ఇరాన్: పెల్లుబికిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
ఇరాన్‌లో గురువారం మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ఇప్పుడు పలు ప్రధాన నగరాలకు విస్తరించాయి.
ఉత్తర ప్రాంతంలోని రాష్త్, పశ్చిమ ప్రాంతంలోని కెర్మాన్షాలలో భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లమీదకు రాగా.. ఇస్ఫాహా, హమాదా తదితర ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు జరిగాయి.
పెరుగుతున్న ధరలకు నిరసనగా మొదలైన ఆందోళనలు.. ముల్లాల పాలనకు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక ప్రదర్శనలుగా మారాయి.
దేశ రాజధాని టెహ్రాన్‌లో కొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగర కూడలిలో నిరసన తెలుపుతున్న 50 మంది బృందాన్ని అరెస్ట్ చేసినట్లు టెహ్రాన్ భద్రతా వ్యవహారాల డిప్యూటీ గవర్నర్ జనరల్.. ఇరాన్ వార్తా సంస్థ లేబర్ న్యూస్ ఏజెన్సీతో పేర్కొన్నారు.
ఈ అరెస్టులను అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది. ‘‘ఇరాన్ ప్రజలకు, కనీస హక్కులు కావాలనే, అవినీతి అంతం కావాలనే వారి డిమాండ్లకు అన్ని దేశాలూ మద్దతు ఇవ్వాలి’’ అని విజ్ఞప్తి చేసింది.


నిరసనలు ఎలా మొదలయ్యాయి?
దేశంలో రెండో పెద్ద నగరమైన మష్షాద్‌లో గురువారం ఆందోళనలు మొదలయ్యాయి. అధిక ధరల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు హసన్ రౌహనీ మీద మండిపడ్డారు. ఆ నిరసనలో ‘‘తీవ్ర నినాదాలు’’ చేసినందుకు గాను 52 మందిని అరెస్ట్ చేశారు.
ఈ నిరసనలు ఇతర నగరాలకు కూడా విస్తరించాయి. కొన్ని ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలుగా మారాయి. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పోలీసుల దాడులను అరికట్టాలని నిరసనకారులు డిమాండ్లు చేశారు.
నిరసన ప్రదర్శనలు నిర్వహించరాదని అధికారులు హెచ్చరికలు జారీచేసినప్పటికీ.. శుక్రవారం మరిన్ని నగరాలకు ఆందోళనలు విస్తరించాయి.
2009లో వివాదాస్పద ఎన్నికల తర్వాత భారీస్థాయిలో జరిగిన ప్రదర్శనల తర్వాత.. జనంలో విస్తృతంగా వ్యాపించివున్న తీవ్ర అసంతృప్తి ఇప్పుడు మళ్లీ ఆందోళనల రూపంలో వ్యక్తమవుతోందని ఇరాన్ పాత్రికేయులు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ప్రజల ఫిర్యాదులు ఏమిటి?
ఆర్థిక పరిస్థితులు, అవినీతికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు రాజకీయ నిరసనలుగా మారాయి.
జనం కేవలం రౌహనీకి వ్యతిరేకంగానే కాదు.. దేశ అత్యున్నత పాలకుడు అయతొల్లా ఖొమేనీకి వ్యతిరేకంగానూ మొత్తంగా ముల్లా పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘‘జనం అడుక్కుంటున్నారు.. ముల్లాలు దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ నిరసనకారులు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. శక్తివంతమైన ముల్లాల ఆవాసమైన పవిత్ర నగరం ఖోమ్‌లో కూడా ఆందోళన ప్రదర్శనలు జరిగాయి.
ఇరాన్ విదేశీ వ్యవహారాలపై కూడా ఈ నిరసనల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ‘‘గాజా కాదు.. లెబనాన్ కాదు.. ఇరాన్‌లో నా జీవితం కావాలి’’, ‘‘సిరియాను వదిలిపెట్టండి.. మా గురించి ఆలోచించండి’’ అని నినాదాలు చేశారు.
సిరియాలో బషర్ అల్-అసద్ సర్కారుకు ఇరాన్ సైనిక సాయం అందిస్తోంది. అలాగే యెమెన్‌లో సౌదీ సారథ్యంలోని సంకీర్ణంతో పోరాడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు కూడా ఇరాన్ ఆయుధాలు అందిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను ఇరాన్ తిరస్కరిస్తోంది. ఇక లెబనాన్‌లో బలమైన షియా వర్గం హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతిస్తోంది.


జనంలో పెల్లుబుకుతున్న అసంతృప్తి
బీబీసీ పర్షియన్ ప్రతినిధి కస్రా నజీ విశ్లేషణ
మరీ భారీ స్థాయిలో కాకున్నా గణనీయంగా పలు నగరాల్లో వెల్లువెత్తిన నిరసన ప్రదర్శనలు.. ఇరాన్ అధికారులను ఖంగుతినిపించాయి. ప్రజల మీద భద్రతా బలగాలు రివల్యూషనరీ గార్డ్, వివిధ నిఘా సంస్థల నియంత్రణ బలంగా ఉన్న ఈ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అరుదు.
ఇందులో విప్లవ వ్యతిరేక శక్తులు, విదేశీ ఏజెంట్ల హస్తముందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ.. ఇరాన్‌లో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న సాధారణ పౌరుల్లో ఉబుకుతున్న అసమ్మతి నుంచి ఈ నిరసనలు పుట్టాయన్నది విస్పష్టం.
ఇరాన్ ప్రజల పేదరికం గత పదేళ్లలోనే సగటున 15 శాతం పెరిగిందని బీబీసీ పర్షియన్ పరిశోధనలో వెల్లడైంది.
దేశ ప్రజల జీవనాన్ని మెరుగుపరచేందుకు ఉపయోగించాల్సిన డబ్బును.. ఇరాన్ పాలకులు సిరియా, యెమెన్, ఇరాక్‌లలో గొడవల కోసం ఉపయోగిస్తున్నారని చాలా మంది జనం భావిస్తున్నారు. మత ప్రచారం, షియా ఇస్లాంను ప్రపంచమంతా విస్తరించేందుకు కూడా వందల కోట్లు ఖర్చుచేస్తున్నారు.
కానీ.. అధ్యక్షుడు రౌహనీని వ్యతిరేకిస్తున్న మితవాదులు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించటం ద్వారా ఈ అలజడిని రాజేసినట్లు కనిపిస్తోంది. ఆ నిరసన వేగంగా దేశంలోని ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










