ల్లో కూడా మహిళా నాయకులు అవలంబించిన విధానాలు వారిని ప్రత్యేకంగా నిలిపాయి.

నార్వే నాయకురాలు ఎర్నా సోల్బర్గ్ , డేనిష్ నాయకురాలు మాట్టే ఫ్రెడెరిక్సెన్ కేవలం పిల్లల కోసం పత్రికా సమావేశాలు నిర్వహించారు. వీటికి ఒక్క పెద్దవారిని కూడా అనుమతించలేదు.

న్యూజీలాండ్ లో జసిండా ఆర్డెర్న్ ఇంటి దగ్గరే ఉండి లాక్ డౌన్ లో ఈస్టర్ ఎలా చేసుకోవాలో పిల్లలకు వివరించారు.

గతంలో అయితే ఇలా మాట్లాడటం వ్యక్తిగత విషయాలుగా చూసేవారని క్యాంప్ బెల్ అన్నారు.

ఈ మహమ్మారి అన్ని వయస్సుల వారి మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తుందని రాజకీయ నాయకులు గుర్తించి పిల్లలతో మాట్లాడటం మంచి విషయమని క్యాంప్ బెల్ అన్నారు.

ఆరోగ్య సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

ఉత్తమమైన నిర్ణయాలు

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. అయితే, 2018లో ఎన్నికైన దేశాధినేతల్లో 153 మంది పురుషులు ఉంటే మహిళలు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అంచనా వేసింది. ప్రపంచ పార్లమెంట్ సభ్యుల్లో మహిళలు కేవలం పావు శాతం మాత్రమే ఉన్నారు.

ఆరోగ్య రంగంలో కూడా మహిళల నాయకత్వం పెరగాలని డాక్టర్ గుప్త అన్నారు. ఇలా చేయడం వలన ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణయాలు సమాజంలో అన్ని వర్గాల వారికి సంబంధించినవై ఉండాలని అన్నారు.

"మహిళలకి స్వభావ రీత్యా కొన్ని పరిస్థితులని ఎదుర్కొన్న అనుభవం ఉంటుంది. అది ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది” అని ఆమె చెప్పారు.

కోవిడ్ -19 స్త్రీ, పురుషుల మీద భిన్నమైన సామాజిక, ఆర్ధిక ప్రభావం చూపనుందని డాక్టర్ గుప్త హెచ్చరించారు. గృహ హింస, కరువు పెరగవచ్చని సూచించారు.

“మనం వెనక్కి వెళుతున్నాం. ఈ మహమ్మారిని సత్వరమే ఎదుర్కోలేకపోతే ఇప్పుడున్న సమస్యలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందని” ఆమె అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)