డోనల్డ్ ట్రంప్: 'వలసలను నియంత్రించకపోతే మెక్సికో సరిహద్దులు మూసేస్తాం'

ఫొటో సోర్స్, Reuters
వలసల నియంత్రణలో మెక్సికో మరిన్ని చర్యలు చేపట్టకపోతే తాను వచ్చే వారం ఆ దేశంతో సరిహద్దులను మూసివేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.
వలసలను నియంత్రించడం మెక్సికోకు తేలికైన విషయమని, కానీ మెక్సికో ఆ పని చేయడం లేదని ఆయన శుక్రవారం విమర్శించారు.
అమెరికాకు మెక్సికో చాలా మంచి పొరుగు దేశమని, తాము అమెరికా బెదిరింపులకు తలొగ్గి వ్యవహరించబోమని మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ ట్విటర్‌లో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వలస వెళ్లడం మానవ హక్కు: మెక్సికో అధ్యక్షుడు
వలసలు మెక్సికన్ల వల్ల ఏర్పడుతున్న సమస్య కాదని, ఇది మధ్య అమెరికా దేశాల్లోంచి ఉత్పన్నమవుతున్న సమస్య అని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ గురువారం చెప్పారు.
''మెక్సికన్లు ఇప్పుడు అమెరికాలో ఉపాధి పొందాలని కోరుకోవడం లేదు. అమెరికాలోని వలసదారుల్లో ఎక్కువ మంది మధ్య అమెరికాలోని ఇతర దేశాలకు చెందినవారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ శుక్రవారం ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షుడు స్పందిస్తూ- వలసల విషయంలో తాము అమెరికా ప్రభుత్వంతో ఘర్షణకు దిగబోవడం లేదని స్పష్టం చేశారు.
''వలస వెళ్లడం మానవ హక్కు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
బతుకుదెరువు కోసం వలస వెళ్లడం తప్ప మధ్య అమెరికాలోని ప్రజలకు మరో మార్గం లేదని తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ ఆలోచనకు కారణమేంటి?
మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్, హొండురస్, గ్వాటెమాలాల్లో హింస నుంచి బయటపడేందుకు అమెరికాను ఆశ్రయం కోరేవారి సంఖ్య భారీగా పెరిగిందని అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రి కిర్స్ట్‌జెన్ నీల్సన్ చెప్పారు.
సరిహద్దుల్లో అదుపులోకి తీసుకొన్నవారి సంఖ్య ఈ నెల్లో లక్షకు చేరుకోవచ్చని, దశాబ్ద కాలంలో ఇదే అత్యధికమని అంతర్గత భద్రత విభాగం అధికారులు తెలిపారు.
ప్రస్తుతం అదుపులో ఉన్నవారిలో తోడు ఎవ్వరూ లేని వెయ్యి మందికి పైగా బాలబాలికలు కూడా ఉన్నారని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
ప్రస్తుతం అమెరికా అదుపులో 6,600 కుటుంబాలు ఉన్నాయని, వీటి బాగోగుల భారం ప్రభుత్వంపైనే పడిందని నీల్సన్ అమెరికా కాంగ్రెస్‌కు నివేదించారు. ఇదో అత్యవసర పరిస్థితి అని, దీని ప్రభావం అమెరికన్లపై ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
సరిహద్దుల్లో సిబ్బంది కొరత ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది.
క్యూడడ్ జువారెజ్, ఎల్ పాసో, టెక్సాస్‌లలోని సరిహద్దు ప్రాంతాల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోతోంది.

ఫొటో సోర్స్, AFP
అమెరికా సరిహద్దులు మూసేస్తే వలసలు ఎలా ఆగిపోతాయన్నది స్పష్టం కావడం లేదు.
ఎందుకంటే చాలా మంది అనధికార మార్గాల్లోనే దేశంలోకి ప్రవేశిస్తున్నారు.
వీరు అమెరికా భూభాగంపై అడుగు పెట్టిన తర్వాతే చట్టపరమైన అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
మూసేస్తే ఏమవుతుంది?
అమెరికాతో సరిహద్దులను అమెరికా మూసేస్తే ఉభయ దేశాల మధ్య రాకపోకలకు అడ్డంకులు తప్పవు. పర్యాటకం, వాణిజ్య రంగాలు దెబ్బతింటాయి. గత ఏడాది రెండు దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యం విలువ 61,200 డాలర్లుగా ఉందని అమెరికా గణాంకాల విభాగం తెలిపింది.
సరిహద్దులు మూసేస్తే వందల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని, ట్రంప్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని స్పష్టమవుతోందని మెక్సికోలోని టిజువానాకు చెందిన వాణిజ్య గ్రూపు సారథి కుర్ట్ హొనోల్డ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ తెలుగు రంగస్థలం: 'ఉత్తరాంధ్ర కొన్ని దశాబ్దాలుగా వంచనకు గురైంది'
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- మహిళలకు పురుషులతో సమానంగా ఆర్థిక హక్కులు అందిస్తున్న దేశాలెన్ని...
- బ్రెగ్జిట్: ప్రతినిధుల సభలో తిరస్కరణ.. 58 ఓట్లతో వీగిన బిల్లు
- ఫేక్‌న్యూస్‌కు వ్యతిరేకంగా బీబీసీ సరికొత్త భారీ అంతర్జాతీయ కార్యక్రమం
- సెకండ్ హ్యాండ్ దుస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








