ఇరాన్‌లో నిరసనలు: మూడో రోజు హింసాత్మకంగా మారిన ప్రదర్శనలు
ఇరాన్‌లోని పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. కొన్ని నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని వీడియో దృశ్యాలు చూపుతున్నాయి.
దిగజారుతున్న జీవన ప్రమాణాలకు నిరసనగా మూడు రోజుల కిందట ఇరాన్‌లో ప్రజల ఆందోళనలు మొదలయ్యాయి. దేశంలో సంస్కరణలు కోరుతూ 2009లో జరిగిన ఆందోళనల తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి.
‘‘చట్టవ్యతిరేకంగా గుమికూడవద్దు’’ అంటూ ఇరాన్ హోంమంత్రి చేసిన హెచ్చరికలను ఆందోళనకారులు పట్టించుకోలేదు.
దోరుద్ పట్టణంలో ఇద్దరు నిరసనకారులు కాల్పుల్లో చనిపోయినట్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో చూపుతోంది.
ఇతర ప్రాంతాల్లో ఆందోళనకారులు పోలీసు వాహనాలను దగ్ధం చేస్తున్న దృశ్యాలు మరికొన్ని వీడియోల్లో కనిపించాయి. ప్రభుత్వ భవనాలపైనా నిరసనకారులు దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, EPA
ఈ నిరసనలు ఎందుకు మొదలయ్యాయి?
ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతుండటం, ఆహారం, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటానికి నిరసనగా తొలుత గురువారం నాడు మష్షాద్ నగరంలో ప్రదర్శనలు మొదలయ్యాయి. శుక్రవారం నాటికి పలు ప్రధాన నగరాలకు నిరసనలు విస్తరించాయి.
ఈ ఆందోళనల వెనుక విప్లవ వ్యతిరేకులు, విదేశీ శక్తులు ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న ప్రజల సంఖ్య కొన్ని ప్రాంతాల్లో వందలుగానూ మరికొన్ని ప్రాంతాల్లో వేలల్లోనూ ఉందని చెప్తున్నారు. అయితే.. భారీ స్థాయి ప్రదర్శనలు జరుగుతున్నట్లు కనిపించటం లేదు.

ఫొటో సోర్స్, AFP
దేశాధ్యక్షుడు హసన్ రౌహనీ, అత్యున్నత పాలకుడు ఖమేనీలతో పాటు.. ముల్లాల పాలనకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.
‘‘జనం అడుక్కుంటున్నారు.. ముల్లాలు దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ శుక్రవారం నాడు నిరసనకారులు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. శక్తివంతమైన ముల్లాల ఆవాసమైన పవిత్ర నగరం ఖోమ్‌లో కూడా ఆందోళన ప్రదర్శనలు జరిగాయి.
ఇరాన్ తన దేశాన్ని పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాలపై దృష్టిసారిస్తోందన్న ఆగ్రహం ఈ నిరసనల్లో వ్యక్తమైంది. ‘‘గాజా కాదు.. లెబనాన్ కాదు.. ఇరాన్‌లో నా జీవితం కావాలి’’ అంటూ మష్షాద్‌లో ఆందోళనకారులు నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, EPA
ఇప్పుడు ఏం జరుగుతోంది?
ఇరాన్ నగరాల్లో ఏం జరుగుతోందన్న సమాచారం ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. దీనిని నిర్ధారించుకోవటం కష్టమవుతోంది.
ఉత్తర ఇరాన్‌లోని అభార్‌లో.. దేశ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ చిత్రమున్న పెద్ద బ్యానర్లకు ఆందోళనకారులు దగ్ధం చేశారు.
సెంట్రల్ ఇరాక్‌లోని అరాక్ నగరంలో ప్రభుత్వానుకూల బాసిజ్ మిలీషియా స్థానిక ప్రధాన కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టినట్లు చెప్తున్నారు.
రాజధాని టెహ్రాన్ నగరంలో.. ఆజాదీ కూడలిలో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమికూడినట్లు బీబీసీ పర్షియన్ చెప్తోంది. అయితే నగరంలో పరిస్థితి అదుపులోనే ఉందని రివల్యూషనరీ గార్డ్స్ సీనియర్ అధికారి చెప్పారు.
నిరసనకారులు ఆందోళనలు కొనసాగించినట్లయితే ‘‘దేశపు ఉక్కు పిడికిలి’’ని ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్ జనరల్ ఎస్మాయిల్ కోసారీ విద్యార్థి వార్తా సంస్థ ఇస్నాతో పేర్కొన్నారు.
ఇక మష్షాద్ నగరంలో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి, పోలీస్ మోటార్‌సైకిళ్లను దగ్ధం చేయటం వీడియోలో కనిపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చాలా చోట్ల ప్రజల మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి.
పశ్చిమ ఇరాన్‌లోని కెర్మాన్షాలో మేకన్ అనే నిరసనకారుడు బీబీసీ పర్షియన్‌కు ఫోన్ చేసి.. ‘‘ఆందోళనకారులపై దాడిచేసి కొట్టారు. కానీ దాడిచేసింది పోలీసులా లేక బాసిజ్ మిలిషియానా అనేది తెలియటం లేదు’’ అని చెప్పారు.
‘‘నేను అధ్యక్షుడు రౌహనీకి వ్యతిరేకంగా ఆందోళన చేయటం లేదు. నిజమే.. ఆర్థిక వ్యవస్థను ఆయన మెరుగుపరచాల్సిన అవసరముంది. కానీ అసలు వ్యవస్థే కుళ్లిపోయింది. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను, దాని సంస్థలను సంస్కరించాల్సి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు.. టెహ్రాన్ యూనివర్సిటీలో నిరసనకారులు అయతొల్లా ఖమేనీ దిగిపోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
మరోవైపు ప్రభుత్వానికి అనుకూలంగా శనివారం దేశవ్యాప్తంగా వేలాది మంది పెద్ద పెద్ద ప్రదర్శనలు నిర్వహించారు. 2009 నాటి వీధి ప్రదర్శనల అణచివేత ఎనిమిదో వార్షికోత్సవ కార్యక్రమాలను ఈ ప్రదర్శనలతో ముందే ప్రారంభించారు.


