ట్రంప్-రష్యా: అధ్యక్ష ఎన్నికల ప్రచార ఆరోపణలపై రాబర్ట్ ముల్లర్ నివేదిక

ఫొటో సోర్స్, AFP/GETTY
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా రష్యాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక న్యాయాధికారి రాబర్ట్ ముల్లర్ ఎట్టకేలకు తన నివేదిక సమర్పించారు.
ఈ విచారణ పరిధిలోకి కొత్తగా ఎవరినైనా చేర్చడానికి ముల్లర్ ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని న్యాయశాఖ అధికారి ఒకరు చెప్పారు.
స్పెషల్ కౌన్సిల్ ఇప్పటికే ట్రంప్ మాజీ సహచరులు ఆరుగురి మీద, పది మందికి పైగా రష్యన్ల మీద ఆరోపణలు అభియోగాలు నమోదు చేసింది.
ఇక, ఆ నివేదికకు సంగ్రహ రూపమిచ్చి, దానిని ఎంతవరకు కాంగ్రెస్‌కు విడుదల చేయాలనే విషయాలను అటార్నీ జనరల్ విలియమ్ బార్ చూసుకుంటారు.
కాంగ్రెస్ సభ్యులకు ఒక లేఖ రాస్తూ, ఈ వారాంతంలోగా ఆ నివేదికలోని కీలకాంశాలను వెల్లడి చేస్తానని బార్ తెలిపారు.
డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోసెన్‌స్టీన్ 22 నెలల కిందట నియమించిన స్పెషల్ కౌన్సిల్ తన నివేదికలో చట్టపరంగా తీసుకోవల్సిన చర్యల గురించి వివరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ట్రంప్‌తో పాటు ఇతర రిపబ్లికన్లు కొందరు ఇప్పటికే ఈ విచారణను 'అకారణ వేధింపు'గా అభివర్ణించారు.
కాంగ్రెస్‌కు చెందిన జ్యుడిషియరీ కమిటీ నేతలైన సెనెటర్లు లిండ్సే గ్రాహం, డయాన్ ఫీన్‌స్టీన్, కాగ్రెస్ సభ్యులు జెరాల్డ్ నాడ్లర్, డౌగ్ కాలిన్స్‌లకు విలియం బార్ ఒక లేఖ రాస్తూ, ముల్లర్ విచారణలో న్యాయశాఖ ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
ఇప్పుడు తాను డిప్యూటీ అటార్నీ జనరల్ రోసెన్‌స్టీన్‌ను (బార్ నియామకానికి ముందు ఈ విచారణను పర్యవేక్షించిన అధికారి), ముల్లర్‌ను సంప్రతిస్తానని, నివేదికలో ఏయే అంశాలను కాంగ్రెస్‌కు, వేటిని ప్రజలకు విడుదల చేయాలో చర్చిస్తానని అటార్నీ జనరల్ అన్నారు.
"సాధ్యమైనంతవరకు అంతా పారదర్శకంగా ఉంచేందుకు కట్టుబడి ఉంటాం. నా సమీక్ష గురించి ఎప్పటికప్పుడు వివరాలు కూడా తెలియజేస్తాను" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
స్పెషల్ కౌన్సిల్ గత 22 నెలలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రజలను ప్రభావితం చేయడానికి రష్యన్ ఏజెంట్లు కీలక సమాచారాన్ని ఎలా సంపాదించారో వెల్లడి చేశారు. అంతేకాకుండా, అమెరికాలో రాజకీయ కార్యకలాపాలకు నిధులు ఎలా ఇచ్చారు, హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీసేందుకు ఉన్నత స్థాయి డెమాక్రాట్ల ఇమెయిల్స్ ఎలా హ్యాక్ చేశారనే విషయాలను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
దీనికితోడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీని తొలగించడం ద్వారా ట్రంప్ న్యాయ విచారణకు అడ్డుపడ్డారా లేక పక్కదోవ పట్టించారా అనే కోణంలోనూ స్పెషల్ కౌన్సిల్ ముల్లర్ విచారణ చేశారు.
