ట్రంప్‌తో భేటీ రద్దు చేసుకుంటాం ఉత్తరకొరియా హెచ్చరిక

కిమ్-ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అణు ఆయుధాలను వదిలిపెట్టాలని అమెరికా బలవంతం చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తమ అధ్యక్షుడు కిమ్ భేటీని పున:పరిశీలిస్తామని ఉత్తర కొరియా తెలిపింది.

అంతకు ముందు బుధవారం దక్షిణ కొరియాతో జరగాల్సిన ఉన్నతస్థాయి చర్చలను రద్దు చేసుకుంది.

అమెరికాతో కలసి దక్షిణ కొరియా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ దీనిపై స్పందిస్తూ, ''ఆ రెండు దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాలు తమను రెచ్చగెట్టేలా ఉన్నాయి. తమపై దాడి చేసే ముందస్తు సైనిక విన్యాసాలుగా వాటిని భావిస్తున్నాం'' అని పేర్కొంది.

అలాగే, దీని ప్రభావం చారిత్రాత్మక కిమ్- ట్రంప్ భేటీపై పడుతుందని అమెరికాను హెచ్చరించింది.

వీడియో క్యాప్షన్, వీడియో: కిమ్-ట్రంప్ శత్రువులా.. ప్రియమైన శత్రువులా?

సింగపూర్‌లో జూన్ 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధినేత కిమ్ భేటీ కావాల్సి ఉంది.

కిమ్‌ పంపిన చర్చల ఆహ్వానానికి ఆమోదం తెలుపుతూ గత మార్చిలో ట్రంప్ నిర్ణయం తీసుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

''మా భేటీతో ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తాం'' అని ట్రంప్ ట్వీట్ కూడా చేశారు.

మరోవైపు, ట్రంప్-కిమ్ భేటీకి సన్నాహాలు చేస్తున్నామని, ఉత్తర కొరియా ప్రకటనపై తమకు సమాచారం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో సమైక్య కొరియా ఆకృతిలో రూపొందించిన పూల తోట

ఫొటో సోర్స్, Chung Sung-Jun

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో సమైక్య కొరియా ఆకృతిలో రూపొందించిన పూల తోట ఈ చర్చల ఫలితాలపై ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోంది

ఉత్తర కొరియా ఎందుకు రద్దు చేసుకుంది?

గత ఏప్రిల్ 27న ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఈ భేటీ నిర్వహించాల్సి ఉంది.

ఇరు దేశాల మధ్యన ఉన్న నిస్సైనిక కేంద్రం పాన్‌మున్‌జొమ్‌ (దీన్ని సంధి పట్టణంగా పిలుస్తారు)ప్రాంతంలో భేటీ కావాలని ఈ వారం మొదట్లోనే ఇరు దేశాలు అంగీకరించాయి.

ఈ చారిత్రక సదస్సులో అణు ఆయుధాల తొలగింపు, యుద్ధ విరమణ, శాంతి ఒప్పందాలపై చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ప్రణాళికలు రచించారు.

మరో వైపు, ఇరు దేశాల మధ్య చర్చల కొనసాగింపునకు అమెరికా, చైనాలు ప్రయత్నిస్తున్నాయి.

ఉభయ కొరియాల సరిహద్దులో ఉన్న ‘పీస్ హౌస్’

ఫొటో సోర్స్, EPA

ట్రంప్-కిమ్ భేటీ జరిగేనా?

ఉత్తర కొరియా .. బుధవారం దక్షిణ కొరియాతో జరగాల్సిన చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో అమెరికాకు హెచ్చరికలు పంపినట్లైంది.

''దక్షిణ కొరియాతో అమెరికా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేయడంతోనే మేం చర్చలను రద్దు చేసుకున్నాం. దీని ప్రభావం కిమ్ ట్రంప్ భేటీపైనా ఉంటుంది. ఈ విషయం అమెరికా నిశితంగా పరిశీలిస్తుందని భావిస్తున్నాం'' అని ఉత్తర కొరియా వార్తా సంస్థ తెలిపింది.

ఈ పరిణామాలపై బీబీసీ దక్షిణ కొరియా ప్రతినిధి లారా బికెర్ మాట్లాడుతూ, ''ఉత్తర కొరియా ప్రకటనను గమనిస్తే ట్రంప్‌తో భేటీపై ఆ దేశం సందేహంలో పడినట్లు అనిపిస్తుంది. ట్రంప్‌తో చర్చలు రద్దు చేసుకుంటున్నాం అని చెప్పడానికి బదులుగా భేటీపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.' అని విశ్లేషించారు.

భేటీ రద్దు పై వస్తున్న ఊహాగానాలపై స్పందించేందుకు అమెరికా నిరాకరించింది.

దక్షిణ కొరియాతో చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించిన వెంటనే అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది.

''ట్రంప్- కిమ్ భేటీపై సన్నాహాలు చేస్తున్నాం'' అని అమెరికా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

చర్చల రద్దుపై ఉత్తర కొరియా నుంచి తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)