'బాక్సర్ ముహమ్మద్ ఆలీ తన జీవిత చరిత్రల్లో వ్యక్తిగా తాను ఎలాంటివాడో చెప్పలేదు. ఈ ఏడాది వచ్చే నా పుస్తకం చూడండి' -ఆలీ మాజీ భార్య ఖలీలా

- రచయిత, రజిత జనగామ
- హోదా, బీబీసీ కోసం
"ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ ముహమ్మద్ ఆలీ తన జీవిత చరిత్రల పుస్తకాల్లో వ్యక్తిగా తానేమిటో నిజాలు చెప్పలేదు. మా నిజమైన కథలు ఈ ఏడాదిలో విడుదలయ్యే నా పుస్తకంలో చూడొచ్చు" అన్నారు ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మహమ్మద్ ఆలీ మాజీ భార్య ఖలీలా కమాచో.
ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక మీడియా సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఖలీలాతో బీబీసీ ప్రతినిధి సంభాషించారు. నటి, వ్యాఖ్యాత, సామాజికవేత్త, పీహెచ్‌డీ గ్రహీత, కరాటేలో తొమ్మిదో డిగ్రీ బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన ఖలీలా.. 1960వ దశకంలో ఎన్నో సామాజిక పోరాటాల్లో పాల్గొన్నారు. వియత్నాం యుద్ధంలో నల్లజాతీయులకు మద్దతుగా నిలిచారు.
ఆమె పదిహేడేళ్ల వయసులో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ ముహమ్మద్ అలీని పెళ్లాడారు. ఆమె అసలు పేరు బెలిండా బాయెడ్. ఆలీని పెళ్ళి చేసుకోవడం కోసం ఆమె ముస్లింగా మారారు.
ఆలీకి అత్యంత క్లిష్ట సమయాల్లో అండగా నిలిచిన ఖలీలా పదేళ్ల తర్వాత ఆయనతో విడిపోయారు. అప్పటి నుంచి దేశవిదేశాల్లో పర్యటిస్తూ, యువతలో స్ఫూర్తి నింపుతున్నారు.

ఫ్లోరిడాకు రావడానికి కారణం.. ?
మా పూర్వీకులు పాకిస్తాన్ (కరాచీ)కు చెందినవారు. నేను భారతదేశానికి కూడా వెళ్లాను.
'కాఫీ విత్ ఖలీలా అలీ' అనే ఓ సెలెబ్రిటీ టాక్ షో చేస్తున్నాను. దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్‌ను వెతికేందుకు, నా బృందంతో ఇక్కడికొచ్చాను.
బాక్సర్ ముహమ్మద్ అలీతో మీ వివాహబంధం గురించి చెబుతారా?
ముహమ్మద్ నా మాజీ భర్త. మాకు ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. మేము ఆయన వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము. మేం కలిసి ఎన్నో పనులు చేశాం. కలిసి జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నించాం. మేం 60వ దశకంలో పోరాటాల్లో పాల్గొనేటప్పుడు, 'మిచెల్ ఒబామా' మా నుంచి స్ఫూర్తిపొందారు.

ఫొటో సోర్స్, Khalilah Camahcho/FACEBOOK
ఒక 'లెజెండరీ సెలబ్రిటీ' భార్యగా మీ జీవితం ఎలా ఉండేది?
అదొక క్లిష్టమైన పరిస్థితి. మేమిద్దరం కలిసి ఉన్నప్పటి మా అనుభవాలు, ఒకరికొకరం మద్దతు ఇచ్చుకుంటూ సవాళ్ళను అధిగమించడం, మా పిల్లల పెంపకం ఇలాంటి చాలా సంగతులు ఎక్కడా ఎవరూ రాయలేదు.
ముహమ్మద్ అలీ జీవితచరిత్రల్లో కూడా, వ్యక్తిగా తనేంటో నిజాలు చెప్పలేదు. అదృష్టవశాత్తు, ఈ ఏడాదిలోపు నా పుస్తకం విడుదలవ్వొచ్చు, మా నిజమైన కథలు, మేం కలిసి చేసిన ప్రయాణం, ఇవాళ మేమిలా ఉండడానికి చేసిన త్యాగాలు అందులో చెబుతాను.
ఒక ప్రముఖుడి భార్యగా.. ఎలాంటి సమస్యలొచ్చాయి. సమాజం ఎలా ఆదరించింది?
ప్రముఖుడికి భార్య అయితే, సహజంగా ఆయనకు సరితూగేలా నడుచుకోవాల్సి ఉంటుంది. ఆయనకు అండగా నిలవాలి. అలీకి అవసరం అయినప్పుడు, ఆయన అభద్రతతో, సమస్యల్లో ఉన్నపుడు.. నేను సాయం చేశాను. మార్గదర్శిగా మద్దతుగా నిలిచాను. ప్రముఖులుగా ఉన్నపుడు ప్రజాదరణ సహజం. కానీ, ప్రముఖుడితో కలిసి జీవిస్తున్నపుడు, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునేప్పుడు.. బయట ఎవరు చూస్తున్నారనే విషయం వర్తించదు. అదీ జీవితంలో ఒక భాగమే. ఏది జరిగినా, ఆయనతో పాటు అనుభవించాల్సిందే, పంచుకోవాల్సిందే. ఆయన భార్యగా ఉండటం అంత కఠినమైన విషయం కాదు. కానీ, విషయమేదైనా.. ఆయనకు మద్దతివ్వాల్సిందే.

