అమెరికాలో అరెస్టైన 52 మంది భారతీయులు.. స్పందించని కేంద్ర ప్రభుత్వం

ఫొటో సోర్స్, ADMINISTRATION FOR CHILDREN AND FAMILIES AT HHS
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని పిల్లలను నుంచి వేరు చేస్తున్నారని, వారిని జైళ్లలో నిర్బంధిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో, ఇలా నిర్బంధించిన వారిలో 52 మంది భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిని ఒరెగావ్ రాష్ట్రంలోని షెరిడాన్ ప్రాంతంలోని జైలులో ఉంచినట్లు తెలుస్తోంది. భారతీయులను ఉంచిన జైలులోనే బంగ్లాదేశ్, నేపాల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు కూడా ఉన్నారు.
డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయం ఫలితంగా, అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు. అయితే వారి పిల్లలను మాత్రం ప్రత్యేకమైన క్యాంపులలో నిర్బంధిస్తున్నారు.

వెనక్కి తగ్గిన ట్రంప్
పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రమైన నిరనసలు వ్యక్తం అయ్యాయి. స్వయానా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సతీమణి లారా బుష్ కూడా ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసే ఆదేశాలను ఉపసంహరించుకున్నారు.
అమెరికా అంతటా ఇలా తల్లిదండ్రుల నుంచి వేరు చేసిన పిల్లల సంఖ్య సుమారు 2 వేల మంది వరకు ఉన్నారు. కానీ వీరిలో భారతీయులకు చెందిన పిల్లలు ఉన్నారో లేదో తెలీదు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడ రాజకీయ ఆశ్రయం పొందుతున్న వారిలో దక్షిణ అమెరికాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరితో పోలిస్తే భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా అమెరికాలో ప్రవేశిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ. అయినా వారి సంఖ్య ఇంకా వేలల్లోనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిస్పందించని భారత ప్రభుత్వం
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం గత ఏడాది అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరుతూ 7 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు.
అమెరికాలోని జైళ్లలో నిర్బంధించిన భారతీయులకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందనా లేదు. దీనిపై బీబీసీ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించగా, అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన 52 మంది భారతీయుల అరెస్టుపై ఆ శాఖ ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేకపోయింది.
ఒరెగావ్ స్థానిక రాజకీయ నేతలు చెబుతున్న దానిని బట్టి, అరెస్ట్ చేసిన భారతీయులలో హిందీ, పంజాబీ మాట్లాడేవారు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో వివక్షను ఎదుర్కొంటున్నందుకే తాము భారతదేశం వీడి అమెరికా వచ్చినట్లు వీరు వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత సంతతికి చెందిన ఎంపీ ప్రమీలా జయపాల్ కూడా పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్న విధానాన్ని వ్యతిరేకించారు.
స్థానిక జైలును సందర్శించిన అనంతరం ఆమె, జైలులో ఉన్న వారిలో ఎక్కువ మంది రాజకీయ శరణార్థులే ఉన్నారని తెలిపారు. జైలులో ఉన్నవారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, వారి పిల్లలను వారి నుంచి వేరు చేయడం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
కాగా నలుగురు అమెరికా కాంగ్రెస్ సభ్యుల ప్రతినిధి బృందం ఒరెగావ్‌లోని జైలును సందర్శించినపుడు, ఖైదీలు వారికి తమను దాదాపు 22 గంటల పాటు జైలు గదుల్లోనే బంధిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సెల్‌లో ముగ్గురిని ఉంచుతున్నట్లు, తమను తమ లాయర్లతో కూడా మాట్లాడేందుకు అనుమతించడం లేదని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








