ఈటల రాజేందర్: 'కేసీఆర్‌తో ఎక్కడ బెడిసికొట్టిందంటే...' -బీజేపీ నేతతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

వీడియో క్యాప్షన్, ఈటల రాజేందర్‌తో బీబీసీ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ

ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరడం, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఉప ఎన్నిక ఎప్పుడనేది షెడ్యూల్ రానప్పటికీ అప్పుడే ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌తో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ: నియోజకవర్గ ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తోంది?

ఈటల: వర్షంలో కూడా మా గ్రామీణ ప్రాంత ఆడపడుచులు, యువత స్వాగతం పలికారు. మూడు నెలలుగా జరుగుతున్నదంతా మేం చూస్తున్నాం, ఏమీ భయపడొద్దని భరోసా ఇచ్చారు. కేసీఆర్‌కు రైతుల మీద, దళితుల మీద ప్రేమ లేదు, వారి ఓట్లపైనే ప్రేమ ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్ను కాపాడుకునే బాధ్యత, గెలిపించుకునే బాధ్యత మాదేనని జనం నాకు భరోసా ఇచ్చారు.

ఈటల రాజేందర్

బీబీసీ: 18 ఏళ్లుగా కలిసి సాగిన మీకు ఇటీవల కాలంలో ఎందుకు కేసీఆర్‌తో బెడిసికొట్టింది?

ఈటల: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాది తరువాత మంత్రులను కానీ నాయకులను కానీ లెక్కచేయనితనం మొదలైంది కేసీఆర్‌కు. ప్రగతి భవన్‌కు వెళ్తే కలిసేందుకు అనుమతి దొరకని పరిస్థితి.

మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం తెలుసు? అంతా నాకే తెలుసనే భావన కేసీఆర్‌కు పెరిగిపోయింది. ప్రభుత్వ పథకాలు రూపొందించడంలోనూ ఎవరితోనూ సంప్రదించకుండా తనకే తెలుసనే ధోరణితో వ్యవహరించారు. రాజ్యాంగం, ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి దేనిపైనా ఆయనకు విశ్వాసం లేదు. అయినా తొందరపడకుండా అనేక అవమానాలు దిగమింగుకుంటూ కొనసాగాం.

2018 ఎన్నికల్లో మేం ఓడిపోవాలని మా ప్రత్యర్థి నాయకులకు డబ్బులు పంపించారు. ఎదిగే నాయకులు, ఆత్మగౌరవం ఉన్న నాయకులను ఓడించాలని ఆ పనిచేశారు.

ఎన్నికలలో గెలిచినా మూడు నెలలపాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు.

హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా హింస పెట్టారు.

నాపై సొంత పత్రికలో నెగటివ్ వార్తలు రాయించిన తరువాత నేను స్పందించాను.

అనేక సంఘర్షణల తరువాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.

బీబీసీ: మిమ్మల్ని పార్టీలో ఉంచేందుకు చాలా ప్రయత్నాలు చేశానని కేటీఆర్ అన్నారు..

ఈటల: అదే నిజమైతే 2018లో నన్ను ఓడించేందుకు నా ప్రత్యర్థికి డబ్బులు ఎందుకు పంపించారు? నిజంగానే మాపై గౌరవం ఉంటే వాళ్ల సొంత పత్రికలో నాపై ఎందుకు నెగటివ్ వార్తలు ఎందుకు రాయించారు? కరోనాలో నేను పనిచేసినా ఏదో ఫిర్యాదు వచ్చిందని అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని నా కుటుంబంపై ఎందుకు కేసులు పెట్టారు. అవన్నీ మభ్యపెట్టడానికి చెబుతున్న మాటలు.

బీబీసీ: హుజూరాబాద్ ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ ఈటల అనుకోవచ్చా?

ఈటల: ఇది 'తెలంగాణ ప్రజలు వర్సెస్ కేసీఆర్'గా జరుగుతున్న ఎన్నిక. అహంకారానికి, ధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక.

ఈటల రాజేందర్

ఫొటో సోర్స్, Eetala/Twitter

ఫొటో క్యాప్షన్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్‌లతో ఈటల

బీబీసీ: బీజేపీలో చేరడానికి కారణం?

ఈటల: అణగారిన వర్గాలకు అండగా ఉండి, వారి సమస్యల పరిష్కారానికి పనిచేసినవాడిని. ఇందుకు అవకాశం ఉన్న జాతీయ పార్టీ బీజేపీగా భావించి ఇందులో చేరాను. వేదిక ఏదైనా ప్రజల కోసం పనిచేయడమే నా అజెండా. బీజేపీలో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ఇందులో చేరాను.

బీబీసీ: రైతు బంధు, దళిత బంధును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు

ఈటల: ప్రజలకు నిజంగా ఉపయోగపడే స్కీములపై నాకు వ్యతిరేకత లేదు. బెంజ్ కార్లలో తిరిగే వారికి రైతు బంధు ఎందుకు? దీనిక కట్ ఆఫ్ పెట్టాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)