ట్రంప్ మాత్రం, "రష్యాతో ఎలాంటి కుమ్మక్కు లేదు. దేనికీ అడ్డుపడలేదు" అని పదే పదే చెబుతూ వచ్చారు.
విచారణ సమయంలో ముల్లర్ బృందానికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ట్రంప్ నిరాకరించారు. కొన్ని నెలల చర్చల తరువాత ఆయన తరఫు లాయర్లు కౌన్సిల ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా సమాధానాలు పంపించారు.
ఏదిఏమైనా, ఈ నివేదికలో ట్రంప్‌కు రాజకీయంగా నష్టం కలిగించే అంశాలు ఉండవచ్చని బీబీసీ ఉత్తర అమెరికా ప్రతినిధి ఆంథొని జుర్కర్ అన్నారు. అయితే, ట్రంప్ ఇప్పటికే తాను శ్వేత సౌధంలోకి అడుగుపెట్టటడానికి చాలా మందిని రాజకీయంగా అణచివేశారని, ఒక వేళ రష్యా 'కుమ్మక్కు'కు సంబంధించి బలమైన క్రిమినల్ కేసు కనుక ఈ నివేదికలో లేకపోతే ట్రంప్, ఆయన వైట్ హౌస్ సహచరులు తమను అకారణంగా వేధించారని గొంతెత్తుతారనడంలో సందేహం లేదని ఆంథొని విశ్లేషించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రభుత్వ స్పందన ఏమిటి?
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ ఒక ప్రకటన చేస్తూ, "ఇక తదుపరి చర్య ఏమిటన్నది అటార్నీ జనరల్ బార్ చేతిలో ఉంది. అయితే, ఇంతవరకూ స్పెషల్ కౌన్సిల్ రిపోర్ట్ గురించి మాకు అధికారిక సమాచారం ఏదీ అందలేదు" అని అన్నారు.
ట్రంప్ వ్యక్తిగత లాయర్ రూడీ గిలియానీ , జే సెకులోవ్ కూడా దాదాపు అదే విధంగా స్పందించారు. "ముల్లర్ తన నివేదికను పూర్తి చేసి సమర్పించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. తదుపరి సరైన చర్యలు ఏమిటన్నది బార్ నిర్ణయించాల్సి ఉంది" అని వారన్నారు.
తరువాత ఏమవుతుంది...
నిజంగానే, తరువాత ఏం జరుగుతుందన్నది బార్ చేతిలో ఉంది. చట్టప్రకారం అటార్నీ జనరల్ ఆ నివేదికను బహిరంగం చేయాల్సిన అవసరమేమీ లేదు. కానీ, సెనెటర్ల ఎదుట విచారణ చేస్తున్న సమయంలో ఆయన దీనిపై రూపొందే నివేదికలో వీలైనంత వరకు వెల్లడి చేస్తానని మాటిచ్చారు.
ఆయన కనుక కాంగ్రెస్‌కు పూర్తి వివరాలు వెల్లడి చేస్తే, కాంగ్రెస్ సభ్యులు దాన్ని జన సామాన్యానికి లీక్ చేస్తారు. 2020 అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో అభ్యర్థులు సహజంగానే ఈ నివేదికను పూర్తిగా ప్రజలకు వెల్లడిస్తామనే హామీలు ఇచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- న్యూజీలాండ్ క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పులు: ఆత్మీయులను కోల్పోయిన వారి అంతరంగం
- BBC Reality Check: భారత్దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- గాంధీనగర్: అమిత్ షా పోటీచేస్తున్న బీజేపీ కంచుకోట చరిత్ర
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- ఫేస్ బ్లైండ్నెస్: మతిమరుపు కాదు... మనుషుల ముఖాలను గుర్తించలేని మానసిక వ్యాధి
- ఎవరెస్టు మీద బయటపడుతున్న పర్వతారోహకుల మృతదేహాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