‘కనువిప్పు కలిగించే మూడు రోజులు’
బీబీసీ పర్షియన్ ప్రతినిధి కస్రా నజీ
శనివారం నాటి నిరసన ప్రదర్శనల స్థాయి తక్కువే అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రోద్బలంతో జరిగిన ప్రదర్శనలకన్నా ఆ నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది.
ఇరాన్‌లో ప్రభుత్వంపై ప్రజలు వీధుల్లోకి వచ్చి వ్యతేకత, నిరసనలు తెలపటం చాలా అరుదు.
శనివారం రాత్రికి కూడా తొమ్మిది నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్ననాయి. కొన్నిచోట్ల పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
ఈ నిరసన ప్రదర్శనలన్నిటిలోనూ వినిపిస్తున్న ప్రధానాంశం.. ఇరాన్‌లో ముల్లా పాలనకు స్వస్తి చెప్పాలనే డిమాండ్.
ప్రజల్లో విస్తృతంగా వ్యక్తమవుతున్న అసంతృప్తి.. అధిక ధరలు, తీవ్ర నిరుద్యోగం మీద ఫిర్యాదులకే పరిమితం కాలేదు.
ఈ మూడు రోజులు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేవిగా భావించవచ్చు. ఆందోళనకారులను మరీ రెచ్చగొట్టకుండా ప్రభుత్వం ఇప్పటివరకూ జాగ్రత్త వహించింది.

ఈ పరిణామాలపై ప్రతిస్పందనలు ఏమిటి?
పోలీసులపై దాడులు చేయటానికి పిలుపునిచ్చిన ఒక ఇరానియన్ అకౌంట్‌ను.. ఇరాన్ సమాచార మంత్రి ఫిర్యాదు నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్‘ సీఈఓ తెలిపారు.
‘‘అణచివేసే ప్రభుత్వాలు ఎల్లకాలం మనజాలవు. ఇరాన్ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే రోజు ఒకటి వస్తుంది. ప్రపంచం గమనిస్తోంది!’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశఆరు.
ట్రంప్, ఇతర అమెరికా నేతల వ్యాఖ్యలు ’’అవకాశవాదంతో కూడుకున్నవి.. మోసపూరితమైనవి’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ విమర్శించింది.
తొలుత ప్రారంభమైన నిరసన ప్రదర్శనల వెనుక ఇరాన్‌లోని ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారని ఉపాధ్యక్షుడు ఎషాక్ జహంగీరీ సూచించినట్లు ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబీ పేర్కొంది.
‘‘ఇప్పుడు దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు ఆర్థిక సమస్యలను సాకుగా చెప్తున్నారు. కానీ వీటి వెనుక మరేదో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలా చేయటం ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బతీయవచ్చునని వారు భావిస్తున్నారు. కానీ ఈ పరిస్థితిని వేరే వాళ్లు ఉపయోగించుకుంటారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సిరియాలో బషర్ అల్-అసద్ సర్కారుకు ఇరాన్ సైనిక సాయం అందిస్తోంది. అలాగే యెమెన్‌లో సౌదీ సారథ్యంలోని సంకీర్ణంతో పోరాడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు కూడా ఇరాన్ ఆయుధాలు అందిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను ఇరాన్ తిరస్కరిస్తోంది. ఇక లెబనాన్‌లో బలమైన షియా వర్గం హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతిస్తోంది.
’’ఇరాన్ ప్రజలకు, కనీస హక్కుల కోసం, అవినీతి అంతం కోసం వారి డిమాండ్లకు బాహాటంగా మద్దతు తెలపాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ అన్ని దేశాలనూ కోరింది.

మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










