కొరియాలో శాంతి చర్యలు: సరిహద్దులో లౌడ్ స్సీకర్లు తొలగిస్తున్న దక్షిణ కొరియా

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియాతో సరిహద్దు వద్ద గతంలో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను దక్షిణ కొరియా తొలగిస్తోంది. ఉత్తర కొరియా కూడా తన వైపు ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తీసివేస్తున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పింది.
ఏళ్ల తరబడి శత్రుదేశాలుగా ఉన్న ఇరు దేశాలూ తమ తమ ప్రచారాలను సరిహద్దుకు ఆవలివైపు వినిపించేందుకు ఈ లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసుకున్నాయి.
ఇటీవల ఉభయ కొరియా నాయకుల చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగిన నేపథ్యంలో.. సుహృద్భావానికి సంకేతంగా చేపడుతున్న చర్యల పరంపరలో భాగంగా ఈ లౌడ్ స్పీకర్లను కూడా తొలగిస్తున్నారు.
శుక్రవారం జరిగిన శిఖరాగ్ర చర్చల్లో.. విభేదాలకు ముగింపు పలకాలని, కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా చేయాలని ఇరు పక్షాలూ అంగీకారానికి వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ అంశంపై చర్చించటానికి ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ కొన్ని వారాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు.
దక్షిణ కొరియా 1960వ దశకంలో ఈ లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచీ కొరియన్ పాప్ మ్యూజిక్ నుంచి వార్తా కథనాల వరకూ అన్నిటినీ వీటి ద్వారా సరిహద్దుకు ఆవల ఉత్తర కొరియాలోకి పంపిస్తూ ఉంది.
ముఖ్యంగా ఉత్తర కొరియా సైనికులు లక్ష్యంగా ఈ స్పీకర్లను ఏర్పాటు చేసింది. వీటిని వినడం ద్వారా ఆ సైనికుల్లో ఉత్తర కొరియా నాయకత్వం వైఖరిని సందేహాలు తలెత్తేలా చేయొచ్చని దక్షిణ కొరియా ఆలోచన.
అయితే.. ఎన్ని స్పీకర్లు ఏర్పాటు చేసిందీ, ఎక్కడెక్కడ ఏర్పాటు చేసిందీ దక్షిణ కొరియా ఎన్నడూ వెల్లడి చేయలేదు. శుక్రవారం నాడు జరిగిన చర్చలకు ముందు ఇరు దేశాలూ ఈ లౌడ్ స్పీకర్లలో తమ ప్రచార ప్రసారాలను నిలిపివేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నేపథ్యంలో.. దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వశాఖ తమ వైపు స్పీకర్లను తొలగిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది.
ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని నెలకొల్పడంలో భాగంగా ఈ స్పీకర్లను తొలగిస్తున్నామని దక్షిణ కొరియా చెప్పింది.
ఉత్తర కొరియాలోకి తమ సొంత కరపత్రాలు, సరఫరాలను పంపించే ప్రయివేటు సంస్థలు కూడా ఆ పనులు నిలిపివేయాలని దక్షిణ కొరియా ప్రభుత్వం సూచించింది.
అలా పంపించటాన్ని రెచ్చగొట్టే చర్యలుగా ఉత్తర కొరియా పరిగణిస్తోంది. శిఖరాగ్ర సదస్సులో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయటానికి ప్రైవేటు గ్రూపులు సహకరించాలని దక్షిణ కొరియా అధికారి ఒకరు విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, EPA
కొరియాల సరిహద్దులో ట్రంప్‌తో భేటీ..?
ఇదిలావుంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ భేటీ జూన్ ఆరంభంలో జరుగుతుందని భావిస్తున్నారు.
ఆ సమావేశం కోసం ఇంకా ఏ తేదీని, ప్రాంతాన్ని, వేదికనూ ఖరారు చేయలేదు. అయితే.. సమావేశం జరగగల ప్రాంతాల్లో మంగోలియా, సింగపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఉత్తర కొరియా - దక్షిణ కొరియాల సరిహద్దు వేదికగా ఉంటే బాగుంటుందని ట్రంప్ సోమవారం ఒక ట్వీట్‌లో సూచించారు.
అక్కడ ఉన్న ‘పీస్ హౌస్’ (శాంతి నిలయం) ఈ భేటీకి అనువైనదిగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉభయ కొరియాల సరిహద్దులో దక్షిణం వైపు.. నిస్సైనిక మండలిలో ఉన్న ఈ పీస్ హౌస్ లోనే కొరియా పాలకుల శిఖరాగ్ర సమావేశం జరిగింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








