ఆర్‌ఆర్‌ఆర్‌కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు -హైకోర్టులో పిల్ : ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB/RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైనట్లు 'నమస్తే తెలంగాణ' ఒక వార్తను ప్రచురించింది.
''విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవన విధానాలకు వారి చరిత్రకు వ్యతిరేకంగా ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందించారని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన విద్యార్థిని అల్లూరి సౌమ్య తన పిల్‌లో పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరాదని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులతో పాటు చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్స్, డీవీవీ దానయ్య, కథా రచయిత కేవీ విజయేంద్రప్రసాద్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తెలపినట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.

6 కోట్ల విలువైన 12 ఎకరాలు దానం: కర్నూలు జిల్లాలో దంపతుల దాతృత్వం
కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు నాగేంద్ర, వరలక్ష్మి దంపతులు... రూ.6 కోట్ల విలువైన 12 ఎకరాల సొంత భూమిని 670 మందికి ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసినట్లు 'ఈనాడు' కథనం పేర్కొంది.
''ఇందుకోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో పేదలకు పట్టాలు అందించారు.
ఎలాంటి ఖర్చులూ లేకుండా రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ వేడుకకు తెదేపా, వైకాపా, భాజపా, సీపీఐ, ఎమ్మార్పీఎస్ తదితర పార్టీల నాయకులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ... రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ వంతుగా సాయం చేశామని పేర్కొనట్లు'' ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, FB/JANGAONDEPOT
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కార్డు చెల్లింపులు
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్న టీఎస్ఆర్టీసీ.. టికెట్ల కొనుగోలు సమయంలో చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు సన్నద్ధమవుతోందని 'ఆంధ్రజ్యోతి' ఒక వార్తలో రాసుకొచ్చింది.
''కార్డుల (డెబిట్/ క్రెడిట్) ద్వారా చెల్లింపుల (స్వైపింగ్)తో ప్రయాణికులకు టికెట్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది.
తొలుత హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి జిల్లాలకు నడుపుతున్న బస్సుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది.
టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీలో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు గ్రేటర్ జోన్ వ్యాప్తంగా బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు నగరం నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో కార్డు చెల్లింపులతో టికెట్లు జారీ చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే చిల్లర కష్టాలకు తెర దించడంతోపాటు టికెట్ల రాబడి నేరుగా ఆర్టీసీ బ్యాంక్ ఖాతాలో పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఎంజీబీఎస్, జేబీఎ్‌సల నుంచి రోజూ 4 వేలకు పైగా బస్సులు జిల్లాలకు వెళ్తుంటాయి. తొలి విడతలో 900 బస్సుల్లో కార్డు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ఫలితాల ఆధారంగా అన్ని బస్సుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని బస్‌పాస్ కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ తో చెల్లింపుల సౌకర్యం కల్పించిన తర్వాత ఆదాయం కూడా పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారని'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నజర్
ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారని, దేశంలోని సోషల్ మీడియా అఫెండర్స్‌తో పాటు విదేశాల్లోని ఎన్నారైలపై చర్యలు తీసుకునేందుకు మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ''వెలుగు'' ఒక వార్తను ప్రచురించింది.
''ఎన్నారైలు చేసిన పోస్టులపై కేసుల వివరాలను బయటకు తీస్తున్నారు. సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, సీఐడీలో పెండింగ్ కేసుల రికార్డుల లెక్క తీస్తున్నారు.
సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూతురుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన పంచ్ ప్రభాకర్.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై ఆరోపణలు చేసిన మరో వ్యక్తిపై బుధవారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న ఎన్నారైలకు లుకౌట్ నోటీసులు ఇచ్చామని, వారి వివరాలు కోరుతూ పాస్‌పోర్ట్ అథారిటీకి లేఖలు రాశామని సీటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎమ్ ప్రసాద్ తెలిపారు.
రీజనల్ పాస్‌పోర్ట్ అథారిటీతో కలిసి ఇద్దరి పాస్‌పోర్ట్‌లు, వీసాలు క్యాన్సిల్ చేయించి దేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీస్ శాఖలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో స్పెషల్ పాస్‌పోర్ట్ వింగ్స్ పని చేస్తున్నాయి. ఎన్నారైలపై నమోదైన కేసుల్లో ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ స్పెషల్ పాస్‌పోర్ట్ వింగ్స్ అధికారులు... ఎన్నారైల లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు.
సంబంధిత పోర్టల్‌లో కంప్లైంట్ చేసి.. అసభ్యకరమైన పోస్టింగ్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి రీజనల్ పాస్‌పోర్ట్ అథారిటీకి లెటర్లు రాస్తున్నారు.
ఈ అథారిటీల నుంచి వారి పాస్‌పోర్ట్‌లు, వీసాల వివరాలు తీసుకొని, వాటిని కేన్సిల్ చేయించి ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తారని'' వెలుగు కథనంలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: వ్యాక్సీన్ వేయించుకున్న వారికి కూడా కోవిడ్ ఎందుకు సోకుతోంది?
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: విద్యార్థులతో సూర్య నమస్కారాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు వ్యతిరేకిస్తోంది?
- ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే ఎక్కువ పేదరికం - నీతి ఆయోగ్ నివేదిక : ప్రెస్ రివ్యూ
- బుల్లీ బాయి, సుల్లీ డీల్స్: యాప్‌లో ముస్లిం మహిళల వేలం ప్రధాన సూత్రధారి 18 ఏళ్ల యువతి
- చైనా ప్రజల కష్టాలు: బియ్యం కోసం గాడ్జెట్లు, క్యాబేజీ కోసం సిగరెట్లు మార్పిడి
- ఆన్లైన్ ప్రేమతో ఎడారి పాలైన పాకిస్తాన్ యువకుడు.. ప్రేయసిని కలిసేందుకు సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబాటు
- ఆధునిక చీర కట్టు ఏ రాష్ట్రానికి చెందినది?
- కర్మ అంటే ఏంటి? మనిషికి పునర్జన్మ నిజంగా ఉంటుందా? హిందూ మతం, బౌద్ధ మతం ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