ఆలీతో కలిసున్నపుడు మిమ్మల్ని బాగా కలవరపెట్టిన అంశాలేమిటి, మీ సహజీవనంలోని ఉత్తమమైన సందర్భాలేంటి?
ఆయన తిరిగి బాక్సింగ్‌లో పాల్గొనేందుకు లైసెన్స్ పొందడం మా జీవితంలో అత్యుత్తమ సందర్భం.
(అమెరికా ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసింది. ఒలింపిక్స్ పతకంతో సహా ఆయన గెల్చుకున్న అన్ని పతకాలను, లైసెన్సును తీసేసుకున్ననారు. ఆ మూడేళ్ళూ మా జీవితాల్లో అత్యంత కఠినమైన రోజులు. 1966లో వియత్నాంపై యుద్ధం చేసేందుకు ఆర్మీ లో చేరాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాన్ని ఆలీ ప్రతిఘటించారు. నల్లజాతీయుల పోరాటానికి మద్దతుగా నిలిచారు. మూడేళ్ళ న్యాయ పోరాటంతో మళ్లీ లైసెన్స్ పొందారు).
అలాగే, మాకు కలిగిన సంతానం, వారి వల్ల కలిగిన అనుభూతులన్నీ మా జీవితంలో మరచిపోలేని క్షణాలే.
మీరు ఒక సినీనటి. ఇపుడు టీవీ వ్యాఖ్యాతగా మారారు. ఈ మార్పు ఎలా ఉంది?
ఇది పెద్ద మార్పేమీ కాదు? మేం ప్రతిరోజూ ప్రముఖులను కలుస్తూనే ఉంటాం. వారితో వివిధ కార్యక్రమాలకు వెళుతూనే ఉంటాం. ఇపుడు స్పాట్ లైట్ నాపై ఉండటమనే మార్పు తప్ప, మళ్ళీ అంతా అదే చేస్తున్నా. ఇదంతా నాకు అలవాటే. దీనికోసం నేను శిక్షణ పొందే ఉన్నాను.

మీరు నటిగా ఉన్నపుడు, అలీ భార్య కాదు. కానీ ఇపుడు అలీ మాజీ భార్యగానే ఎక్కువమంది గుర్తిస్తున్నారు. ఈ విషయాన్ని మీరెలా చూస్తారు?
ఒక ప్రముఖుడ్ని పెళ్లి చేసుకున్నప్పటికీ మన లక్ష్యాల కోసం మనం పని చేయాల్సిందే. ఇప్పుడు నాకో టీమ్ ఉంది. అన్నీ కలిసి వస్తున్నాయి. ఇప్పుడు నా లక్ష్యం యువతలో స్ఫూర్తి నింపడం, వారిలో నమ్మకాన్ని కలిగించడం. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ ఆస్వాదిస్తూ, వారి భవిష్యత్తుకు వారు సన్నద్ధులయ్యేలా చేయటం.
మీరొక సామాజికవేత్త, నటి, వ్యాఖ్యాత. మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులెదుర్కొన్నారు. మీ అనుభవాలతో.. భవిష్యత్తు తరాలకు ఎలాంటి సూచనలు చేస్తారు?
నేను యువతలో, మహిళల్లో ప్రేరణ కలిగించాలనుకుంటున్నాను. నేను దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాను. వివిధ దేశాలలోని బడులను సందర్శిస్తున్నాను. పిల్లలు స్కూళ్ళకు వచ్చేలా చూస్తున్నాను. వారికి బడి సామగ్రి అందిస్తున్నాను. ఇదంతా దేవుడి ఆశీర్వాదం.
యువతులు తాము అనుకున్నది సాధించాలంటే, ఒంటరి పోరాటం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగాలి. సొంత వెన్నెముకతో వ్యవహరించాలి. తమ కోసం తాము నిలబడాలి. ఇదే అన్నిటికన్నా ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- ‘మొరాకోలో మొదటి మహిళా ట్రెక్కింగ్ గైడ్ నేనే’
- పాకిస్తాన్‌ను ఉర్రూతలూగిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక
- లీగల్ హ్యాకింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్న శాంటియాగో లోపెజ్
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- వీగన్ డైట్‌తో కాలుష్యానికి చెక్ పెట్టొచ్చా?
- భారత్‌లో మహిళలు సురక్షితంగానే ఉన్నారా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








