పవన్ కల్యాణ్: ‘‘బూమ్‌బూమ్ బీరు తాగుతావా, ప్రెసిడెంట్-2 మెడల్ తాగుతావా అంటూ మద్యం అమ్ముతున్నారు' - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, JANASENA
‘ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది. కొన్నేళ్లుగా ఇది జరుగుతున్నా వైకాపా హయాంలోనే రెట్టింపు అయింది. అది ఎంతకు పెరిగిందనేది పోలీసులే చెప్పాలి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లు ఈనాడు తెలిపింది.
‘గంజాయి మొక్కను రాష్ట్ర చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయి’ అని పవన్ కల్యాన్ ఆరోపించారు.
‘‘విశాఖలో మంగళవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
చంటి పిల్లలకు పాలు తాగించినట్లు రాష్ట్రంలో మద్యం తాగిస్తున్నారని పవన్ మండిపడ్డారు.
‘మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన ప్రభుత్వం బూమ్‌బూమ్ బీరు తాగుతావా? ప్రెసిడెంట్ 2మెడల్ తాగుతావా అని అమ్ముతోంది’అని ఆక్షేపించారు.
‘ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. నెల్లూరులో నేను ఇంటర్ చదివిన కళాశాలపైనా దృష్టిపెట్టారు. ప్రతి విద్యార్థికి మేనమామగా ఉంటానని ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు ఆ పిల్లలు చదువుతున్న ఎయిడెడ్ పాఠశాలలను అమ్మేయాలని చూస్తున్నారు. అటువంటి వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లు కూడా తీసుకుంటారు’’’ అని పవన్ కల్యాన్ వ్యాఖ్యానించినట్లు ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై వెనక్కి
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు వెనక్కు తగ్గిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. విలీనానికి అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపింది.
‘‘మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ విషయం స్పష్టం చేశారు. ‘ప్రభుత్వంలో విలీనానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు’ అని సీఎం పేర్కొన్నారు.
‘ఎయిడెడ్ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరం. దీంట్లో రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరం’ అని ఆయన అన్నారు.
ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ‘ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించాం. గతంలో డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నవారు చారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో వాటిని నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది’అని జగన్ వ్యాఖ్యానించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK/PUNEETHRAJKUMAR
అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు
‘‘కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు’’అని సాక్షి వెల్లడించింది.
‘‘తండ్రి సమాధి దగ్గరే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు.
పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
కంఠీరవ రాజ్‌కుమార్‌కు మొత్తం ముగ్గురు కుమారులు. వారిలో పునీత్ చిన్నవాడు. శివరాజ్ కుమార్ పెద్దకొడుకు కాగా, రాఘవేంద్ర రెండోవాడు. ఆయన కుమారుడే వినయ్ రాజ్‌కుమార్. అతని చేతుల మీదుగా పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.
వినయ్ హీరోగా ఎదగడానికి కూడా పునీత్ ఎంతో సహాయపడ్డారు. కర్ణాటక సీఎం సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు’’అని సాక్షి తెలిపింది.

హైదరాబాద్‌లో రూ.100కే రోజంతా సిటీ ఆర్టీసీ ప్రయాణం
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు ఆర్టీసీ కొత్త ఆఫర్ ఇచ్చిందని నమస్తే తెలంగాణ తెలిపింది.
‘‘టీ-24 (ట్రావెల్ 24 అవర్స్) పేరిట రూ.100కే ఒకరోజు పాస్ జారీ చేయనున్నట్టు ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
ఒక రోజంతా జంటనగరాల పరిధిలో ఏ ప్రాంతానికైనా సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఎన్నిసాైర్లెనా ప్రయాణించవచ్చని తెలిపారు. పెరిగిన పెట్రోలు ధరలతో సతమతమవుతున్న ప్రజలు అత్యంత చౌకలో, సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సులోకానీ, బస్‌స్టేషన్ ప్రాంగణంలోకానీ గుట్కా, ఖైనీ, పాన్‌మసాలా వంటివి వాడకూడదని ఎండీ సజ్జనార్ ఆదేశించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్లు, డివిజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లకు మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
ఇవి కూడా చదవండి:
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- ‘‘మేం చనిపోయాక మా పిల్లల పరిస్థితేంటి? నాలాంటి తల్లితండ్రులందరినీ వేధించే ప్రశ్న ఇదే’’
- ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత ‘బలవంతమా.. బాగు కోసమా’
- చైనా కొత్త సరిహద్దు చట్టంపై భారత్ అభ్యంతరాలు.. డ్రాగన్ స్పందన ఏంటి?
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








